
ఖమ్మం, ఏప్రిల్ 4,
మిర్చి పంటకు సరియైన మద్దతు ధర లేక రైతులు నష్టాల పాలవుతున్నారు. సాగు సమయంలో చీడపీడలు, ప్రకృతి విపత్తుల నుంచి పంటలను కాపాడుకొని ఆశించిన దిగుబడులు సాధించినప్పటికీ పంట విక్రయించే సమయంలో ధర లేక దివాలు తీస్తున్నారు. అయితే, ఇన్నాళ్లు స్తబ్దతగా ఉన్న మిర్చీ ధరలు క్రమంగా పెరుగుతున్నాయి.ఇంటర్నేషనల్ మార్కెట్ లో కదలికల వల్ల మిర్చి యార్డులో ధరలు కొంతమేర పుంజుకుంటున్నాయి. మిర్చి రకాన్ని బట్టి క్వింటాల్ కు సగటున రూ.300 నుంచి రూ.500 వరకు ధరలు అదనంగా చెల్లించి వ్యాపారులు కొనుగోళ్లు జరుపుతున్నారు. దీంతో రైతులకు కాస్త ఊరట లభించినట్లవుతుంది. తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం, వరంగల్ మార్కెట్లతోపాటు ఏపీలోని గుంటూరు నుంచి విదేశాలకు మిర్చి ఎగుమతులు క్రమంగా ఊపందుకుంటున్నాయి. దీంతో మిర్చీకి డిమాండ్ కొనసాగోంది.మిర్చి ధరలు పెరగడానికి పలు కారణాలు ఉన్నాయి. వాటిలో ప్రధానమైంది.. మన రైతులు పండించిన మిర్చి రకాలు చైనా, మలేషియా, థాయిలాండ్, వియాత్నాం, ఇండోనేషియా దేశాలకు ఎగుమతులు క్రమంగా పెరుగుతున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. దీనికితోడు ఇటీవల వరకు ధరలు తక్కువగా ఉండటంతో దేశీయంగా కారంపొడి తయారీ కంపెనీలు మిర్చీ నిల్వలు పెంచుకుంటున్నాయి. దీంతో మిర్చికి డిమాండ్ ఉంటోంది. ఫలితంగా మార్కెట్లకు వచ్చిన సరుకు వచ్చినట్లే అమ్మకాలు జరుగుతున్నాయని, ఈ పరిణామాలు ఇన్నాళ్లు ధరలు లేక ఇబ్బంది పడుతున్న రైతులకు ఊరటనిచ్చే అంశమని వ్యాపారులు చెబుతున్నారు.ప్రస్తుతం తేజా రకం మిర్చి ఖమ్మం మార్కెట్ కు రోజువారీగా 19వేల నుంచి 20వేల క్వింటాళ్ల వరకు వస్తోంది. గత నెల వరకు క్వింటా రూ.11వేల నుంచి 12వేల వరకు పలికి ధరలు.. ప్రస్తుతం రూ.13వేల నుంచి రూ.13500 వరకు పలుకుతోంది. వరంగల్ మార్కెట్ కు రోజువారీగా తేజా రకం మిర్చి 6వేల క్వింటాళ్లకు పైగా వస్తుంది. రూ.13వేల వరకు క్వింటా ధర పలుకుతుంది. అదేవిధంగా వండర్ హాట్ రకం రూ. 14వేల నుంచి రూ.15,500 వరకు ధర పలుకుతుంది.