
విజయవాడ, ఏప్రిల్ 17,
రాజకీయాల్లో ఎత్తు పల్లాలు ఉంటాయి. గెలుపోటములు కూడా ఉంటాయి. ఇవన్నీ పార్టీలకు వర్తిస్తాయి. దేశాన్ని సుదీర్ఘకాలం పాలించిన కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో అందరికీ తెలిసిందే. 2014 వరకు ఆ పార్టీ హవా నడిచింది. అటు తరువాత బిజెపి శకం ప్రారంభం అయింది. వరుసగా మూడుసార్లు కేంద్రంలో అధికారంలోకి వచ్చింది బిజెపి నేతృత్వంలోని ఎన్డీఏ. అయితే ఇప్పటికీ బీజేపీ హవా నడుస్తూనే ఉంది. అయితే ఇది ఎల్లకాలం ఉంటుందని చెప్పలేం. మొన్నటి వరకు తెలంగాణలో అధికారంలో ఉంది బిఆర్ఎస్. కానీ సార్వత్రిక ఎన్నికల్లో బోణీ కొట్టలేకపోయింది. ఏపీలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తిరుగులేని బలంతో ఉండేది. కానీ మొన్నటి ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేకపోయింది. అంతెందుకు మొన్నటి వరకు ఫెయిల్యూర్ నాయకుడిగా ఉన్నారు నారా లోకేష్. అటువంటి నేత ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో యువ నేతలకు ఇన్స్పైర్ చేసే విధంగా మారారు. తనను తాను ప్రూవ్ చేసుకున్నారు. ఇబ్బందులను అధిగమించి నిలబడగలిగారు.ఒకప్పుడు లోకేష్ ఒక నాయకుడేనా అనే పరిస్థితి ఉండేది. ఆయన సమర్థతపై అందరిలోనూ అపనమ్మకం ఉండేది. సొంత పార్టీ నేతలే అనుమానించేలా ఉండేది. రాజకీయ ప్రత్యర్ధులు అయితే అవమానాలతో రెచ్చిపోయేవారు. కానీ ఇప్పుడు ఆయన పరిస్థితి మారింది. తాను ఒక నాయకుడిగా నిరూపించుకున్నారు. పాలకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఓ పార్టీ భావి నాయకుడిగా గుర్తింపు తెచ్చుకునే పనిలో ఉన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే లోకేష్ కు మైనస్ లు కంటే ప్లస్ లే ఎక్కువగా ఉంటున్నాయి.తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె కవిత ఇప్పుడు నారా లోకేష్ ను ఫాలో అవుతున్నారు. ప్రస్తుతం అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉంది కేసీఆర్ నేతృత్వంలోని బిఆర్ఎస్ పార్టీ. అందుకే ఇప్పుడు ఆ పార్టీని బలోపేతం చేయడానికి కుటుంబ సభ్యులంతా రంగంలోకి దిగారు. ఈ క్రమంలో కవిత ఇటీవల సంచలన ప్రకటనలు చేస్తున్నారు. పింక్ బుక్ రాసుకుంటున్నానని.. బిఆర్ఎస్ అధికారంలోకి వస్తే అందరి లెక్కలు తేల్చుతానని హెచ్చరిస్తున్నారు. తాను తన తండ్రి కెసిఆర్ మాదిరిగా మంచి దానిని కాదని.. తాను ఒక రౌడీ అని చెబుతున్నారు. అచ్చం 2024 ఎన్నికల కు ముందు నారా లోకేష్ చెప్పిన మాదిరిగానే కవిత కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా కవిత చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. లోకేష్ కు కాపీ కొడుతున్నారు అని కామెంట్స్ వినిపిస్తున్నాయి.2019లో అధికారంలోకి వచ్చింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. అంతులేని విజయంతో ఆ పార్టీ టిడిపి అంతు చూడాలని భావించింది. కేసులతో భయపెట్టింది. అరెస్టులతో ఉక్కు పాదం మోపింది. ఆ సమయంలోనే నారా లోకేష్ పాదయాత్ర చేశారు. రెడ్ బుక్ అంటూ కొత్త ప్రకటన చేశారు. అన్ని ఆ బుక్ లో రాసుకుంటున్నానని.. తప్పకుండా దీనిపై చర్యలు ఉంటాయని చెప్పారు. చెప్పిన మాదిరిగానే ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలను టార్గెట్ చేస్తున్నారు. తనదైన శైలిలో విరుచుకుపడుతున్నారు. గతంలో టిడిపి విషయంలో తప్పులు చేసిన ఏ వైసీపీ నేతను విడిచి పెట్టడం లేదు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండే వారికి లోకేష్ ఆదర్శంగా నిలుస్తున్నారు. అందుకే కవిత తీవ్రస్థాయిలో లోకేష్ మాదిరిగా హెచ్చరికలు పంపారు. తెలంగాణ పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ అవుతోంది.