YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

గేమ్ ఛేంజర్ గా హైస్పెడ్ ట్రైన్స్

గేమ్ ఛేంజర్ గా హైస్పెడ్ ట్రైన్స్

హైదరాబాద్, ఏప్రిల్ 10, 
ముంబై-హైదరాబాద్ మధ్య హై-స్పీడ్ రైలు నడపాలనే ప్రతిపాదన మరో బ్రైట్ ఫ్యూచర్‌కు నాంది పలకనుంది. ముంబై-హైదరాబాద్ హై-స్పీడ్ రైలు ప్రాజెక్టుతో దేశ రవాణా వ్యవస్థలోనే విప్లవాత్మక మార్పు అవుతుంది. ఇటు ఐటీ రాజధాని మరోవైపు ఆర్థిక రాజధాని కలిస్తే ఆర్థికాభవృద్ధి మరో ఎత్తుకు ఎదుగుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఇందులో ఇప్పుడు మరో ప్రధాన నగరం కలపాలని భావిస్తున్నారు. దీన్ని ఇప్పటి వరకు ముంబై, హైదరాబాద్ మధ్య నడపాలని భావించారు. కానీ దీన్ని బెంగళూరుకు కూడా అనుసంధానించాలని చూస్తున్నారు. దీనికి  మైసూరు-చెన్నై మధ్య ప్లాన్ చేసిన హైస్పీడ్ రైలు కారిడార్‌ను కూడా కలపనున్నారు. ఇదే జరిగితే హైదరాబాద్, ముంబై, చెన్నై, బెంగళూరు మధ్య ప్రయాణ సమయం చాలా తగ్గిపోనుంది.  ప్రస్తుతం ముంబై-అహ్మదాబాద్ మధ్య హైస్పీడ్ రైలు కారిడార్‌ నిర్మాణం జరుగుతోంది. అది ఒకసారి పూర్తి అయితే మిగతా ప్రాంతాలపై ఫోకస్ పెట్టనున్నారు. ఇంతలో మిగతా ప్రాంతాల మధ్య హైస్పీడ్ రైలు సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేస్తున్నారు. అలా నిర్మించ తలపెట్టిన మార్గాల్లో హైదరాబాద్-ముంబై, హైదరాబాద్-బెంగళూరు, హైదరాబాద్-చెన్నై ఉన్నాయి. కేవలం ఇవే కాకుండా వీటి మధ్య కూడా అనుసంధానిస్తే ఎలా ఉంటుందనే ఆలోచన కూడా కేంద్రం చేస్తోంది.హైదరాబాద్‌ ప్రస్తుతం ప్రయాణ సమయం 15 గంటలకుపైగానే ఉంది. ముంబై-హైదరాబాద్ మధ్య హై-స్పీడ్ రైలు నడిపినట్టు అయితే ఆ టైం చాలా వరకు తగ్గించ వచ్చు. ఎంతా అంటే... మూడున్నర గంటల్లోనే రాకపోకలు సాగించవచ్చు. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లాలంటే వందే భారత్ లాంటి ట్రైన్‌లో 8 గంటలు పడుతుంది. హైస్పీడ్ ట్రైన్ అందుబాటులోకి వస్తే 2 గంటల్లోనే చేరుకోవచ్చు. హైదరాబాద్‌ టు చెన్నై మధ్య దూరం 757 కిలోమీటర్లు. ఈ నగరాల రాకపోకలకు 15 గంటల సమయం పడుతుంది. హైస్పీడ్ రైలులో అయితే రెండున్నర గంటల్లోనే వెళ్లి రావచ్చు. ప్రస్తుతం పరిశీలన దశలో ఉన్న ఈ ప్రాజెక్టులు పూర్తి కావాలంటే మాత్రం పది నుంచి పదిహేనేళ్లు పట్టవచ్చని రైల్వే అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ అనుసంధానం జరిగితే దేశ మౌలిక వసతుల కల్పనలో గేమ్‌ ఛేంజర్ అవుతుందని అంటున్నారు. నేషనల్ హై-స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ నేతృత్వంలో ప్రణాళిక దశలో ఉందీ హైదరాబాద్, ముంబై మధ్య హైస్పీడ్ రైలు ప్రాజెక్టు. ప్రస్తుతానికి ఉన్న అంచనాల ప్రకారం 767 కిలోమీటర్ల ముంబై-హైదరాబాద్ హై-స్పీడ్ రైలు కారిడార్ ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై చర్చ నడుస్తోంది. ముంబైని హైదరాబాద్‌తో 11 వ్యూహాత్మ స్టేషన్ల ద్వారా కలపనుంది. తొలి స్టేషన్ నవీ ముంబైలో ప్రారంభమై కొత్త నవీ ముంబై ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు, మెట్రో, ట్రాన్స్ హార్బర్ మీదుగా లోనావాలా, పూణే, దౌండ్, అక్లుజ్, పంధర్‌పూర్, సోలాపూర్, కలబురగి, జహీరాబాద్ మీదుగా హైదరాబాద్‌కు చేరుకునేలా ప్లాన్ చేస్తున్నారు.   జపాన్ టెక్నాలజీతో నిర్మిస్తున్న ముంబై-అహ్మదాబాద్ హైస్పీడ్ రైలు ప్రాజెక్టు నిర్మిస్తున్నారు. అది పూర్తి అయితే ఆ రెండు నగరాల మధ్య గంటకు 320 కి.మీ వేగంతో ప్రయాణం చేయవచ్చు. ఇప్పుడు అనుకున్నట్టు నాలుగు నగరాల మధ్య హైస్పీడ్‌ ట్రైన్‌ కారిడార్‌తో అనుసంధానం జరిగితే వాణిజ్యం, పెట్టుబడి, వ్యాపార సహకారాన్ని మరింత బలోపేతం అవుతుంది. ప్రయాణ సమయం తగ్గడంతో వస్తువులు, సేవలు, మనుషులరాకపోకలు సజావుగా సాగుతాయి. ఈ నాలుగు రాష్ట్రాల మధ్య ఆర్థిక సమైక్యత పెరుగుతుంది.  కోట్ల మంది ప్రయాణికులకు రవాణా సదుపాయాన్ని వేగవంతం, సౌకర్యవంతం చేస్తుంది. ఇది టూరిజాన్ని కూడా అభివృద్ధి చేస్తుంది. ప్రపంచ స్థాయిలో ఇండియన్ రైల్వే నెట్‌వర్క్ శక్తి మరోసారి నిరూపితం అవతుంది. దేశ సామర్థ్యం రుజువుచేస్తుంది. రైలు మార్గం నిర్మాణంతో ఇంజనీర్లు నుంచి రోజువారి కూలీల వరకు లక్షల ఉద్యోగాలు లభిస్తాయి. ఉపాధి పెరుగుతుంది. కనెక్టివిటీని పెంచడం ద్వారా ఆర్థికవృద్ధి దూసుకెళ్లనుంది. స్టేషన్ ఏర్పాటు చేసిన ప్రాంతాల్లో ప్రగతికి బాటలు పడతాయి. కొత్త వ్యాపారాలు, పరిశ్రమలు, రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు అభివృద్ధి చెందుతాయి. సాధారణ రైళ్లు, మిగతా రవాణా వ్యవస్థలపై భారం తగ్గనుంది. లాజిస్టిక్స్ సామర్థ్యాన్ని పెంచవచ్చు.ఈ హైస్పీడ్ రైలు ప్రాజెక్టు వల్ల పర్యావరణంపై ప్రభావం పడుతుందనే ఆందోళన ఉండనే ఉంది. ఈ కారిడార్‌కు చాలా భూములు కావాల్సి ఉంటుంది. అందుకు ప్రజలను ఒప్పించాలి. చెట్లు కొండలు, గుట్టలు తొలగించాల్సి ఉంటుంది. ఇది నిర్మాణం పూర్తి అయిన తర్వాత చాలా వరకు కర్బన ఉద్గారాలు తగ్గే అవకాశం ఉంది. ఈ ట్రైన్ అందుబాటులోకి వస్తే కార్లు, విమానాలు రైళ్ల వాడకం తగ్గిపోతుంది. దీంతో కాలుష్య ప్రభావం ఉండదనే వాదన బలంగా వినిపిస్తుంది.  ఇలా గంటల్లో జర్నీ చేసినట్టు అయితే ఆయా నగరాలపై జనాభా ఒత్తిడి తగ్గుతుంది. ప్రయాణం ఎక్కవగా ఉండటంతో పని చేసిన చోటే కార్మికులు, ఉద్యోగాలు, ఇతర ప్రజలు ఉండటానికి మొగ్గు చూపుతున్నారు. వారికి ఇష్టం లేకున్నా సరే అక్కడే ఉండాల్సి వస్తోంది. ఇప్పుడు గంటల్లోనే ప్రధాన నగరాల మధ్య ప్రయాణం చేసే వీలు కలిగితే వాళ్లకు నచ్చిన చోట ఉంటారు. దీంతో మెగాసిటీల్లో జనసాంధ్రత తగ్గుతుంది. చిన్న పట్టణాల్లో ఉండేందుకు ఆసక్తి చూపిస్తారు.  హై-స్పీడ్ రైలు ప్రాజెక్టులు చాలా ఖర్‌చుతో కూడుతున్న వి. ఇప్పుడు నిర్మితమవుతున్న ముంబై-అహ్మదాబాద్ కారిడార్ 1.1 లక్షల కోట్ల అంచనాలతో సిద్ధం చేస్తున్నారు. ఇందులో ఎక్కువ నిధులను జపాన్ సమకూరుస్తుంది. ఇప్పుడ ప్రతిపాదిత కారిడార్‌లకు కూడా అంతకు మించి ఖర్చు చేయాల్సి ఉంటుంది. అందుకే ఇక్కడ ప్రభుత్వ నిధులు, ప్రైవేట్ పెట్టుబడి, బహుశా అంతర్జాతీయ రుణాలతో బ్యాలెన్స్ చేయాలి. ప్రజలపై భారం పడకుండా జాగ్రత్త పడాలి.

Related Posts