
రాజమండ్రి, ఏప్రిల్ 9,
జక్కంపూడి కుటుంబం జనసేనకు దగ్గరవుతోందా? వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఆ కుటుంబానికి ఆదరణ తగ్గిందా? అందుకే పునరాలోచనలో పడ్డారా? వచ్చే ఎన్నికల నాటికి ఆ కుటుంబం అంతా జనసేన గూటికి చేరుతుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇటీవల జక్కంపూడి రాజా సోదరుడు గణేష్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. మాజీ ఎంపీ మార్గాని భరత్ తో ఉన్న విభేదాలతోనే ఆయన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినట్లు ప్రచారం జరుగుతోంది. కానీ తెర వెనుక వేరే వ్యూహం ఉన్నట్లు తెలుస్తోంది. ముందుగా గణేష్ ను పంపించి.. పరిస్థితి చూసి మిగతావారు జంప్ చేసేందుకు ప్లాన్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది.గోదావరి జిల్లాల్లో జక్కంపూడి కుటుంబానికి సుదీర్ఘ రాజకీయ నేపథ్యం. కాంగ్రెస్ పార్టీ ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు జక్కంపూడి రామ్మోహన్ రావు. కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాల్లో పనిచేశారు. 1989లో కడియం నియోజకవర్గం నుంచి తొలిసారిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. అసెంబ్లీలో అడుగుపెట్టారు. 1994 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. 1999లో కడియం నియోజకవర్గం నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2004లో అదే నియోజకవర్గంలో నుంచి గెలిచిన రామ్మోహన్ రావుకు రాజశేఖర్ రెడ్డి క్యాబినెట్లో మంత్రి పదవి దక్కింది. అయితే 2009లో అనారోగ్యంతో ఎన్నికలకు దూరంగా ఉండి పోవాల్సి వచ్చింది. రాజశేఖర్ రెడ్డి మరణంతో జక్కంపూడి కుటుంబం జగన్ వెంట నడిచింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరింది.2014లో రాజానగరం నియోజకవర్గ నుంచి జక్కంపూడి రాజాకు చాన్స్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. కానీ ఆ ఎన్నికల్లో రాజా ఓడిపోయారు. కానీ 2019 ఎన్నికల్లో మాత్రం రాజా గెలిచారు. అయితే రాజా సోదరుడు గణేష్ మాత్రం రాజమండ్రిలో ఉంటూ రాజకీయాలు చేసేవారు. ఆ సమయంలో ఎంపీ మార్గాని భరత్ తో ఆయనకు విభేదాలు నడిచాయి. అయితే ఈ విషయంలో మార్గాని భరత్ వైపు జగన్మోహన్ రెడ్డి బలంగా నిలబడ్డారు. 2024 ఎన్నికల్లో తనకు ఎంపీ బదులు ఎమ్మెల్యే సీటు ఇవ్వాలని కోరారు భరత్. దీనికి జగన్మోహన్ రెడ్డి అంగీకరించారు కూడా. రాజమండ్రి సిటీ నుంచి అవకాశం ఇచ్చారు కూడా. ఇది ఎంత మాత్రం జక్కంపూడి కుటుంబానికి రుచించలేదు. అందుకే ఆ కుటుంబం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పేందుకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.అయితే ఇప్పటికిప్పుడు కుటుంబమంతా వేరే పార్టీలో చేరితే తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉంది. అందుకే ముందుగా గణేష్ జనసేనలో చేరుతారని తెలుస్తోంది. 2029 ఎన్నికలకు ముందు పరిస్థితుల కు అనుసరించి కుటుంబం మొత్తం ఒక నిర్ణయానికి రాబోతున్నట్లు సమాచారం. పైకి మార్గాని భరత్ తో ఉన్న విభేదాలతోనే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పినట్లు చెబుతున్నా.. వచ్చే ఎన్నికల్లో టార్గెట్ చేసుకుని ఆ కుటుంబం పావులు కదుపుతున్నట్లు అర్థమవుతోంది. మరి మున్ముందు ఆ కుటుంబం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో చూడాలి.