YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

దినకరన్ కు హైకోర్టులో షాక్

దినకరన్ కు హైకోర్టులో షాక్
తమిళనాడులో ఏఐఏడీఎంకే ఎమ్మెల్యేల అనర్హత వేటు కేసులో షాకింగ్ ట్విస్టు చోటు చేసుకుంది. దీంతో తమిళనాడు రాజకీయాలు మరోసారి రసకందాయంలో పడ్డాయి. దినకనర్‌ వర్గానికి చెందిన 18 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు కేసును విచారించిన ఇద్దరు న్యాయమూర్తులు పరస్పరం భిన్నాభిప్రాయాలతో వేర్వేరు తీర్పులు చెప్పారు. ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం ఏకాభిప్రాయంతో స్పష్టమైన తీర్పు వెలువరించకపోవడంతో ఈ కేసులో అనిశ్చితి తొలగిపోలేదు. ఫలితంగా కేసు విచారణను మూడో న్యాయమూర్తికి బదలాయించాల్సిన తప్పనిసరి పరిస్థితి తలెత్తింది. తుది తీర్పులో ఈయన నిర్ణయం కీలకం కానుంది. మద్రాసు హైకోర్టులో  టీటీవీ దినకరన్ వర్గానికి ఊహించని షాక్ తగిలింది. దినకరన్‌ శిబిరంలోని 18 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌పై.. ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం మిశ్రమ తీర్పు వెలువరించింది.ఎమ్మెల్యేల అనర్హత వేటుపై మద్రాస్ హైకోర్టుకు చెందిన ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. దినకరన్‌ వర్గానికి చెందిన 18 మంది ఎమ్మెల్యేలపై స్పీకర్‌ వేసిన అనర్హత వేటు చెల్లుతుందని జస్టిస్‌ ఇంద్రాణి బెనర్జీ తీర్పునివ్వగా.. జస్టిస్‌ సెల్వం దీనికి పూర్తి విరుద్ధంగా తీర్పునిచ్చారు. స్పీకర్‌ నిర్ణయం చెల్లబోదని జస్టిస్ సెల్వం తేల్చి చెప్పారు.  తీర్పు పళనిస్వామి ప్రభుత్వానికి పెద్ద ఊరటగానే చెప్పవచ్చు. 18 మంది ఎమ్మెల్యేల అనర్హత కేసుపైనే పళనిస్వామి ప్రభుత్వ మనుగడ ఆధారపడి ఉంది.తమిళనాడులో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితుల ప్రకారం.. కోర్టు తీర్పు ఎలా వచ్చినా పళనిస్వామి ప్రభుత్వానికి ప్రమాదం తప్పేట్లు లేదు. ఎమ్మెల్యేల సభ్యత్వాల రద్దును ఆమోదిస్తూ హైకోర్టు తీర్పునిస్తే.. ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. అనేక సందిగ్ధ పరిస్థితుల మధ్య అధికారంలో కొనసాగుతున్న పళనిస్వామి ప్రభుత్వం ఈ ఉపఎన్నికల్లో గట్టెక్కడం కష్టమేనని విశ్లేషకుల అభిప్రాయం ఒకవేళ స్పీకర్‌ నిర్ణయాన్ని వ్యతిరేకించి హైకోర్టు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు ఎత్తేసినా.. పళని ప్రభుత్వానికి సంకటమే. ఇదే జరిగితే ఆ ఎమ్మెల్యేలందరూ లేదా వారిలో మెజార్టీ ఎమ్మెల్యేలు డీఎంకేతో చేతులు కలిపి పళనిస్వామి ప్రభుత్వాన్ని కూల్చవచ్చు. ఈ నేపథ్యంలో ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం వేర్వేరు తీర్పులు వెలువరించడంతో పళనిస్వామి ప్రభుత్వానికి తాత్కాలికంగా ఉపశమనం లభించింది. మొత్తం 234 అసెంబ్లీ స్థానాలున్న తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్‌ ఫిగర్‌ 117. ప్రస్తుతం అధికారంలో ఉన్న అన్నాడీఎంకేకు 114 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. మరో 18 మంది ఎమ్మెల్యేలు దినకరన్‌కు మద్దతుగా.. పళని ప్రభుత్వంపై తిరుగుబాటు చేశారు. ఎక్కువ మంది సభ్యుల మద్దతు పళని స్వామికే ఉన్నా.. తగినంత మెజారిటీ మాత్రం లేదు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేల అనర్హత వేటును ఉపసంహరిస్తే.. తిరిగి వీరు పళని ప్రభుత్వాన్ని కూల్చేందుకు దినకరన్‌ వ్యూహాలకు అనుగుణంగా పనిచేసే ప్రమాదం ఉంది. పళనిని సీఎం పదవి నుంచి దింపేసి.. దళిత వ్యక్తిని ముఖ్యమంత్రి పీఠం ఎక్కించాలనే డిమాండ్‌తో దినకరన్‌ ప్రభుత్వానికి చెక్ పెడుతున్నారు. గతేడాది సెప్టెంబర్‌లో పళనిస్వామి ప్రభుత్వం అసెంబ్లీలో బలపరీక్ష సందర్భంగా జరిగిన గందరగోళం నేపథ్యంలో స్పీకర్ ధనపాల్.. అధికార అన్నాడీఎంకేకు చెందిన 18 మంది ఎమ్మెల్యేల సభ్యత్వాన్ని రద్దు చేశారు. అన్నాడీఎంకే విప్‌కు వ్యతిరేకంగా శశికళ అక్క కొడుకైన దినకనర్‌కు మద్దతు తెలపడంతో స్పీకర్‌ వారిపై అనర్హత వేటు వేశారు. వారి నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు నిర్వహించాలని స్పీకర్‌ ఎన్నికల సంఘాన్ని కోరారు. స్పీకర్‌ నిర్ణయంపై ఆ 18 మంది ఎమ్మెల్యేలు మద్రాస్‌ హైకోర్టును ఆశ్రయించారు. స్పీకర్‌ నిర్ణయంపై స్టే విధించిన హైకోర్టు పిటిషన్ విచారణ చేపట్టింది. మొత్తం మీద తీర్పు ఎలా వచ్చినా.. తమిళనాట మరోసారి రాజకీయ సంక్షోభం తప్పేలా లేదు. 

Related Posts