
నెల్లూరు, ఏప్రిల్ 19,
మాజీ మంత్రి అనిల్ కుమార్ మరోసారి నెల్లూరు రాజకీయాల్లో యాక్టివ్ అయ్యేందుకు సిద్ధమవుతున్నట్లు కనిపిస్తుంది. నెల్లూరు పట్టణ నియోజకవర్గం నుంచి రెండు సార్లు గెలిచిన అనిల్ కుమార్ ను 2024 ఎన్నికల్లో వైసీపీ అధినేత వైఎస్ జగన్ నరసరావుపేట ఎంపీగా పంపారు. అప్పట్లో ఎంపీతో పాటు స్థానిక నేతలతో అనిల్ కుమార్ యాదవ్ కు పొసగకపోవడంతో ఆయనను పార్లమెంటుకు పంపాలన్న ఉద్దేశ్యంతో నరసరావుపేట నుంచి వైసీపీ అభ్యర్థిగా జగన్ నిలబెట్టారు. అయితే గత ఎన్నికల్లో కేవలం మూడు పార్లమెంటు స్థానాల్లోనే గెలవడం, అనిల్ కుమార్ యాదవ్ కూడా ఓటమి పాలు కావడంతో కొన్నాళ్ల నుంచి ఆయన మౌనంగా ఉంటున్నారు. అయితే గత కొద్ది రోజుల నుంచి ఆయన తిరిగి నెల్లూరు రాజకీయాల్లో యాక్టివ్ అవుతున్నట్లు కనిపిస్తుంది. వరసగా కార్యకర్తలతో సమావేశం అవుతున్నారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ తో సమావేశమయిన తర్వాత ఆయనకు క్లారిటీ వచ్చినట్లుంది. అందుకే తిరిగి ఆయన నెల్లూరు జిల్లా పాలిటిక్స్ లోనే కొనసాగాలని నిర్ణయించుకున్నట్లు కనపడుతుంది. నెల్లూరు జిల్లాలోనే ఎక్కువగా తిరుగుతూ పార్టీ క్యాడర్ ను తిరిగి ఉత్తేజం చేసే ప్రయత్నం అనిల్ కుమార్ యాదవ్ చేస్తున్నారు. 2024 ఎన్నికల ముందు వరకూ నెల్లూరు జిల్లా వైసీపీకి కంచుకోటగా ఉండేది. కానీ 2024 ఎన్నికల్లో పూర్తిగా ఫ్యాన్ పార్టీ పట్టు కోల్పోయింది. గెలిచే స్థానాల్లో కూడా ఓటమి పాలయింది. ఈ నేపథ్యంలో అనిల్ కుమార్ యాదవ్ ను తిరిగి నెల్లూరు జిల్లాకు పంపాలని వైసీపీ అధినేత వైఎస్ జగన్ నిర్ణయించినట్లు తెలిసింది. ఈ మేరకు ఆయన మాటలను, ఆహార్యం చూస్తుంటే అర్థమవుతుంది. నెల్లూరు జిల్లా అనిల్ కుమార్ సొంత ప్రాంతం కావడంతో పాటు బీసీ సామాజికవర్గానికి చెందిన నేత కావడంతో అనిల్ ను తిరిగి జిల్లానుంచి పోటీ చేయించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలిసింది. ఈ మేరకు జగన్ స్పష్టమైన హామీ ఇవ్వడంతో నెల్లూరు జిల్లాలో తిరిగి పట్టు నిలుపుకునేందుకు అనిల్ కుమార్ యాదవ్ ప్రయత్నిస్తున్నారు. వైసీపీ ప్రతిపక్షంలో ఉండగా, అధికారంలో ఉండగా ఫైర్ బ్రాండ్ గా ముద్ర పడిన అనిల్ సేవలను తిరిగి నెల్లూరు జిల్లాలోనే వినియోగించుకోవాలని డిసైడ్ అయినట్లు తెలిసింది.అయితే మరొక ప్రచారం కూడా విస్తృతంగా జరుగుతుంది. అనిల్ కుమార్ యాదవ్ వెంకటగిరి వైపు పడిందని పెద్దయెత్తున సోషల్ మీడియాలో క్యాంపెయిన్ జరుగుతుంది. అయితే వెంకటగిరిలో ఇప్పటికే ముఖ్యమైన నేత నేదురుమిల్లి రామ్ కుమార్ రెడ్డి ఉండటంతో ఆయనను తప్పించి అనిల్ కుమార్ యాదవ్ ను పంపుతారని అనుకోలేం. ఆయనకు తిరిగి నెల్లూరు టౌన్ నుంచి పోటీ చేయించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు కనపడుతుంది. అనిల్ కూడా తనకు పట్టున్న నెల్లూరు పట్టణం నుంచి తిరిగి పోటీ చేయాలన్న పట్టుదలతో ఉన్నట్లు కనిపిస్తుంది. ప్రసుతం నెల్లూరు సిటీ,రురల్ కో ఆర్డినేటర్ గా అనిల్ కుమార్ యాదవ్ కొనసాగుతున్నారు. మొత్తం మీద వైసీపీ ఫైర్ బ్రాండ్ మళ్లీ యాక్టివ్ అవుతున్నట్లు కనిపిస్తుంది.