
వరంగల్, ఏప్రిల్ 11,
ఈనెల 27న వరంగల్ సమీపంలోని ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ రజతోత్సవ సభ జరగాల్సి ఉంది. ఈ సభ ద్వారా మరోసారి గులాబి శ్రేణుల్లో ఉత్సాహం తేవాలి చూస్తున్నారు కేసీఆర్. కానీ అది అసాధ్యం అనిపిస్తోంది. సభకు రోజులు దగ్గగరపడినా పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం లేదు. కేవలం బీఆర్ఎస్ హడావిడి మాత్రం కనపడుతోంది. రోజుకి ఒక జిల్లా నేతలతో ఫామ్ హౌస్ లో కేసీఆర్ సమావేశం అవుతున్నారు. పార్టీ సభను విజయవంతం చేయాలని పిలుపునిస్తున్నారు. నేతలు వెళ్తున్నారు, వస్తున్నారు, కేసీఆర్ మాటలు వింటున్నారు కానీ.. సభపై ఎవరికీ ఉత్సాహం లేదని మాత్రం తెలుస్తోంది.అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ సభలకోసం విచ్చలవిడిగా ప్రభుత్వ సొమ్ము ఖర్చు చేసిందని కాంగ్రెస్ తీవ్రంగా విమర్శించింది. బీఆర్ఎస్ ని పొరుగు రాష్ట్రాల్లో విస్తరించేందుకు, అప్పట్లో బస్సు యాత్రలు చేసిన కేసీఆర్.. సీఎం హోదాలో ఆ యాత్రలను చేపట్టారు. ప్రభుత్వ ఖజానా నుంచే సొమ్ము చెల్లించి పార్టీకి సోకులు చేసుకున్నారని తెలుస్తోంది. తాజాగా బీఆర్ఎస్ సభకోసం చేస్తున్న ఖర్చుపై కూడా సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి. పార్టీ సభ కోసం తెలంగాణ ఆర్టీసీ నుంచి 3 వేల బస్సులకోసం 8 కోట్ల రూపాయలు బీఆర్ఎస్ అడ్వాన్స్ గా ఇచ్చిందనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇదంతా ఎవడబ్బ సొమ్మంటూ కాంగ్రెస్ అనుకూల సోషల్ మీడియా అకౌంట్ల నుంచి కౌంటర్లు పడుతున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు దోచుకున్న సొమ్ముని ఇప్పుడిలా విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారని అంటున్నారు.
పింక్ పార్టీ సభ కోసం 8 కోట్ల రూపాయలతో బస్సులా?
ఏం కష్టం చేసి ఇన్ని కోట్లు సంపాదించిన్రురా పింకీస్?
బీఆర్ఎస్ రజతోత్సవ సభకోసం ఇటీవల వెరైటీ ప్రచారం మొదలు పెట్టారు. కీలక నేతలంతా గోడలపై వాల్ పెయింట్స్ వేస్తూ ప్రచారం మొదలు పెట్టారు. బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా గోడలపై కుంచె పట్టి కేసీఆర్ పేరు రాశారు. దీనిపై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ నడుస్తోంది. దొరల వద్ద తన ఆత్మాభిమామాన్ని ఆర్ఎస్ ప్రవీణ్ తాకట్టు పెట్టారని, ఒక జాతీయ పార్టీకి తెలంగాణ రాష్ట్ర అధినేతగా ఉన్న ఆయన, చివరకు కేసీఆర్ తో చేతులు కలిపి ఆయన భజన చేస్తున్నారని ఎద్దేవా చేశారు నెటిజన్లు.బీఆర్ఎస్ అధికారంలో ఉంటే రజతోత్సవ సభ పెద్ద ఎత్తున జరిగేది. అయితే ఇప్పుడు పార్టీ ప్రతిపక్షంలో ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ని దూరం పెట్టిన ప్రజలు, లోక్ సభ ఎన్నికల్లో అసలు పట్టించుకోలేదు. దీంతో ఆ పార్టీకి ప్రజల్లో ఉన్న క్రెడిబిలిటీ ఏంటో స్పష్టమైపోయిందని అంటున్నారు కాంగ్రెస్ నేతలు. రజతోత్సవ సభ అంటూ జనంలోకి వచ్చినా, సభా వేదికపై కేసీఆర్ రెచ్చిపోయినా ఎవరూ నమ్మే పరిస్థితి లేదంటున్నారు. 2023 ఎన్నికల సందర్భంగా కేసీఆర్ సభలకు జనాల్ని పోగు చేశారు, సభలు విజయవంతం అయ్యాయని చెప్పుకున్నారు, కానీ సభలకు వచ్చిన జనం బీఆర్ఎస్ కి మాత్రం ఓట్లు వేయలేదు. సభలకు హాజరైన వారిని చూసి, ఫలానా అభ్యర్థి విజయం ఖాయం అని అక్కడికక్కడే చెప్పేసిన కేసీఆర్, తాను పోటీ చేసిన స్థానంలోనే ఓడిపోవడంతో షాకయ్యారు. చాన్నాళ్లుగా ఆయన ప్రజలకు దూరంగా ఫామ్ హౌస్ లోనే ఉంటున్నారు. అసెంబ్లీకి వచ్చినా మొక్కుబడిగా మాట్లాడి వెళ్లిపోయారు. కనీసం ఈ సభలో అయినా నిజాలు మాట్లాడతారా..? గతంలో చేసిన తప్పుల్ని ఒప్పుకుంటారా..? ప్రజలు తమని ఎందుకు దూరం పెట్టారనే విషయాన్ని పరిగణలోకి తీసుకుంటారా..? వేచి చూడాలి.