YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

తక్కువ ధరకే స్టీల్, సిమెంట్...

తక్కువ ధరకే స్టీల్, సిమెంట్...

నల్గోండ, ఏప్రిల్ 15, 
తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకం ప్రారంభించిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని ఇండ్లులేని నిరుపేదల సొంతింటి కలను నిజం చేసేందుకు ఈ పథకాన్ని ఈ పథకాన్ని తీసుకొచ్చారు. ఈ పథకం కింద సొంత స్థలం ఉన్న అర్హులైన లబ్ధిదారులకు ఇంటి నిర్మాణం కోసం నాలుగు విడతల్లో ఆర్థిక సహాయం అందిస్తారు. ఒక్కో లబ్ధిదారునికి మొత్తం రూ. 5 లక్షల ఆర్థిక సహాయం లభిస్తుంది. మొదటి విడతగా పునాది కోసం రూ. లక్ష, ఆ తర్వాత గోడల నిర్మాణం, పైకప్పు నిర్మాణం, చివరగా ఇళ్లు పూర్తి అయిన ఇలా నాలుగు విడతల్లో రూ. 5 లక్షలు అకౌంట్లలో జమ చేస్తారు.ఈ నేపథ్యంలో ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలుపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. మొదటి దశలో అత్యంత నిరుపేదలకు, అర్హులకు మాత్రమే గృహాలను కేటాయించాలని అన్నారు. ఈ పథకం పారదర్శకంగా, నిరుపేదలకు న్యాయం చేసేలా అమలు కావాలని చెప్పారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి ఇందిరమ్మ ఇండ్లపై శనివారం సాయంత్రం ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించి అధికారులకు కీలక సూచనలు చేశారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలో గ్రామ స్థాయిలో ఏర్పాటు చేసిన ఇందిరమ్మ కమిటీలు అత్యంత జాగ్రత్తగా పనిచేయాలన్నారు. కమిటీలు తయారు చేసిన అర్హుల జాబితాను తహశీల్దార్, ఎంపీడీవో, ఇంజినీర్‌లతో కూడిన మండల స్థాయి బృందం క్షేత్రస్థాయిలో స్వయంగా తనిఖీ చేసి, ధృవీకరించాలని సూచించారు.ఒకవేళ అనర్హులకు ఇండ్లు కేటాయించబడినట్లు తేలితే వెంటనే ఇందిరమ్మ కమిటీకి తెలియజేసి, ఆ స్థానంలో అర్హులైన వారికి గృహం మంజూరు చేయాలన్నారు. పథకంలో ఎలాంటి అవకతవకలకు తావులేకుండా చూడాలన్నారు. దందాలకు పాల్పడే వారిపై తక్షణమే కేసులు నమోదు చేయాలన్నారు. అనర్హులు ఇండ్లు నిర్మించుకున్నట్లు తేలితే చట్టపరమైన చర్యలతో పాటు, వారు పొందిన నిధులను వసూలు చేయాలన్నారు. లబ్ధిదారుల సౌకర్యం కోసం అదనపు సదుపాయాలను కల్పించాలన్నారు. గృహ నిర్మాణంలో లబ్ధిదారులు తమ అవసరాలకు అనుగుణంగా 50 శాతం అదనపు స్థలాన్ని నిర్మించుకునే అవకాశం కల్పించాలని సీఎం సూచించారు.ఇందిరమ్మ ఇండ్లకు సిమెంట్, స్టీల్ వంటి నిర్మాణ సామగ్రిని సరసమైన ధరలకు అందుబాటులో ఉంచేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇందిరమ్మ ఇండ్ల పథకం నిరుపేదల జీవితాల్లో వెలుగు నింపే లక్ష్యంతో రూపొందింది కాబట్టి ఈ పథకం అమలులో పారదర్శకత, నిజాయితీ ప్రధానంగా ఉండాలన్నారు. అర్హులైన వారికి మాత్రమే ఈ గృహాలు దక్కేలా చూడాలని అధికారులను ఆదేశించారు.

Related Posts