
హైదరాబాద్ ఏప్రిల్ 9,
తెలంగాణలో మిస్ వరల్డ్ సంబరం అంబరాన్నంటేలా జరగబోతోంది. మే నెల 7వతేదీ నుంచి 31వరకు మిస్ వరల్డ్ పోటీలకు సంబంధించిన వివిధ ఈవెంట్లు తెలంగాణలో జరుగుతాయి. దీనికి సంబంధించిన ఏర్పాట్లపై తెలంగాణ టూరిజం సెక్రటరీ స్మిత సభర్వాల్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ముఖ్యంగా.. వెల్కమ్ డిన్నర్ కి సంబంధించిన ఏర్పాట్లను ఆమె పరిశీలించారు. చౌమహల్లా ప్యాలెస్ లో పర్యటించి అధికారులకు పలు సూచనలు చేశారు.హైదరాబాద్ లో జరగబోతున్న మిస్ వరల్డ్ పోటీలకు 120 దేశాలకు చెందిన మోడల్స్ హాజరవుతారు. వీరంతా మే నెల 6, 7 తేదీల్లో హైదరాబాద్ కి చేరుకుంటారు. ప్రారంభ కార్యక్రమంగా మే 7న చార్మినార్ వద్ద హెరిటేజ్ వాక్, అనంతరం చౌమహల్లా ప్యాలెస్ వద్ద వెల్కమ్ డిన్నర్ ఏర్పాటు చేస్తున్నారు. 120 మంది మోడల్స్ తో పాటు ఆయా దేశాలకు చెందిన 400 మంది ప్రతినిధులు, అంతర్జాతీయ మీడియా ప్రతినిధులు, ఫోటోగ్రాఫర్లు ఈ కార్యక్రంలో పాల్గొంటారు. వెల్కమ్ డిన్నర్ కి సంబంధించి చౌమహల్లా ప్యాలెస్ లో ఏర్పాటు చేయాల్సిన కార్యక్రమాలపై తెలంగాణ టూరిజం సెక్రటరీ స్మిత సభర్వాల్, అధికారులకు పలు సూచనలు చేశారు. ప్యాలెస్ లో ఫోటోషూట్ కోసం సీటింగ్ ఏర్పాట్లు, లైవ్ మ్యూజిక్ కాంటెస్ట్, సూఫీ మ్యూజిక్, ఖవ్వాలి మ్యూజిక్ షో ఇక్కడ నిర్వహించబోతున్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా 20 నిమిషాలు పాటు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయన్నారు. ఈ కార్యక్రమాల తర్వాత వెల్కమ్ డిన్నర్ ఉంటుంది. తెలంగాణ రుచులతోపాటు, నిజాం వంటకాలు, ఇతర భారతీయ రుచులు కూడా మెనూలో ఉంటాయి.ఇప్పటి వరకు భారత్ రెండుసార్లు మిస్ వరల్డ్ పోటీలకు ఆతిథ్యం ఇచ్చింది. మొదటిసారి బెంగళూరులో, తర్వాత ముంబైలో పోటీలు జరిగాయి. మూడోసారి ఈ పోటీలకు హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వడం విశేషం. 72వ మిస్ వరల్డ్ పోటీలకు హైదరాబాద్ పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతోంది. నెలరోజులపాటు భాగ్య నగరం సందడిగా మారుతుంది.లండన్ కి చెందిన మిస్ వరల్డ్ సంస్ఖ, తెలంగాణ పర్యాటక శాఖతో కలసి ఈ పోటీలు నిర్వహిస్తుంది. మొత్తం తెలంగాణలో 10వేదికలను గుర్తించగా 8 నుంచి 9 ఈవెంట్లు ఇక్కడ జరుగుతాయి. ప్రారంభ వేడుక, ముగింపు వేడుక హైదరాబాద్ నగరంలో జరుగుతాయి. మిగతా ఈవెంట్లు తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో జరిపేందుకు పర్యాటక శాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. పర్యాటకంగా తెలంగాణకు ఈ ఈవెంట్ మరింత పేరు తెస్తుందని అంటున్నారు అధికారులు. మిస్ వరల్డ్ పోటీలను సమర్థంగా నిర్వహించేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అతిథులకు స్వాగతం, వారి బస ఏర్పాట్లు, ఈవెంట్ల కోఆర్డినేషన్, విదేశీ ప్రతినిధుల సౌకర్యాలు.. అన్నిట్లో అప్రమత్తంగా ఉంటున్నారు. నెలరోజుల ముందునుంచే ఏర్పాట్లకోసం కసరత్తులు ప్రారంభించారు.తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రాష్ట్రం ఆతిథ్య రంగంలో మరింత ప్రాముఖ్యత సంతరించుకునే అవకాశం ఉండటంతో ప్రభుత్వం పోటీల నిర్వహణలో చొరవ తీసుకుంది. అటు అధికార యంత్రాంగం కూడా ఈ పోటీల నిర్వహణ కోసం టీమ్ లను ఏర్పాటు చేసింది. పర్యాటక శాఖతోపాటు జీహెచ్ఎంసీ అధికారులు, పోలీస్ యంత్రాంగం కూడా పోటీల నిర్వహణకోసం సమాయత్తమైంది.