
హైదరాబాద్, ఏప్రిల్ 19,
గతంలో ఎంబీబీఎస్ పాఠ్యపుస్తకాలు, మెడికల్ విద్యను ప్రాంతీయ భాషల్లో ప్రవేశ పెట్టిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఇంజినీరింగ్ విద్యలోనూ పలు మార్పులు చేసేందుకు కసరత్తు చేస్తుంది. ఇందులో భాగంగా ఇంజనీరింగ్ డిప్లొమా, డిగ్రీ కోర్సులకు సంబంధించిన పాఠ్యపుస్తకాలను ప్రాంతీయ భాషల్లో అందించడానికి అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) చర్యలు చేపడుతోంది. స్థానిక భాషల్లో ఇంజినీరింగ్ పాఠ్య పుస్తకాలను అందించడానికి కసరత్తు చేస్తోంది. వివిధ విభాగాల్లో ఇప్పటికే కార్యచరణ ప్రారంభించారు కూడా. తద్వారా ప్రాథమిక, హైస్కూల్ విద్యను మాతృభాషలో చదువుకుని ఇంజినీరింగ్‌లో ఆంగ్లమాధ్యమంతో ఇబ్బందులు పడుతున్న వారు స్థానిక భాషలోనే చదువుకుని అర్థం చేసుకునేందుకు వీలుకల్పిపస్తోందని ఓ ఇంటర్వ్యూలో AICTE చైర్మన్ ప్రొఫెసర్ టీజీ సీతారాం తెలిపారు. మొదటి, రెండవ సంవత్సరం ఇంజనీరింగ్ డిప్లొమా, డిగ్రీ కోర్సులకు సంబంధించిన దాదాపు 600 పాఠ్యపుస్తకాలను ఇప్పటికే 12 ప్రాంతీయ భాషలలో తయారు చేసి అప్‌లోడ్ చేశామని చెప్పారు. వీటిలో హిందీ, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మలయాళం, మరాఠీ, ఒడియా, పంజాబీ, తమిళం, తెలుగు, ఉర్దూ భాషల్లో కూడా పాఠ్యపుస్తకాలు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. మూడవ, నాల్గవ సంవత్సరం పాఠ్యపుస్తకాలు త్వరలోనే పూర్తి చేయనున్నట్లు ఆయన తెలిపారు.2026 డిసెంబర్ నాటికి 12 భారతీయ భాషల్లో పూర్తి స్థాయిలో ఇంజినీరింగ్ డిప్లొమా, డిగ్రీ కోర్సుల్లో పాఠ్యపుస్తకాలను ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించారు. దీంతో త్వరలోనే హిందీ, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మలయాళం, మరాఠీ, ఒడియా, పంజాబీ, తమిళం, తెలుగు, ఉర్దూ.. మొత్తం 12 ప్రాంతీయ భాషల్లో బోధనకు ప్రణాళిక సిద్ధం చేసింది. ఇప్పటికే మొదటి, రెండో సంవత్సరానికి సంబంధించిన పుస్తకాల రూపకల్పనలో నిమగ్నమయింది. సాంకేతిక విద్యా వ్యవస్థలో భాషా అవరోధాన్ని నివారించడానికి ఏఐసీటీఈ గతంలోనే ప్రాంతీయ భాషలో ఇంజినీరింగ్ విద్యను ప్రవేశపెట్టింది. దేశ వ్యాప్తంగా 18 ఇంజినీరింగ్ కళాశాలల్లో బీటెక్ ప్రోగ్రామ్ కోసం 11 ప్రాంతీయ భాషల్లో 1140 సీట్లను ఏఐసీటీఈ ఆమోదించింది. తొలి ఏడాది 2021–22లో కేవలం 233 సీట్లు, ఆ తర్వాత ఏడాది 2022–23లో 683 సీట్లు, 2023–24లో 928 సీట్లలో విద్యార్థులు చేరారు.ఇంజినీరింగ్‌లో సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎల్రక్టానిక్స్, కంప్యూటర్ సైన్స్ వంటి కోర్సుల్లో ప్రాంతీయ భాషల్లో పాఠ్య పుస్తకాలను ఏఐసీటీఈ రూపొందిస్తోంది. ఈ పుస్తకాలను స్థానిక భాషల్లో వేగంగా తర్జుమా చేసేందుకు కృత్రిమమేధ సాయాన్ని తీసుకుంటోంది. దాదాపు 80 శాతం కచ్చితత్వంతో 10 నిమిషాల్లో పుస్తకాన్ని తర్జుమా చేస్తోంది. మిగిలిన 20 శాతం తప్పొప్పులను నిపుణులు సరిదిద్దుతున్నారు. భారత రాజ్యాంగంలో 22 గుర్తింపు పొందిన భాషలు ఉన్నప్పటికీ, నిధుల పరిమితుల కారణంగా ప్రస్తుత దృష్టి 12 ప్రధాన భాషల్లో మాత్రమే అనువదిస్తోంది. అయితే ఈ చొరవ తప్పనిసరి కాదని, వారి మాతృభాషలో చదువుకోవడంలో మరింత సౌకర్యంగా ఉన్న విద్యార్థులకు ఇది ఒక ఆప్షన్ మాత్రమేనని సీతారాం అంటున్నారు. కెనడా, స్విట్జర్లాండ్ దేశాలు ఫ్రెంచి, జర్మన్ వంటి స్థానిక భాషల్లో ఉన్నత విద్యను అందిస్తున్నాయని, ఇదే బాటలో రష్యా, చైనా, జపాన్ కూడా ఉన్నట్లు తెలిపారు. ఈ ప్రయత్నం గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యార్ధులకు ఇంజనీరింగ్ విద్యను మరింత అందుబాటులోకి తేవడానికి దోహదం చేస్తుందని AICTE చైర్మన్ ప్రొఫెసర్ టీజీ సీతారాం వివరించారు.