
విజయవాడ, ఏప్రిల్ 19,
ఏపీలో గత వైసీపీ సర్కార్ హయాంలో జరిగిన లిక్కర్ స్కాంపై కూటమి ప్రభుత్వం దానికి సంబంధించిన యాక్షన్ ప్లాన్ ను స్పీడప్ చేస్తోంది. ఈ స్కాంలో ఎవరున్నా..ఎంతమంది ఉన్నా వారందరిని బయటకు లాగేందుకు ఇప్పటికే ఏర్పాటైన సిట్ విచారణను స్పీడప్ చేసింది. అందులో భాగంగానే సిట్ విచారణకు హాజరు కావాలంటూ వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఇప్పటికే సిట్ నోటీసులు జారీ చేసింది.మద్యం కుంభకోణంలో శుక్రవారం విచారణకు రావాల్సిందిగా ఏపీ సిట్ నోటీసులు జారీ చేయడంతో మిథున్ రెడ్డి వెంటనే హైకోర్టును ఆశ్రయించారు. విచారణ సందర్భంగా న్యాయవాదిని అనుమతించాలని, వీడియో రికార్డింగ్ చేసేలా ఆదేశించాలని పిటిషన్‌లో కోరారు. మిథున్ రెడ్డి పిటిషన్‌పై హైకోర్టు విచారించింది.అంతకు ముందు కూడా ఇదే కేసులో తనను అరెస్ట్ చేసే అవకాశం ఉందని, తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని ఎంపీ హైకోర్టును ఆశ్రయించారు. అయితే దీన్ని హైకోర్టు కొట్టివేసింది. ఆ తర్వాత ఎంపీ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. దీంతో మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయవద్దంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయడంతో పాటు విచారణకు సహకరించాలని ఎంపీని ఆదేశించింది.మరోవైపు ఈ కేసులో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కర్త, కర్మ, క్రియ కసిరెడ్డే అంటూ కొద్దిరోజుల క్రితం మీడియా ముందే సాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.లిక్కర్ స్కాంలో తనకు తెలిసిన వివరాలు చెప్పేందుకు సిద్ధంగా ఉన్నట్లు సాయిరెడ్డి చెప్పడంతో సిట్ విచారణలో ఎలాంటి విషయాలు బయటపెడతారన్న ఉత్కంఠ ఉంది. సాయిరెడ్డిని విచారించేందుకు సిట్ సిద్దంగా ఉన్నా…గురువారం హాజరుకాలేదు. మరోసారి వస్తానని చెప్పిన విజయసాయిరెడ్డి ఎప్పుడొస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే సాక్షిగా విజయసాయి చెప్పే అంశాలు మద్యం కుంభకోణం కేసులో కీలకం అవుతాయని సిట్ అధికారులు భావిస్తున్నారట..వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో వేల కోట్ల రూపాయలు అక్రమంగా దోచుకున్నారని ఇప్పటికే నిర్ణారణ అయిందని ఓ టాక్ నడుస్తోంది. దీనిపై విచారణ జరిపిన సిట్..పలు కీలక ఆధారాలను కూడా సేకరించింది. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారం మొత్తానికి కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి సూత్రధారి అని, ఆయన కనుసన్నల్లోనే మద్యం కుంభకోణం నడిచిందని సిట్ ఓ నిర్ణారణకు వచ్చిందట. ఇప్పటికే మూడు సార్లు విచారణకు రావాల్సిందిగా కసిరెడ్డికి సిట్ నోటీసులు జారీ చేసినా మూడు సార్లు కూడా విచారణకు డుమ్మా కొట్టారు.అంతేకాకుండా కసిరెడ్డి ఫోన్లు కూడా స్విచ్‌ఆఫ్ చేయడంతో ఆయన కుటుంబసభ్యులను కలిసి నోటీసులు ఇచ్చారు. అలాగే కసిరెడ్డి తండ్రికి కూడా సిట్ నోటీసులు జారీ చేసింది. గత ఐదేళ్లలో మద్యం ద్వారానే కసిరెడ్డి అక్రమంగా ఆస్తులను సంపాదించారని సిట్ ఇప్పటికే గుర్తించిందట. ఆ డబ్బు ద్వారానే అనేక సంస్థల్లో పెట్టుబడులు పెట్టారని, సినిమా కూడా తీశారని సిట్ అధికారులు చెప్తున్నారు. దీంతో ఈ కేసులో మరింత లోతుగా విచారించేందుకు సిట్ రెడీ అవుతోంది. లిక్కర్ స్కాంలో ఉన్న పాత్రధారులు, సూత్రధారులు ఎవరనేది త్వరలోనే బయటపడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
కసిరెడ్డి క్రిమినల్
రాజ్ కసిరెడ్డి తెలివైన క్రిమినల్ అని విజయసాయిరెడ్డి ఆరోపించారు.రాజ్ కసిరెడ్డిపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన తెలివైన క్రిమినల్ అని.. ఆయన తనను మోసం చేశారన్నారు. తాను రాజ్ కసిరెడ్డికి అరబిందో నుంచి వంద కోట్ల రూపాయలు అప్పుగా ఇప్పించానన్నారు. రాజ్ కసిరెడ్డి మూడు కంపెనీలు పెట్టి లిక్కర్ తయారు చేశారన్న విషయం తనకు తెలియదు కానీ.. అందులో రెండు కంపెనీలకు మాత్రం వంద కోట్లు ఇప్పించానన్నారు. పన్నెండు శాతం వడ్డీకి చెల్లింపులు జరిగేలా ఈ అప్పు ఇప్పిచాననిచెప్పారు. రాజ్ కసిరెడ్డిని తనకు పార్టీ నేతలే ప్రచారం చేశారని.. ఆయనను తాను ప్రోత్సహించి తప్పు చేశానన్నారు. లిక్కర్ పాలసీకి సంబంధించి తన ఇంట్లో రెండు సమావేశాలు జరిగాయని.. విజయసాయిరెడ్డి సీఐడీ అధికారుల ఎదుట అంగీకరించారు. ఆ సమావేశాల్లో రాజ్ కసిరెడ్డి, మిథున్ రెడ్డి కూడా పాల్గొన్నారని తెలిపారు. అయితే లిక్కర్ విక్రయాల అంశంలో తాను ఎప్పుడూ జోక్యం చేసుకోలేదన్నారు. దుర్మార్గమైన రాజ్ కసిరెడ్డి చేతిలో మోసపోయానని బాధపడుతున్నాన్నారు. రాజ్ కసిరెడ్డి వసూలు చేసినవి ఎవరికి వెళ్లాయో తనకు తెలియదన్నారు. రాజ్ కసిరెడ్డి మాత్రమే అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పగలరని విజయసాయిరెడ్డి చెప్పుకొచ్చారు.లిక్కర్ స్కాంలో బిగ్ బాస్ ఉన్నాడో లేడో తనకు తెలియదన్నారు. విచారణలో అధికారులు లంచాల గురించి అడిగారని.. తనకు తెలియదని చెప్పానని తెలిపారు. రెండు కంపెనీలకు సిఫారసు చేశానని చెప్పానని.. ఒకరికి రూ.60 కోట్లు, మరొకరికి రూ.40 కోట్లు ఇచ్చారని చెప్పానని వెల్లడించారు. రుణం మాత్రమే ఇప్పించానని.. నిధుల వినియోగం గురించి తెలియదని చెప్పానని పేర్కొన్నారు. సిట్ అధికారులు తనను అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పానన్నారు. మరో సారి పిలిచినా వస్తానన్నారు. మరోసారి ఆయన జగన్ కోటరీపై విరుచుకుపడ్డారు. తాను నెంబర్ టు స్థానంలో ఉండేవాడినని.. తర్వాత రెండు వేల స్థానానికి పడిపోయానన్నారు. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తనది రెండో స్థానమని అధికారంలోకి వచ్చాక ఆ స్థానం మిథ్య అని తేలిందని నిరాశ వ్యక్తం చేశారు. పార్టీ అధికారంలో లేనప్పుడు అన్నీ తానే చూసుకున్నానన్నారు. తాను వెన్నుపోటుదారుడినని జగన్‌కు చెప్పారన్నారు. కోటరీ వల్లే తాను పార్టీని వీడానని చెప్పుకొచ్చారు. తాను వేల కోట్లు దోచుకున్నానని జగన్ కు చెప్పారని మండిపడ్డారు. వైసీపీకి చెందిన మీడియాలో తనపై వస్తున్న వార్తలపైనా విజయసాయిరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. సాక్షి పత్రికను తానే పెట్టించానని ఇప్పుడు ఆ పత్రికలో తనపై దుష్ప్రచారం చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను బీజేపీ తరపున రాజ్యసభ స్థానం అడగలేదన్నారు. రాజకీయాల్లో లేనని.. ప్రజలు కోరుకుంటే రాజకీయాల్లోకి వస్తానని వ్యాఖ్యానించారు. ఎంపీ పదవి కావాలని తాను ఎవర్నీ అడగలేదని స్పష్టం చేశారు.