
న్యూడిల్లీ, ఏప్రిల్ 17,
భారతీయ జనతా పార్టీకి నూతన జాతీయ అధ్యక్షుడి ఎన్నిక ముందు కీలక రాష్ట్రాల అధ్యక్షులను ప్రకటించాల్సి ఉంది ఉత్తరప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్ సహా పలు రాష్ట్రాల రాష్ట్ర అధ్యక్షుల పేర్లను ప్రకటించనున్నారు. ఇప్పటికే అనేక రాష్ట్రాలకు అధ్యక్షులు ప్రకటించినప్పటికీ సగానికి పైగా రాష్ట్రాల అధ్యక్ష ఎన్నికలు పూర్తయితే తప్ప జాతీయ అధ్యక్షుడి ఎన్నిక సాధ్యం కాదు. సామాజిక సమీకరణాలు, సీనియారిటీ సమర్థత, ఆర్ఎస్ఎస్ అండదండలు ఉండే నేతకు జాతీయ అధ్యక్షుడు అయ్యే అవకాశాలున్నాయి. నూతన అధ్యక్షుడి ఎంపిక పార్టీ సంస్థాగత నిర్మాణానికి కొత్త దిశను ఇవ్వడంతోపాటు రాబోయే శాసనసభ ఎన్నికల వ్యూహంలో కూడా కీలక పాత్ర పోషిస్తుంది. దక్షిణాదిలో ప్రధానంగా తెలంగాణ, కర్ణాటకలో సొంతంగా పాగా వేయాలని చూస్తున్న అధిష్ఠానం ఆచితూచి అధ్యక్ష ఎంపికపై నిర్ణయం తీసుకోనుంది. రాష్ట్ర నాయకత్వం నుంచి వచ్చిన సలహాలు సూచనలు ,రాజకీయ పరిస్థితులు, సామాజిక సమీకరణాల ఆధారంగా రాష్ట్ర అధ్యక్షులు ఎంపిక ప్రక్రియ రెండు మూడు రోజుల్లో పూర్తిచేయనుంది.నూతన జాతీయ అధ్యక్షుడు ఎన్నిక తర్వాత పార్టీలో సంస్థాగత మార్పులు, ఎన్నికల వ్యూహాలపై పెద్ద ప్రభావం చూపవచ్చు. అధ్యక్షుడి ఎన్నిక జనవరిలో జరగాల్సి ఉండగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ఏప్రిల్ సగం గడిచినప్పటికీ ఇంకా ఎన్నిక జరగలేదు. అధ్యక్షుడి ఎంపికలో సంస్థాగత నిర్మాణాన్ని బలోపేతం చేసే నాయకుడికి ప్రాధాన్యత ఇస్తారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. నూతన అధ్యక్షుడు వచ్చిన తర్వాత 50 శాతం జాతీయ ప్రధాన కార్యదర్శులను తొలగించే అవకాశం ఉందని సమాచారం. దీంతో పాటు, కొత్త అధ్యక్షుడి బృందంలో యువ నాయకులకు ప్రధాన కార్యదర్శులుగా అవకాశం ఇవ్వవచ్చు. అదే సమయంలో, ప్రభుత్వం నుంచి కొంతమంది నాయకులను పార్టీ సంస్థాగత వ్యవహారాల్లోకి తీసుకునే అవకాశం ఉంది.తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం ప్రస్తుతం పలువురు నాయకుల పేర్లు రేసులో ఉన్నాయి. ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్, బండి సంజయ్ కుమార్, రఘునందన్ రావు, రామచంద్రరావు, డీకే అరుణ, మురళీధర్ రావు, పాయల శంకర్, చింతల రామచంద్రా రెడ్డి సహా పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం జి.కిషన్ రెడ్డి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఉండగా కేంద్ర మంత్రిగా బిజీగా ఉండటం వల్ల రాష్ట్రంలో పార్టీని నడిపించేందుకు కొత్త నాయకుడి అవసరం ఉందని పార్టీ కార్యకర్తలు భావిస్తున్నారు. ఇప్పటికే అధ్యక్షుడి ఎంపికపై బీజేపీ అధిష్ఠానం పరిశీలకులతో అభిప్రాయాలని సేకరించింది. నాయకుల మధ్య అంతర్గత పోటీ, ఫిర్యాదుల వల్ల ఈ ప్రక్రియ ఆలస్యమవుతోంది. అధిష్టానం ఒకరిని అధ్యక్షుడిగా నిర్ణయించి మెజారిటీ జిల్లా అధ్యక్షులు చేత నామినేట్ చేయించి నామినేషన్ ప్రక్రియ పూర్తి చేసి అధికారికంగా అధ్యక్షుడు ప్రకటన పూర్తి చేస్తుంది. అధ్యక్ష పదవి ఎంపిక తెలంగాణలో బీజేపీ బలోపేతానికి, రాబోయే ఎన్నికల వ్యూహానికి కీలకం. అధిష్ఠానం ఈ విషయంలో రెండు మూడు రోజుల్లో స్పష్టతనిచ్చే అవకాశం ఉంది.బీసీ సామాజికవర్గం.. తెలంగాణాలో పాపులారిటీ.. సహా రాష్ట్రంలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీకి చెక్ పెట్టాలంటే ఈటలరకు అధ్యక్ష బాధ్యతలు ఇవ్వాలని చూస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం రేసులో ఉన్న నేతలు సైతం ఈటల రాజేందర్‌కు అధ్యక్ష బాధ్యతలు ఇస్తే తమకు అభ్యంతరం లేదని అధిష్టానానికి తెలిపినట్లు సమాచారం. ఇప్పటికే అనేక సందర్భాల్లో పక్క పార్టీల నుంచి వచ్చిన వారిని అధ్యక్షులు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇటీవల తమిననాడు అధ్యక్షుడిగా నైనార్ నాగేంద్రన్‌ను అధ్యక్షుడిగా ప్రకటించారు. పక్కన ఉన్న ఏపీలో పురంధేశ్వరి, కన్నా లక్ష్మీ నారాయణలను అధ్యక్ష పీఠం ఎక్కించిన సందర్భాలున్నాయి. ముఖ్యంగా ప్రస్తుత తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి సైతం ఎవరిని అధ్యక్షుడు చేసినా తనకు అభ్యంతరం లేదని చెప్పినట్లు సమాచారం.ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. కేంద్రంలో మంత్రివర్గంలో స్థానం రాకపోవడంతో ప్రస్తుతం ఉన్న పురంధేశ్వరిని మరోసారి కొనసాగించే అవకాశం ఉంది. పురంధేశ్వరి స్థానంలో అధ్యక్ష బాధ్యతలు చేపట్టేందుకు పలువురు నేతలు రేసులో ఉన్నారు. ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ మాధవ్, ఎమ్మెల్యేలు పార్ధ సారధి, సుజనా చౌదరి ముందు వరుసలో ఉన్నారు. సామాజిక సమీకరణాలు పార్టీ బలోపేతం లక్ష్యంగా ఏపీ బీజేపీ అధ్యక్ష ఎన్నిక ఉండబోతున్నట్లు తెలుస్తోంది.