
హైదరాబాద్, ఏప్రిల్ 4,
తెలంగాణలో 2025-26 విద్యాసంవత్సరానికి సంబంధించి జూనియర్ కాలేజీల అకడమిక్ క్యాలెండర్‌ను ఇంటర్ బోర్డు విడుదల చేసింది. వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించి పనిదినాలు, తరగతులు, సెలవులు, పరీక్షల షెడ్యూల్‌ను ప్రకటించింది. ఈ మేరకు ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య కొత్త అకడమిక్ క్యాలెండర్‌ను విడుదల చేశారు. దీనిప్రకారం.. వచ్చే విద్యాసంవత్సరం మొత్తం 226 పనిదినాలుగా ఇంటర్ బోర్డు నిర్ణయించింది. వేసవి సెలవుల తర్వాత జూన్ 2 నుంచి ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు తరగతులు ప్రారంభంకానున్నాయి. 2026 మార్చి 31 తేదీని విద్యాసంవత్సరం చివరి పనిదినంగా నిర్ణయించారు.ఇంటర్ విద్యార్థులకు ఈ ఏడాది సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 5 వరకు దసరా సెలువులు ఇవ్వనున్నారు. దసరా సెలవుల అనంతరం అక్టోబర్ 6న కాలేజీలు పునఃప్రారంభంకానున్నాయి. అదేవిధంగా.. వచ్చే ఏడాది(2026) జనవరి 11 నుంచి 18 వరకు సంక్రాంతి సెలవులు ప్రకటించారు.
మార్చి మొదటి వారంలో ఇంటర్ పరీక్షలు..
➥ జనవరి 19 నుంచి 24 వరకు ప్రీ ఫైనల్ పరీక్షలు, ఫిబ్రవరి మొదటి వారంలో ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నట్లు అడకమిక్ క్యాలెండర్‌లో పేర్కొన్నారు. మార్చి మొదటి వారంలో ఇంటర్ వార్షిక పరీక్షలు నిర్వహించనున్నట్లు క్యాలెండర్‌లో పేర్కొన్నారు. ఇక 2026 మే చివరి వారంలో ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొంది.
➥ విద్యార్థులకు నవంబర్ 10 నుంచి 15 వరకు అర్థ సంవత్సరం పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డు ప్రకటించింది.
వేసవి సెలవులు ఎప్పుడంటే?
విద్యాసంవత్సరంలో వేసవి సెలవులు 2026 ఏప్రిల్ 1 నుంచి మే 31 వరకు ఇవ్వనున్నట్లు క్యాలెండర్‌లో ఇంటర్ బోర్డు స్పష్టంచేసింది. వచ్చే ఏడాది జూన్ 1వ తేదీన జూనియర్ కాలేజీలు పునః ప్రారంభమవుతాయని ఇంటర్ బోర్డు ప్రకటించింది.
ఇంటర్ అకడమిక్ క్యాలెండర్..
➥ ఇంటర్మీడియేట్ తరగతులు ప్రారంభం: 02.06.2025.
➥ దసరా సెలవులు: 28.09.2025 - 05.10.2025.
➥ అర్థ సంవత్సరం పరీక్షలు: 10.11.2025 - 15.11.2025.
➥ సంక్రాంతి సెలవులు: 11.01.2026 - 18.01.2026.
➥ ప్రీ ఫైనల్ పరీక్షలు: 19.01.2026 - 24.01.2026.
➥ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు: 2026, ఫిబ్రవరి మొదటి వారంలో.
➥ ఇంటర్ వార్షిక పరీక్షలు: 2026 మార్చి మొదటి వారంలో
➥ విద్యాసంవత్సరం చివరి పనిదినం: 31.03.2026.
➥ వేసవి సెలవులు: 01.04.2026 - 31.05.2026.
➥ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు: 2026, మే చివరి వారంలో.
➥ జూనియర్ కాలేజీల పునః ప్రారంభం: 01.06.2026.