
కడప, ఏప్రిల్ 19,
రాయలసీమ రాజకీయాలు అదో టైప్. అక్కడ నేతలే ఎవ్రిథింగ్. ప్రజాప్రతినిధుల కనుసన్నల్లోనే ఏదైనా జరగాలి. అక్కడ నో రూల్స్. నో చట్టం. ఓన్లీ డిక్టేటర్‌షిప్. కాదూ కూడదు అంటే రక్తచరిత్రనే. దశాబ్దాలుగా అదే తీరు. గతంలో ఫ్యాక్షనిస్టులు ఇలాంటి దందాలు చేసేవారు. ఆ తర్వాత ఫ్యాక్షన్ ఖద్దరు చొక్కా తొడగడంతో.. రాజకీయ నేతలే రాయలసీమను శాసించారు. ఇదంతా గతం. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. చట్టం ఎవరికీ చుట్టం కాదంటోంది. కానీ, ఇప్పటికీ అక్కడక్కడా పాత వాసనలు కనిపిస్తూనే ఉన్నాయి. ఫ్యాక్షన్ మార్క్ ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఉదంతం కడప జిల్లాలో చర్చనీయాంశమైంది. ఏపీలోనూ రీసౌండ్ వస్తోంది. బీజుపీకి చెందిన జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డిపై తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. కడప జిల్లాలో అల్ట్రాటెక్ సిమెంట్స్‌ను ఎమ్మెల్యే బెదిరిస్తున్నట్టు చెబుతున్నారు. సంస్థలో ప్రతి పనికి సంబంధించిన అన్ని కాంట్రాక్టులను తనకు, తన వారికే ఇవ్వాలని ఎమ్మెల్యే పట్టుబడుతున్నారని అల్ట్రాటెక్ సిమెంట్స్ యాజమాన్యం ఆరోపిస్తోంది. ఇప్పటికే ఆదినారాయణరెడ్డికి కొన్ని కాంట్రాక్టులు ఇచ్చామని, అన్ని కాంట్రాక్టులు శాసనసభ్యుడుకే ఇవ్వడం సాధ్యం కాదని ఆ సంస్థ చెబుతోంది. ఆయన చెప్పినట్లు చేయకపోవడంతో తమ సిమెంట్ ఫ్యాక్టరీలకు రావాల్సిన ముడి పదార్థాల సరఫరాను ఆదినారాయణరెడ్డి అడ్డుకుంటున్నారని అల్ట్రాటెక్ కంపెనీ అంటోంది. సిమెంట్ పరిశ్రమలకు లారీలు వెళ్లకుండా వాహనాలు అడ్డుపెట్టి, తన మనుషులను కాపలా పెట్టారని చెబుతోంది.చిలమకూరు ప్లాంట్‌లో సిమెంట్ ఉత్పత్తి ఆగిపోయిందని, యర్రగుంట్ల ప్లాంట్‌లోనూ ఉత్పత్తి ఆగిపోయే పరిస్థితి రావడంతో.. జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశామని అల్ట్రాటెక్ వెల్లడించింది. ఎస్పీతో ఫోన్‌లో మాట్లాడిన కలెక్టర్.. వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడు జగదీశ్వర్‌రెడ్డితో సహా పలువురిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. అల్ట్రాటెక్ సిమెంట్స్‌కు ముడి పదార్థాల రవాణా పునరుద్ధరించారు. తనపై వచ్చిన ఆరోపణలపై ఆదినారాయణరెడ్డి స్పందించారు. అల్ట్రాటెక్ సిమెంట్స్ యాజమాన్యం వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తోందని MLA అన్నారు. ఎన్నిసార్లు చెప్పినా తీరు మార్చుకోవడం లేదని చెప్పారు. స్థానికులకు ఉపాధి దొరుకుతుందనే ఉద్దేశంతోనే గతంలో ఫ్యాక్టరీ నిర్మాణానికి సహకరించామని గుర్తుచేశారు. అల్ట్రాటెక్ సిమెంట్స్ తీరుతో స్థానికులు ఇబ్బంది పడుతున్నారని.. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి కూడా తీసుకెళ్లానని MLA చెబుతున్నారు. విదేశీ పర్యటన నుంచి ముఖ్యమంత్రి తిరిగొచ్చాక స్వయంగా కలిసి పరిస్థితి వివరిస్తానన్నారు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి.