
విజయవాడ, ఏప్రిల్ 15,
కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంకీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ముఖ్యంగా ఏపీ విషయంలో అత్యంత శ్రద్ధతో ఉంది. మోదీ నేతృత్వంలో వరుసగా మూడుసార్లు ఎన్డీఏ అధికారంలోకి వచ్చింది. అయితే గత రెండుసార్లు ఏపీకి ఎటువంటి ప్రాధాన్యం దక్కలేదు. అయితే ఈసారి మాత్రం ఎనలేని ప్రాధాన్యం ఇస్తున్నారు ప్రధాని మోదీ. ఎన్డీఏ లో టిడిపి కీలక భాగస్వామి కావడమే అందుకు కారణం. అయితే ఈసారి రాజకీయంగా కూడా ఏపీకి ప్రాధాన్యం ఇవ్వాలని చూస్తున్నారు. గవర్నర్ పోస్ట్ ఒకటి టీడీపీకి కేటాయించాలని సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ తరుణంలో గవర్నర్ పోస్ట్ ఎవరికి ఇస్తారు? అన్నది హాట్ టాపిక్ అవుతోంది.తెలుగుదేశం పార్టీలోగవర్నర్ పోస్ట్ కు ఇద్దరు పెద్దలు వేచి చూస్తున్నారు. అందులో పూసపాటి అశోక్ గజపతిరాజు ఒకరు. మరొకరు మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు. ఇద్దరు నేతలు సమకాలీకులే. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి క్రియాశీలక పాత్ర పోషిస్తున్న వారే. ఆ ఇద్దరు నేతలు ప్రత్యక్ష రాజకీయాలకు దూరమయ్యారు. వారసులను బరిలో దించి రిలాక్స్ అయ్యారు. ఇద్దరు కూడా గౌరవప్రదమైన పదవి విరమణ కోరుకుంటున్నారు. గవర్నర్ పోస్టును ఆశిస్తున్నారు. ఇప్పటివరకు రాజకీయాల్లో మునిగిపోయిన వారు.. రాజ్ భవన్ లో అడుగు పెట్టాలని ఆశపడుతున్నారు.అయితే విశ్వసనీయ సమాచారం మేరకు అశోక్ గజపతిరాజు వైపు చంద్రబాబు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం గవర్నర్ పోస్టుల భర్తీకి సంబంధించి కేంద్రం నుంచి సంకేతాలు వచ్చాయి. తమిళనాడు గవర్నర్ రవిని పక్కన పెడుతున్న తరుణంలో అక్కడ మంచి వ్యక్తిని గవర్నర్ గా నియమించాలన్నది కేంద్ర ప్రజల ప్లాన్. అందుకు అశోక్ గజపతి రాజు అయితే సరిపోతారని ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అశోక్ విషయంలో చంద్రబాబుతో పాటు లోకేష్ సానుకూలంగా ఉన్నారు. పార్టీని ఇరుకున పెట్టేలా ఎప్పుడు అశోక్ గజపతిరాజు వ్యవహరించలేదు. పార్టీతో పాటు అధినేత పట్ల విధేయతతోనే ఉన్నారు. అందుకే అశోక్ పెద్దరికాన్ని గౌరవించాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం నడుస్తోంది.మరోవైపు మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు పేరు గవర్నర్ పోస్ట్ కు పరిశీలనలోకి ఉంది. ఇటీవల ఎమ్మెల్సీగా ఉన్న యనమల పదవీ విరమణ పొందారు. పార్టీతో పాటు అధినేతతో గ్యాప్ ఉందన్నది ఒక ప్రచారం. ఈ తరుణంలో స్వీయ చరిత్రను రాసుకున్నారు యనమల రామకృష్ణుడు. అందులో ఎన్టీఆర్ కంటే చంద్రబాబు పాలనా దక్షుడు అంటూ కొనియాడారు. కానీ ఎందుకో దీనిపై స్పందించలేదు చంద్రబాబు. కనీసం లోకేష్ సైతం నోరు తెరవలేదు. పైగా యనమల కుమార్తె దివ్య పై ఫిర్యాదులు వస్తున్నాయి. అందుకే యనమలను వదిలించుకునేందుకు చంద్రబాబు సిద్ధపడినట్లు ప్రచారం నడుస్తోంది. అయితే యనమల మాత్రం పార్టీతో విభేదాలు పెట్టుకొని అనవసరంగా ఇబ్బందులు పడకూడదని భావిస్తున్నట్లు సమాచారం. మొత్తానికి అయితే ఇద్దరు సీనియర్ల లో ఒక్కరి వైపు మాత్రమే చంద్రబాబు మొగ్గుచూపుతుండడం విశేషం.