
న్యూఢిల్లీ, ఏప్రిల్ 15,
మీరు ఢిల్లీలో నివసిస్తుంటే, మీకు 10 సంవత్సరాల పాత వాహనం ఉంటే, మీరు ఈ వార్త తెలుసుకోవడం చాలా ముఖ్యం. కాలుష్యాన్ని నియంత్రించడానికి ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త విధానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. మీ వాహనం పాతదైతే, పెట్రోల్ పంప్ నుండి పెట్రోల్ వేసుకోలేరని గుర్తించుకోండి.పాత వాహనాలకు సంబంధించి ఢిల్లీ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2024 నుండి ఢిల్లీలో 10 సంవత్సరాల కంటే పాత డీజిల్ వాహనాలు, 15 సంవత్సరాల కంటే పాత పెట్రోల్/సీఎన్జీ వాహనాల రిజిస్ట్రేషన్ రద్దు చేసినట్లు రవాణా శాఖ మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ నిబంధనల పరిధిలోకి వచ్చే వాహనాల సంఖ్య 55 లక్షలకు పైగా ఉంది. అంతేకాకుండా అటువంటి వాహనాలను బహిరంగ ప్రదేశాల్లో పార్కింగ్ చేయడం పూర్తిగా నిషేధించింది.ఇప్పుడు కారు యజమానులు ఆశ్రయించగల కొన్ని ఎంపికలు ఉన్నాయి. బహిరంగ ప్రదేశాల్లో పార్కింగ్ నిషేధం తర్వాత, యజమానులు ప్రైవేట్ పార్కింగ్ స్థలాలను మాత్రమే ఉపయోగించుకోవచ్చు. మీ వాహనం 10 సంవత్సరాలు (డీజిల్) లేదా 15 సంవత్సరాలు (పెట్రోల్, సీఎన్జీ) పూర్తి చేసి ఉంటే, దానిని NCR నుండి బయటకు రావాలంటే ఒక సంవత్సరం లోపు ఎన్వోసీ పొందడం తప్పనిసరి.ఇది కాకుండా, స్క్రాపింగ్ కూడా చివరి ఎంపికగా అందుబాటులో ఉంది. మీరు స్వచ్ఛంద వాహన స్క్రాపింగ్ అప్లికేషన్ ద్వారా మీ వాహనాన్ని స్క్రాప్ చేస్తే కొత్త వాహనం కొనుగోలుపై మీకు మోటారు వాహన పన్ను మినహాయింపు లభిస్తుంది.ఢిల్లీలో పాత వాహనాలను నడిపినా లేదా బహిరంగ ప్రదేశాల్లో పార్క్ చేసినా, మీకు రూ.5,000 నుంచి రూ.10,000 వరకు జరిమానా విధించవచ్చు. అలాగే, మీ వాహనాన్ని కూడా జప్తు చేయవచ్చు. ఢిల్లీ ప్రభుత్వం 477 పెట్రోల్ పంపులలో కొత్త వ్యవస్థను ఏర్పాటు చేయబోతోంది. ఈ వ్యవస్థ సహాయంతో వాహనాల వయస్సుకు సంబంధించిన డేటా అందుబాటులో ఉంటుంది. మీ వాహనం నిర్దేశించిన పరిమితి కంటే పాతదైతే, దానికి పెట్రోల్/డీజిల్‌ను వేయించుకోలేరని గుర్తించుకోండి.