
హైదరాబాద్, ఏప్రిల్ 4,
పారిశ్రామిక రంగాలకు కీలకమైన నగరాల్లో మన హైదరాబాద్ ఒకటి. ఇక్కడ మల్టీనేషనల్ కంపెనీలు తమ ఆఫీసులను తెరిచేందుకు మొగ్గు చూపుతున్నాయి. నైపుణ్యం గల మానవ వనరులు, మౌలిక వసతులు సరిపడా ఉండడంతో హైదరాబాద్ నగరంలో వ్యాపార విస్తరణకు కంపెనీలు మొగ్గు చూపుతున్నాయి. దీంతో భాగ్యనగరంలో ఆఫీసు స్థలాలకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. ప్రతి ఏడాది లక్షల చదరపు అడుగుల కార్యాలయాల స్థలాలు లీజుకు వెళ్తున్నాయి. దేశంలోని 8 ప్రధాన నగరాల్లో జనవరి- మార్చి త్రైమాసికంలో చూస్తే ఆఫీసు స్థలాల స్థూల అద్దె ట్రాన్సాక్షన్లు 74 శాతం మేర పెరిగాయి. గత మూడు నెలల్లో 2.82 కోట్ల చదరపు అడుుల ఆఫీసు స్థలాలు అద్దెకు వెళ్లినట్లు ప్రముఖ స్థిరాస్తి సేవల సంస్థ నైట్ ఫ్రాంక్ నివేదిక తెలిపింది.విదేశీ కంపెనీలు గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లను ఏర్పాటు చేసేందుకు ఆసక్తి కనబరచడమే డిమాండ్ పెరిగేందుకు కారణమని నివేదిక తెలిపింది. ఈ మేరకు ఇండియా రియల్ ఎస్టేట్: ఆఫీసు అండ్ రెసిడెన్షియల్ నివేదికలో కీలక విషయాలు వెల్లడించింది. 2025 తొలి త్రైమాసికంలో దేశవ్యాప్తంగా ఆఫీసు స్థలాల మార్కెట్‌కు అసాధారణ గిరాకీ ఉన్నట్లు తెలిపింది. జీసీసీ స్థలాల లీజింగ్ కొత్త గరిష్ఠాలను తాకుతున్నట్లు పేర్కొంది. భారత్‌ను దీర్ఘకాలిక పెట్టుబడి గమ్యస్థానంగా ప్రపంచం గుర్తిస్తోందని తెలిపింది.బెంగళూరు నగరంలో ఆఫీసు స్థలాల అద్దె ట్రాన్సాక్షన్లు 3 రెట్లు పెరిగినట్లు నైట్ ఫ్రాంక్ నివేదిక తెలిపింది. గత ఏడాది జనవరి- మార్చి త్రైమాసికంలో 35 లక్షల చదరపు అడుగుల ఆఫీసు స్థలం అద్దెకు వెళ్లగా ఈసారి 1.27 కోట్ల చదరపు అడుగుల స్థలం అద్దెకు తీసుకున్నట్లు పేర్కొంది. ఆ తర్వాత హైదరాబాద్ మాహానగరం నిలిచిందినట్లు నివేదిక వెల్లడించింది. హైదరాబాద్‌లో గత ఏడాది 30 లక్షల చదరపు అడుగుల ఆఫీసు స్థలాలు అద్దెకు వెళ్లాయి. ఈసారి అది 31 శాతం వృద్ధితో 40 లక్షల చదరపు అడుగులకు చేరినట్లు నివేదిక తెలిపింది. అంటే దాదాపు 9 లక్షల చదరపు అడుగుల ఆఫీసు స్థలాలు అధికంగా అద్దెకు వెళ్లాయి.ఇక పుణె నగరంలో ఆఫీసు స్థలాల అద్దె లావాదేవీల్లో 91 శాతం వృద్ధి కనబడింది. 37 లక్షల చదరపు అడుగుల ఆఫీసు స్థలాలు అద్దెకు వెళ్లాయి. ఇక ముంబై నగరంలో 24 శాతం వృద్ధితో 35 లక్షల చదరపు అడుగులు, చెన్నై నగరంలో 56 శాతం వృద్ధితో 18 లక్షల చదరపు అడుగుల స్థలం అద్దెకు వెళ్లింది. ఢిల్లీ- ఎన్‌సీఆర్ ప్రాంతంలో గత మూడు నెలల్లో 21 లక్షల చదరపు అడుగులు, అహ్మదాబాద్‌లో 2.2 లక్షల చదరపు అడుగులు, కోల్‌కతాలో 1.6 లక్షల చదరపు అడుగుల స్థలాలు లీజుకు వెళ్లాయి