
న్యూఢిల్లీ, ఏప్రిల్ 4,
భారతదేశం, బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ థాయిలాండ్‌లో బంగ్లాదేశ్ ముఖ్య సలహాదారు ముహమ్మద్ యూనస్‌తో భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. గత ఏడాది ఆగస్టులో షేక్ హసీనా పాలన ముగిసిన తర్వాత బంగ్లాదేశ్ ప్రతినిధితో ప్రధాని మోదీ సమావేశం కావడం ఇదే మొదటిసారి. BIMSTEC శిఖరాగ్ర సమావేశం సందర్భంగా యూనస్‌తో ప్రధాని మోడీ సమావేశం అయ్యారు. 2015లో 102వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్‌లో నోబెల్ గ్రహీతకు ప్రధానమంత్రి బంగారు పతకాన్ని ప్రదానం చేస్తున్న ఫోటోను యూనస్ మోడీకి బహుకరించారు.కాగా చైనా-బంగ్లాల మధ్య మిత్రుత్వం పెరుగుతున్న నేపథ్యంలో భారత్-బంగ్లా మధ్య చర్చలు జరగడం గమనార్హం. వాస్తవానికి మోదీతో భేటీ కోసం యూనస్ తరఫున బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ భారత్‌ను అభ్యర్థించింది. తాము భారత ప్రధానితో సమావేశం కోసం ఎదురుచూస్తున్నామని చెప్పడంతో ప్రధాని మోదీ సానుకూలంగా స్పందించి భేటీకి ఒప్పుకున్నారు. షేక్ హసీనా దేశం వీడిన నాటినుంచి భారత్-బంగ్లా సంబంధాల్లో కొంత ఉద్రిక్తత నెలకొంది. మరోవైపు ఆ దేశంలోని మైనార్టీల రక్షణపై భారత్ పలుమార్లు ఆందోళన వ్యక్తం చేసింది.దీనికితోడు ఇటీవల మహమ్మద్ యూనస్ భారత్‌లోని ఈశాన్య రాష్ట్రాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కూడా భారత్-బంగ్లా మధ్య దూరం పెంచింది. ఈ వ్యాఖ్యలను మన విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఖండించారు. ఈశాన్య రాష్ట్రాలకు రోడ్లు, రైళ్లు, జలమార్గాలు, గ్రిడ్‌లు, పైప్‌లైన్లు ఉన్నాయన్నారు. బిమ్‌స్టెక్ దేశాలకు ఇది కీలకమైన కనెక్ట్‌విటీ హబ్‌గా అభివర్ణించారు.