
హైదరాబాద్
ఈ ఇంటి పేరు ధర్మనిలయం, ఆ ఇంట్లో ఓ పెద్దావిడ.. ఆమె పేరు అనుసూయమ్మ సదా రాముణ్ణి ధ్యానించే అనుసూయమ్మ, గత 40 సంవత్సరాలుగా సైదాబాద్ ఏపీఏయూ కాలనీలోని ధర్మనిలయంలో మరమరాలు... వేరుసెనగలతో తీర్చిదిద్దిన పందిరిలో శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం కనుల పండువగా నిర్వహిస్తున్నారు. ఇక్కడ శ్రీ రామనవమి ఉత్సవాలు ఉగాది రోజున ప్రారంభమై నవమి రోజు కళ్యాణంతో ముగుస్తాయి, అంతేగాకుండా రామాయణ ఇతిహాసం తెలియజేసే విధంగా ఏర్పాటు చేసిన బొమ్మల కొలువు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది, ఈ ఉత్సవాలలో నిత్య అన్నదానంలో వేలాదిమంది భక్తులు పాల్గొంటున్నారు.
పశ్చిమగోదావరి జిల్లా భీమవరం దగ్గర్లో ఉండే ఊరి నుంచి వచ్చిన సూర్యనారాయణ రాజు కుటుంబం తమ ఇంట్లోనే ధర్మనిలయం పేరిట రామాలయాన్ని ఏర్పాటు చేశారు. 40 ఏళ్లుగా ఈ నిలయంలో మరమరాలతో పందిరి వేసి కళ్యాణోత్సవం నిర్వహిస్తున్నారు. పదేళ్ల క్రితం సూర్యనారాయణ రాజు శివైక్యం చేయగా ఆయన సతీమణి కుటుంబసభ్యులతో కలిసి ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ఒక్కడ జరిగే ఉత్సవాలకు నగరంలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తారు. ఉత్సవాలలో రామకోటి జపం, విష్ణుసహస్ర నామాలు, నగర సంకీర్తన, భజనలు, హోమాలు, నిత్యాన్నదానం కొనసాగిస్తారు.
60 కిలోల మరమరాలు, 40 కిలోల వేరుశెనగలతో....
మాఘ శుద్ధ పంచమి రోజున గ్రామదేవతకు చలిమిడి, పాలతో అభిషేకించి పందిరి పనులకు శ్రీకారం చుడతారు. మరమరాల ముత్యాల పందిరి అలంకరణను ఉగాది రోజున ప్రారంభిస్తారు. సుమారు 40 మంది మహిళలు రోజు దారాలకు మనమరాలు ఎక్కిస్తారు. 60 కిలోల మరమరాలు, 40 కిలోల వేరుశెనగలను అలంకరణకు వినియోగిస్తారు. రామనామ జపం చేస్తూ మహిళలు ఆధ్యాత్మిక వాతావరణంలో ఈ అల్లికలను సాగిస్తారు.