YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

ఖమ్మం కాలుష్య మయం

ఖమ్మం కాలుష్య మయం
ఖమ్మం నగరంలోని ప్రధాన చెరువులు కాలుష్యం కోరల్లో చిక్కుకున్నాయి. వాటిలో లకారం చెరువు ప్రధానమైనది. ఇది కాకుండా నగరంలోని బల్లేపల్లి, ఖానాపురం, ధంసలాపురం, పుట్టకోట చెరువులు ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. లకారం చెరువును నగరానికి తలమానికంగా తీర్చిదిద్దిన ప్రజాప్రతినిధులు, అధికారులు మిగిలిన చెరువుల సంక్షణపై నిర్లిప్తంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ప్రజల నుంచి వినిపిస్తున్నాయి. ముఖ్యంగా నగరంలోని ఖానాపురం, ధంసలాపురం చెరువులు కాలుష్యం బారిన పడ్డాయి. విషరసాయనాలతో తమపై అనేక దుష్ప్రభావాలు కనిపిస్తున్నా కాలుష్య నివారణ చర్యలు చేపట్టడంలో అధికారులు పూర్తిగా విఫలం అయ్యారనే ఆరోపణలు ప్రజల నుంచి బలంగా వినిపిస్తున్నాయి.
ధంసలాపురం పెద్దచెరువు సుమారు 120 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. దీనికింద సుమారు 400 ఎకరాల ఆయకట్టు ఉంది. పరిసరాలలోని ధంసలాపురం, కొత్తూరు, సంభానినగర్‌, కొత్తగూడెం, అల్లీపురం ప్రాంతాలలో భూగర్భజల మట్టం నిలబెట్టి నగర ప్రజలకు ఎంతో మేలు చేసేది. ఇప్పటికే భారీగా ఆక్రమణకు గురయ్యింది. సగానికిపైగా గుర్రపుడెక్క ఆక్రమించేసింది. దుర్వాసన వెదజల్లుతూ రంగు మారిన నీటిలో కాలు పెట్టాలంటేనే ఒళ్లు జలదరిస్తోందంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. లకారం చెరువు అలుగు వాగు ద్వారా వచ్చిచేరే నీటితో ఈ చెరువులో కాలుష్యం పెరుగుతూ వస్తోంది. నగరంలో వినియోగించే పలు రకాల రసాయనిక వ్యర్థాలు, సబ్బు నీరు, ఆసుపత్రుల వ్యర్థాలు, కబేళా వ్యర్థాలు ఈ కాలుష్యానికి కారణంగా తెలుస్తోంది. దీంతో చెరువులో నీటిపై పచ్చని పొరలా చమురు వంటిది తెట్టు కడుతోంది. చెరువు ఇంతలా కాలుష్యం బారిన పడుతున్నా పట్టించుకున్న ప్రజాప్రతినిధులు, అధికారులు లేరు. కాలుష్యంతో గత మూడేళ్ల కాలంలోనే చెరువు స్వరూపం పూర్తిగా మారిపోయిందంటే అతిశయోక్తికాదు. పశువులు సైతం ఈ నీటిని తాగడంలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. దీనిపై సుమారు 80 మంది మత్స్యకారులు ఆధారపడి జీవిస్తున్నారు. కాలుష్యం కారణంగా చేపలు మృత్యువాత పడి వీరు తీవ్రంగా నష్టపోతున్నారు. కాలుష్యం కారణంగా రైతులు సైతం ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు.
ఖానాపురం ఊరచెరువు కింద సుమారు 100 ఎకరాల ఆయకట్టు ఉంది. పరిసరాలలోని పాండురంగాపురం, జయనగర్‌కాలనీ, ఖానాపురం, ప్రశాంతినగర్‌, ఖానాపురం పారిశ్రామిక ప్రాంతాలలో భూగర్భజల మట్టం నిలబెట్టేందుకు ఎంతో ఉపయోగపడుతోంది. ఈ చెరువుపై ఆధారపడి సుమారు 25 మంది మత్స్యకారులు జీవిస్తున్నారు. ఈ చెరువు సైతం ఆక్రమణకు గురవుతోంది. మిషన్‌ కాకతీయ ద్వారా పనులు చేపట్టిన ఈ చెరువు శిఖంలో ఇళ్ల నిర్మాణ అనుమతులు వస్తుండటంతో ఏటేటా చెరువు శిఖం తగ్గిపోతోంది. ఈ చెరువులోకి పాండురంగాపురం, జయనగర్‌కాలనీ, బల్లేపల్లి ప్రాంతాలలోని కాలనీల నుంచి భారీగా మురుగు వచ్చి చేరుతోంది. పూర్తిగా వ్యర్థాలతో కలుషితమైన ఈ మురుగు కారణంగా అనేక సమస్యలు పెరుగుతున్నాయి. గత రెండు, మూడేళ్లుగా చెరువులో నీటి కాలుష్యం క్రమంగా పెరుగుతోంది. శిఖంలో ఉన్న బావి నుంచి నీటిని జయనగర్‌ కాలనీ ప్రాంత ప్రజలకు శుద్ధి చేయకుండా సరఫరా చేస్తున్నారు. విద్యానగర్‌ కాలనీ వైపు నుంచి చెరువులోకి వచ్చి చేరే కలుషిత మురుగు నీరు ఈ బావి చెంతనే పారుతోంది. దీంతో బావి నీటి కాలుష్యం ఏర్పడి తమకు అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయని స్థానికులు వాపోతున్నారు. 
ప్రధానంగా ధంసలాపురం పెద్దచెరువులో కాలుష్యం నివారించాలని కొత్తగూడెం, సంభానినగర్‌ ప్రాంతాలకు చెందిన వారు పలుమార్లు ఆందోళన చేసిన సంఘటనలు ఉన్నాయి. ప్రత్యామ్నాయ కాలువ ఏర్పాటు చేసి చెరువును కాలుష్యం నుంచి కాపాడుతామని అధికారులు, ప్రజాప్రతినిధులు ఇచ్చిన హామీలు నేటికీ నెరవేరలేదు. దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఖానాపురం ఊరచెరువులో కాలుష్యం నివారించాలని పలుమార్లు ప్రజాప్రతినిధులకు చేసిన విజ్ఞప్తులు బుట్టదాఖలు అయ్యాయని జయనగర్‌ కాలనీ, ప్రశాంతినగర్‌ ప్రాంతాల వాసులు వాపోతున్నారు.

Related Posts