
విజయవాడ, ఏప్రిల్ 9,
విజయవాడలో దుర్గ గుడి భూముల లీజు వ్యవహారంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. నగరంలో ప్రధాన ప్రాంతంలో ఉన్న దాదాపు ఆరు ఎకరాల భూమి లీజు గడువు ముగియడంతో దానిని మరోమారు పొడిగించాలని లీజుదారుల నుంచి దేవాదాయ శాఖకు ప్రతిపాదనలు అందాయి. అందులో విద్యా సంస్థను నిర్వహిస్తుండటంతో మరో 50ఏళ్లకు పొడిగించాలని లీజుదారులు అభ్యర్థించారు.యాభై ఏళ్లుగా నామమాత్రపు ధరతో ఉన్న దుర్గగుడి భూముల లీజును మరోసారి పొడిగించే ప్రతిపాదనకు దేవాదాయ శాఖ అభ్యంతం తెలిపింది. యాభై ఏళ్ల తర్వాత ఏమి జరుగుతుందో తెలియనందున ఆలయ భూముల్ని సమగ్రంగా సర్వే చేసి వాటిని శాశ్వతంగగా డిజిటల్ రూపంలో భద్రపరిచిన తర్వాత లీజు ప్రక్రియపై ముందుకు వెళ్లాలని ఆ శాఖ కార్యదర్శి కమిషనర్‌ను ఆదేశించారు.ఈ క్రమంలో దుర్గామల్లేశ్వర దేవస్థానం నుంచి పటమట సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు పరిధిలో 5.90ఎకరాల భూమిని లీజుకు తీసుకున్న సిద్ధార్ధ అకాడమీ పేరిట లీజు పొడిగించాలని కొందరు అధికారులు, దేవాదాయ శాఖ అధికారులకు మౌఖికంగా సూచించారు. దీంతో లీజు ప్రతిపాదనల్ని దేవాదాయ శాఖ ఎస్టేట్స్, లీగల్ విభాగం క్షణ్ణంగా అధ్యయనం చేసి చట్ట ప్రకారం సాధ్యం కాదని తేల్చేశారు.యాబై ఏళ్లకు లీజును పొడిగిస్తే అప్పటికి 100ఏళ్లు పూర్తై యాజమాన్య హక్కుల్ని దేవస్థానం కోల్పోతుందని, భూమికి శాశ్వత యజమానులుగా లీజుదారులు అవుతారని అభ్యంతరం అధికారులు అభ్యంతరం తెలిపారు. దీంతో లీజు గడువును తగ్గించి పొడిగించాలనే సూచనలు అందాయి. ఇప్పటికే 50ఏళ్లుగా లీజు కొనసాగుతుండటంతో లీజు పొడిగించడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. కొత్తగా మరోసారి లీజుకు తీసుకోవాల్సిందేనని కొత్త చట్టం ప్రకారమే లీజులు పొందాలని వివరణ ఇచ్చారు.ఈ క్రమంలో దుర్గగుడి భూముల లీజు వ్యవహారాన్ని కొలిక్కి తెచ్చే బాధ్యత ఇంఛార్జి హోదాలో ఉన్న ఉన్నతాధికారి భుజాలకు ఎత్తుకున్నారు. పెద్దసార్ ఆదేశించారంటూ అధికారులపై ఒత్తిడి చేయడంతో లిఖిత పూర్వకంగా వివరణలు, ప్రతిపాదనలు ఇస్తే తప్ప తాము ముందుకు వెళ్లలేమని ఆ శాఖ అధికారులు తేల్చేశారు.దేవాదాయ శాఖ భూములు అన్యాక్రాంతం అవుతుండటంతో దేవాదాయ శాఖ చట్టానికి కొన్నేళ్ల క్రితం మార్పులు చేశారు. పాత చట్టంలో లీజుల పొడిగింపుకు అవకాశం ఉన్నా కొత్త చట్టంలో లీజు పొడిగింపు క్లాజ్ లేదని దేవాదాయ శాఖ వర్గాలు చెబుతున్నాయి.ఇప్పటికే 50ఏళ్లుగా లీజులో ఉన్న భూముల్ని మరోసారి పొడిగించడం ప్రస్తుత చట్టం ప్రకారం సాధ్యం కాదని, అలా చేయాలంటే క్యాబినెట్ స్థాయిలో నిర్ణయం తీసుకోవాల్సిందేనని చెబుతున్నారు. దేవాదాయ శాఖ భూమి లీజు వ్యవహారంపై ప్రభుత్వ స్థాయిలో నిర్ణయం తీసుకోకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంటే భవిష్యత్తులో తలెత్తే న్యాయవివాదాలకు అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుందని భయపడుతున్నారు.ఈ క్రమంలో భూముల లీజు పొడిగించాలని ఒత్తిడి చేస్తోన్న అధికారినే ఏ నిబంధన ప్రకారం భూముల లీజు పొడిగించాలో ప్రతిపాదనలు పంపాలని దేవాదాయ శాఖ అధికారులు సూచించారు. వ్యవసాయేతర భూమిగా వినియోగంలో ఉన్న భూమి విలువను ఎలా నిర్ణయిస్తారో కూడా స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారు. ప్రస్తుతం ఎకరాకు లక్షన్నర లీజుగా చెల్లిస్తుండగా 10శాతం పెంపుదలతో లక్షా 65వేలుగా లీజు ధరను ప్రతిపాదించడంపై కూడా దేవాదాయశాఖ అభ్యంతరం చెబుతోంది.చట్టంలో లీజు పొడిగింపు అవకాశం లేనపుడు బహిరంగంగా జరిగే ప్రక్రియలోనే భూమి ధరను ఖరారు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం అందులో విద్యా సంస్థలు కొనసాగుతుండటంతో బహిరంగ వేలాన్ని మినహాయించినా అద్దె ధరను మాత్రం మార్కెట్ ధరలకు అనుగుణంగా ఖరారు చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు.దేవాదాయ శాఖలో ఇన్‌ఛార్జి హోదాలో బాధ్యతలు నిర్వహిస్తున్న అధికారి లీజు వ్యవహారంలో లిఖిత పూర్వకంగా ప్రతిపాదనలు చేయకుండా ముందుకు వెళ్లలేమని ఆ శాఖ వర్గాలు చెబుతున్నాయి. మౌఖిక ఆదేశాలను పాటిస్తే భవిష్యత్తులో జరిగే పరిణామాలకు తాము బాధ్యత వహించాల్సి వస్తుందని ఆందోళన చెందుతున్నారు.ఈ క్రమంలో గతంలో కానూరు గ్రామ పంచాయితీ పరిధిలో సర్వే నంబర్ 282లో ఉన్న 12.39 ఎకరాల భూమిని యాభై ఏళ్లకు లీజుకు ఇవ్వాలని సిద్ధార్ధ అకాడమీ 1997 నవంబర్ 25న కోరగా అప్పట్లో దేవాదాయ శాఖ లేవనెత్తిన అభ్యంతరాలను గుర్తు చేస్తున్నారు. దుర్గ గుడి భూముల లీజు వ్యవహారంలో మార్కెట్ ధరలకు అనుగుణంగా లేకపోతే నష్టపోవాల్సి వస్తుందని చెబుతున్నారు.1975-76 భూమిని లీజుకు ఇచ్చినపుడు మొదటి ఆరేళ్లు రూ.6వేల రుపాయలకు లీజుకు ఇచ్చారని తర్వాతి పదేళ్లకు రూ.7వేలు, తర్వాత పదేళ్లు 8వేలు, ఆ తర్వాత పదేళ్లు 9వేలు, ఆ తర్వాత పదేళ్లు 10వేలు, ఆ తర్వాత ఏడాదికి రూ.11వేల అద్దె చెల్లించేలా యాభై ఏళ్లకు లీజుకు ఇచ్చినట్టు పేర్కొన్నారు.ప్రస్తుతం సిద్ధార్థ అకాడమీ పేరిట విజయవాడ మొగల్రాజపురంలోని సర్వే నంబర్ 76లో 8.22 ఎకరాలు, పటమట సర్వే నంబర్ 17లో 5.98ఎకరాల భూమి సిద్ధార్ధ అకాడమీ పేరిట లీజుకు ఉంది. 2012 నాటికి ఈ భూముల విలువ రూ.176.34కోట్లుగా నిర్ధారించారు. పటమటలో ఉన్న భూమికి గజం రూ.30వేల చొప్పున రూ.86.83కోట్లు, మొగల్రాజపురంలో ఉన్న భూమికి గజం రూ.22,500 చొప్పున రూ.89.51కోట్లుగా ఉంది. ప్రస్తుతం ఈ విలువలు భారీగా పెరిగాయని దేవాదాయ శాఖకు వచ్చే ఆదాయం ఆ స్థాయిలో లేదని దేవాదాయ శాఖ వర్గాలు చెబుతున్నాయి.