
న్యూఢిల్లీ, ఏప్రిల్ 19,
ఢిల్లీ రాజకీయాలు అసక్తి రేకెత్తిస్తున్నాయి. అతి త్వరలోనే కేంద్రంలో కీలక పరిణామాల ఉండబోతున్నాయనే సంకేతాలు కనిపిస్తున్నాయి. చట్టాల ఆమోదం విషయంలో రాష్ట్రపతికి సుప్రీంకోర్టు కాల పరిమితి విధించిన అంశంతో పాటు కేంద్ర కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ, బెంగాల్‌లో రాష్ట్రపతి పాలన, భారతీయ జనతా పార్టీకి కొత్త అధ్యక్షుడి ఎన్నిక, పార్టీలో సంస్థాగత మార్పులు సహా పలు కీలక అంశాలపై బీజేపీ ప్రత్యేక దృష్టి పెట్టినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కేబినెట్ భేటీ జరగకపోవడం, ప్రధానిని రాష్ట్రపతిని కలవడం, బీజేపీ, కేంద్ర ప్రభుత్వ ముఖ్యుల వరుస సమావేశాల నేపథ్యంలో ఏదో జరగబోతుంది అంటూ రాజకీయంగా పెద్ద ఎత్తున ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఊహాగానాలకు మరింత ఊతమిచ్చేలా కేబినెట్ జరగకపోగా వచ్చేవారం కూడా కేంద్ర కేబినెట్ భేటీ సమావేశం జరగడం లేదని తెలుస్తోంది. కేంద్రంలోని బీజేపీ అగ్ర నేతలు ప్రధానమంత్రి నురంద మోడీ, అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, జేపీ నడ్డా, బిఎల్ సంతోష్ ఉమ్మడిగా విడివిడిగా సమావేశాలు నిర్వహిస్తున్నారు.రాష్ర్టపతి ద్రౌపది ముర్ముతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు ప్రధాని మోదీ. ప్రస్తుతం బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఎన్నిక, సంస్థాగతంగా పార్టీలో మార్పులపై దృష్టి సారించిన అధిష్టానం కేబినెట్ పునర్వ్యవస్థీకరణపై కూడా ఆలోచన చేస్తున్నట్లు పార్టీలో చర్చ జరుగుతుంది. కేబినెట్, పార్టీ వ్యవస్థాగత పునర్ వ్యవస్థీకరణలో భాగంగా కొందరు యువ నేతలకు కీలక బాధ్యతలు అప్పజెప్పవచ్చంటూ బీజేపీ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. రానున్న బీహార్, పశ్చమ బెంగాల్, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా ఆయా రాష్ర్టాల నేతలకు కేంద్ర కేబినెట్‌లో చోటు కల్పించే అవకాశం వుందని భావిస్తున్నారు. ఇంతకాలం తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా పనిచేసిన అన్నామలైను కేంద్ర కేబినెట్‌లోకి తీసుకుంటారని ఇప్పటికే విస్తృతంగా ప్రచారం జరుగుతుంది.బీజేపీ సంస్థాగత ఎన్నికల్లో భాగంగా వచ్చే వారం నూతన బీజేపీ జాతీయ అధ్యక్ష ప్రకటన ఉండే అవకాశం ఉంది. ఇప్పటివరకు 14 రాష్ట్రాలకు బీజేపీ రాష్ర్టశాఖ అధ్యక్షుల ప్రకటన పూర్తయింది. జాతీయ అధ్యక్షుడి ఎంపికకు ముందే కనీసం మరో ఐదు లేదా ఆరు రాష్ర్టాల అధ్యక్షులను ప్రకటించే అవకాశం ఉంది. పార్టీ అధ్యక్షులను నియమించాల్సిన రాష్ర్టాల్లో మధ్య ప్రదేశ్, గుజరాత్, ఉత్తర ప్రదేశ్, కర్నాటక, పశ్చిమ బెంగాల్, మహారాష్ర్ట, హర్యానా, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణా సహా పలు రాష్ర్టాలున్నాయి. పార్టీ బలోపేతంలో భాగంగా బీజేప జాతీయ ప్రధాన కార్యదర్శులు, ఉపాధ్యక్షులుగా యువ నాయకత్వాన్ని ప్రోత్సహించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.మరోవైపు పశ్చిమ బెంగాల్ ముర్షిదాబాద్ లో హింస కారణంగా రాష్ట్రంలో రాష్ర్టపతి పాలన దిశగా కేంద్రం అడుగులు అవకాశం అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది..దీనితో పాటు రాష్ర్టాల అసెంబ్లీలు ఆమోదించి, పంపించిన బిల్లులు విషయంలో గవర్నర్లు, రాష్ర్టపతి ఆమోదం తెలిపే విషయంలో ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో తదుపరి ఏ విధంగా ముందుకు వెళ్ళాలన్న దానిపైనా కేంద్ర ప్రభుత్వ, బీజేపీ ముఖ్యలు చర్చిస్తున్నట్లు సమాచారం.!