
నెల్లూరు ఏప్రిల్ 4,
వైసీపీ కీలక నేత, పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి కొన్నాళ్లుగా తెరపైకి రావడంలేదు. నిన్న జరిగిన స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధుల మీటింగ్ లో కూడా సజ్జల లేరు. వైసీపీలో సహజంగా ఇలాంటి మీటింగ్ లను ఏర్పాటు చేసేది, నిర్వహించేది కూడా ఆయనే, కానీ తాడేపల్లిలో జరిగిన ఈ మీటింగ్ కి ఆయన హాజరు కాలేదు. కొన్నాళ్లుగా అస్సలు తాడేపల్లిలో జరిగే సమావేశాల్లో, బయట జగన్ పాల్గొనే కార్యక్రమాల్లో కూడా సజ్జల కనపడ్డం లేదు. అసలు సజ్జల ఎక్కడున్నారు, పార్టీ కార్యక్రమాలకు ఎందుకు హాజరు కావడంలేదు..వైసీపీ ఓడిపోయిన తర్వాత సజ్జలపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఆయన వల్లే పార్టీ ఓడిపోయిందని ఓ వర్గం విమర్శలు చేసింది. అయితే జగన్ ఈ మాటల్ని పట్టించుకోలేదు సరికదా సజ్జల ప్రయారిటీని ఆయన ఏమాత్రం తగ్గించలేదు. పార్టీ ఓడిపోయిన తర్వాత జరిగిన నిరసనలు, పార్టీ మీటింగ్ లలో కూడా సజ్జల కీలకంగా వ్యవహరించారు. దీంతో ఆయనను వేలెత్తి చూపించేవారు తర్వాతి కాలంలో సైలెంట్ అయ్యారు. ఇక సజ్జల తనయుడు భార్గవ్ రెడ్డికి పార్టీ సోషల్ మీడియా వింగ్ ని పూర్తిగా అప్పగించేయడం కూడా చాలామందికి ఇష్టం లేనట్టుగా ఉంది. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టుగా చూపించి, జగన్ ని భ్రమల్లో పెట్టి వాస్తవాలు తెలియకుండా చేసి పార్టీకి నష్టం జరిగేలా చేశారంటూ సోషల్ మీడియా వింగ్ పై కూడా విమర్శలు వచ్చాయి. కానీ జగన్ పట్టించుకోలేదు. ఆ తర్వాత పోసాని అరెస్ట్, విచారణలో ఆయన చెప్పిన విషయాలు కొన్ని సజ్జలకు వ్యతిరేకంగా ఉన్నాయి. పార్టీ వీడిన సీనియర్ నాయకుడు విజయసాయిరెడ్డి కూడా జగన్ చుట్టూ కోటరీ ఉందని చేసిన ఆరోపణలు కూడా వైరల్ గా మారాయి. ఆ తర్వాతే సజ్జల పార్టీ వ్యవహారాలకు కాస్త దూరం జరిగినట్టు తెలుస్తోంది. పార్టీ తరపున వాయిస్ వినిపించే ఆయన కొన్నాళ్లుగా మీడియా ముందుకు రావడం లేదు. పార్టీ కార్యక్రమాల్లో కూడా కనపడ్డం లేదు. నిజంగానే జగన్ ఆయన్ను దూరం పెట్టారా లేదా అనేది తేలాల్సి ఉంది.ఒకవేళ తనకు తానే సజ్జల, జగన్ కి దూరంగా ఉన్నారా అనేది కూడా తేలాల్సి ఉంది. సహజంగా ఒక పార్టీలో ఇలాంటి ఆరోపణలు వస్తే.. కొన్నాళ్లు సదరు వ్యక్తి పార్టీకి దూరంగా ఉన్నట్టు సీన్ క్రియేట్ చేస్తారు. ప్రస్తుతం వైసీపీలో కూడా అదే జరుగుతోందా అనేది తేలాల్సి ఉంది. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడ జగన్ ని అంటిపెట్టుకుని ఉన్న సజ్జల, 2024 ఓటమి తర్వాత కూడా కొన్నాళ్లు పార్టీ వ్యవహారాల్లో చురుగ్గా ఉన్నారు. సడన్ గా ఇప్పుడు సైలెంట్ అవ్వడం వెనక ఏదో జరుగుతోందనే అనుమానం ఉంది. పరిస్థితులన్నీ చక్కబడిన తర్వాత ఆయన ఎంట్రీ ఇస్తారేమో తెలియాలి.కీలకమైన నేత కొన్నిరోజులుగా కనపడ్డం లేదు. సోషల్ మీడియాలో ఆయనపై వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై పార్టీ నేతలెవరూ స్పందించకపోవడం విశేషం. ఉద్దేశపూర్వకంగానే వారు స్పందించడంలేదా, లేక వారికి కూడా సరైన సమాచారం లేదా అనేది తేలాల్సి ఉంది. గతంలో పార్టీ చేపట్టే కార్యకలాపాలు, నిరసనలు, ప్రెస్ మీట్లలో మాట్లాడాల్సిన అంశాలు.. ఇలాంటివన్నీ సజ్జల నుంచే బయటకు వచ్చేవి. కానీ ఇప్పుడాయన లేకపోయినా నేతలు మీడియా ముందుకొస్తున్నారు. మరి ఈ ఆదేశాలు ఇచ్చేది ఎవరు, ఎవరి డైరక్షన్లో ఇవన్నీ జరుగుతున్నాయి. నేరుగా జగన్ నేతలతో మాట్లాడే అవకాశం లేదు. కార్యక్రమాల గురించి కబురందించడానికి, వాటిని సమన్వయ పరచడానికి కీలక నేత ఒకరు ఉండాలి. సజ్జల లేనప్పుడు ఆ పని ఎవరు చేస్తున్నారు..? ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి..? మరికొన్నిరోజులాగితే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.