
న్యూఢిల్లీ, ఏప్రిల్ 10,
బంగ్లాదేశ్ లో కొత్త ప్రభుత్వం భారత వ్యతిరేక విధానాలు పాటిస్తోంది. దీంతో భారత ప్రభుత్వం బంగ్లాదేశ్ కు షాక్ ట్రీట్ మెంట్ ఇచ్చింది. ఇకపై భారత భూభాగం మీదుగా బంగ్లాదేశ్ ఇతర దేశాలకు చేసే ఎగుమతులకు అనుమతిని రద్దు చేసింది. ఒక దేశం పక్క దేశం భూభాగం మీదుగా ఇతర దేశాలకు ఎగుమతులు చేసే ప్రక్రియను ట్రాన్స్‌షిప్‌మెంట్ అని అంటారు.భారత ప్రభుత్వం.. బంగ్లాదేశ్‌కు ఇస్తున్న ముఖ్యమైన ట్రాన్స్‌షిప్‌మెంట్ సదుపాయాన్ని రద్దు చేసినట్టు ప్రకటించింది. 2020లో బంగ్లాదేశ్‌కు ఈ సదుపాయాన్ని భారత ప్రభుత్వం అందించింది. దీని ద్వారా బంగ్లాదేశ్ తన ఎగుమతి సరుకులను భారతదేశంలోని భూభాగం మీదుగా ఉన్న ల్యాండ్ కస్టమ్స్ స్టేషన్లను ఉపయోగించి భారత ఓడరేవులు, విమానాశ్రయాలకు పంపించి, అక్కడి నుంచి ఇతర దేశాలకు ఎగుమతి చేసే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు అలా కుదరదని ఇండియా విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రకటించింది. భారత్ తీసుకున్న ఈ నిర్ణయం తక్షణమే అమలులోకి వచ్చింది.ఈ ట్రాన్స్‌షిప్‌మెంట్ సదుపాయం ద్వారా బంగ్లాదేశ్ తన సరుకులను నేపాల్, భూటాన్ వంటి దేశాలకు వేగంగా, తక్కువ ఖర్చుతో రవాణా చేయగలిగేది. అయితే భారత ప్రభుత్వం ఈ సదుపాయాన్ని నిలిపివేయడానికి అనేక కారణాలను పేర్కొంది. భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ చెప్పిన ప్రకారం.. బంగ్లాదేశ్ కు ఈ సదుపాయం ఉండడంతో ఆ దేశం ఎగుమతుల కారణంగా భారత దేశంలోని విమానాశ్రయాలు, ఓడరేవులు అధిక రద్దీ సమస్య ఎదురవుతోంది. దీని వల్ల సరుకు రవాణాలో ఆలస్యం ఏర్పడుతున్నది. దీంతో పాటు భారత ఎగుమతుల వ్యయం కూడా పెరుగుతోంది. ఈ రద్దీ భారత ఎగుమతులకు ఆటంకంగా మారడంతో ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది.అయితే ఈ నిర్ణయం వెనుక రాజకీయ పూర్వాపరాలు కూడా ఉన్నాయని కొంతమంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారు ముహమ్మద్ యూనస్ ఇటీవల చైనాలో పర్యటించారు. ఆ సందర్భంగా భారత ఈశాన్య ప్రాంతాన్ని ల్యాండ్‌లాక్డ్ ప్రాంతంగా వ్యాఖ్యానిస్తూ, ఆ ప్రాంతంలో చైనా ఆర్థిక ప్రభావాన్ని విస్తరించాలని సూచించారు. ఈ వ్యాఖ్యలు భారత ప్రభుత్వాన్ని తీవ్రంగా ప్రభావితం చేశాయని, అందుకే ప్రతిస్పందనగా భారత ప్రభుత్వం ట్రాన్స్‌షిప్‌మెంట్ సదుపాయాన్ని రద్దు చేసిందని విశ్లేషకులు అంటున్నారు.భారతదేశం తీసుకున్న ఈ నిర్ణయం బంగ్లాదేశ్ ఎగుమతులపై తీవ్ర ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. ముఖ్యంగా అక్కడి రెడీమేడ్ గార్మెంట్ పరిశ్రమ దీనివల్ల గణనీయంగా నష్టపోవచ్చని అంచనా. ఈ సదుపాయం లేకపోవడం వల్ల బంగ్లాదేశ్ ఎగుమతిదారులు రవాణా ఆలస్యాలు, అధిక ఖర్చులు, వ్యాపారంలో అనిశ్చితి వంటి సమస్యలు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడింది. ఫలితంగా నేపాల్, భూటాన్, మయన్మార్ వంటి దేశాలతో బంగ్లాదేశ్ చేస్తున్న వ్యాపారం కూడా దెబ్బతినే ప్రమాదం ఉంది. ఇప్పటికే అమెరికా విధించిన అధిక సుంకాల వల్ల ఇబ్బందుల్లో ఉన్న బంగ్లాదేశ్‌కు ఇది మరో పెద్ద ఆర్థిక సమస్యగా మారింది.ఈ సందర్భంగా అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మాట్లాడుతూ, ఈ నిర్ణయం ఈశాన్య భారత భద్రతను పరిరక్షించాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిబద్ధతను చాటుతుందని అన్నారు. బంగ్లాదేశ్ ట్రాన్స్‌షిప్‌మెంట్ రద్దు నిర్ణయాన్ని భారత దుస్తుల పరిశ్రమ కూడా స్వాగతించింది. అయితే ట్రాన్స్‌షిప్‌మెంట్ సదుపాయం రద్దు కావడం వల్ల భారత్ – బంగ్లాదేశ్ వాణిజ్య సంబంధాలపై గణనీయమైన ప్రభావం పడే అవకాశముంది. ఇది రెండు దేశాల మధ్య ఉనికిలో ఉన్న దౌత్య సంబంధాలలో ఉద్రిక్తతలను ప్రతిబింబిస్తుంది. ఇకపై బంగ్లాదేశ్ తమ ఎగుమతుల కోసం కొత్త మార్గాలను అన్వేషించాల్సిన అవసరం ఏర్పడినంది.