YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఎన్విరాన్ మెంటల్ సిటీగా అమరావతి

ఎన్విరాన్ మెంటల్ సిటీగా అమరావతి

విజయవాడ, ఏప్రిల్ 22, 
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ముందు అద్భుత అవకాశం ఊరిస్తోంది. రాజధాని అమరావతిని ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలోనే అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అమరావతిని నిర్మించే పనిలో ఉంది. అందులో భాగంగానే అమరావతిలో స్పోర్ట్స్ సిటీ, అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం, అమరావతి ఎయిర్‌పోర్టు, అమరావతి రైల్వే లైన్.. ఇలా ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు చేపడుతోంది. అలాగే ప్రపంచంలోనే పూర్తిగా పునరుత్పాదక శక్తితో నడిచే మొదటి నగరంగా అమరావతిని నిలిపేలా ప్రభుత్వం, అధికారులు పనిచేస్తున్నారు. అమరావతిని గ్రీన్‌ఫీల్డ్ నగరంగా అభివృద్ధి చేస్తున్న అధికారులు.. అమరావతి రాజధాని అవసరాల కోసం సౌర, పవన, జలవిద్యుత్ వనరుల నుంచి 2,700 మెగావాట్ల క్లీన్ ఎనర్జీని ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.మరోవైపు అమరావతి పునఃప్రారంభానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానున్న సంగతి తెలిసిందే. మే 2వ తేదీన ప్రధాని మోదీ చేతుల మీదుగా అమరావతి రీలాంఛింగ్ కార్యక్రమం జరగనుంది. మొత్తం 65 వేలకోట్ల అంచనా వ్యయంతో అమరావతి నిర్మాణాన్ని చేపడుతున్నారు. 217 చదరపు కిలోమీటర్ల పరిధిలో కృష్ణా నదీతీరంలో అమరావతి కొలువు దీరనుంది. విజయవాడ, గుంటూరు నగరాల మధ్య పర్యావరణహిత రాజధానిగా అమరావతిని తీర్చిదిద్దనున్నారు. పూర్తిగా గ్రీన్ ఎనర్జీ వినియోగం ద్వారా అమరావతిని ప్రపంచానికి ఓ రోల్‌మోడల్‌గా తీర్చిదిద్దాలని అధికారులు భావిస్తున్నారు. ఇందుకోసం 2,700 మెగావాట్ల విద్యుత్‌ను సౌర, పవన, జలవిద్యుత్ ద్వారా ఉత్పత్తి చేయనున్నారు.పునరుత్పాదక శక్తి వనరుల వినియోగం ద్వారా శిలాజ ఇంధనాల అవసరాన్ని తొలగించాలని.. పర్యావరణహిత నగరంగా అమరావతిని తీర్చిదిద్దాలని అధికారుల ఆలోచన. మరోవైపు 2050 నాటికి అమరావతికి 2.7 గిగావాట్ల విద్యుత్ అవసరమవుతుందని అధికారుల అంచనా. ఇందులో కనీసం 30 శాతాన్ని సోలార్, విండ్ పవర్ ద్వారా ఉత్పత్తి చేయాలని ప్రణాళికలు రచిస్తున్నారు. ఇందుకోసం రూఫ్ టాప్ సోలార్ వ్యవస్థలను తప్పనిసరి చేయాలనే ఆలోచన ఉంది. ప్రభుత్వ హౌసింగ్ ప్రాజెక్టులలో కనీసం మూడో వంతు వాటికి ఈ రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్స్ ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు.అలాగే అమరావతి ప్రజా రవాణా వ్యవస్థలో కూడా రెన్యువబుల్ ఎనర్జీ వినియోగించాలని ఆలోచిస్తున్నారు. మెట్రో, ఎలక్ట్రిక్ బస్సులను రెన్యువబుల్ ఎనర్జీతోనే నడిపించాలని ప్రణాళికలు రూపొందిస్తున్నారు. పార్కులు, బస్ స్టాపులు, నడకదారుల్లో సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేయడం ద్వారా సౌర విద్యుత్ ఉత్పత్తి చేయాలని ఆలోచిస్తున్నారు. మొత్తంగా పూర్తి స్థాయిలో పునరుత్పాదక శక్తితో నడిచే మొదటి నగరంగా అమరావతిని తీర్చి దిద్దాలని అధికారులు ప్రయత్నిస్తున్నారు.
మరో కొత్త రైల్వే లైన్
కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఏపీలో మౌలిక వసతుల ప్రాజెక్టుల నిర్మాణంలో వేగం పెరిగింది. ఇప్పటికే పలు జాతీయ రహదారుల విస్తరణ పనులు జోరందుకున్నాయి. అలాగే కొత్త రహదారి ప్రాజెక్టులు, నూతన రైల్వే లైన్లకు కూడా కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఇక ఏళ్ల తరబడి స్తబ్దుగా ఉన్న రైల్వే ప్రాజెక్టు పనుల్లో కూడా కదలిక వచ్చింది. ఈ క్రమంలోనే కోటిపల్లి - నరసాపురం రైల్వే లైన్ నిర్మాణ పనుల్లో కదలిక వచ్చింది. కోటిపల్లి - నరసాపురం రైల్వే లైన్ ఆ ప్రాంతవాసుల 60 ఏళ్ల కల. ఇటీవల రాష్ట్ర ఎంపీలు కూడా కోటిపల్లి-నర్సాపురం రైల్వే లైన్ పనులు వేగవంతం చేయాలని కేంద్రాన్ని కోరారు. ఈ క్రమంలోనే కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ కోటిపల్లి - నరసాపురం రైల్వే లైన్ పనుల గురించి అప్ డేట్ ఇచ్చారు.కోటిపల్లి- నరసాపురం రైల్వే లైన్ నిర్మాణానికి అయ్యే ఖర్చును పూర్తి కేంద్రమే భరించేలా ఆలోచన చేస్తున్నట్లు కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. కొంతమంది రైతులు కోర్టుకు వెళ్లటంతోనే కోటిపల్లి నరసాపురం రైల్వే లైన్ అలైన్‌మెంట్ పనులలో జాప్యం జరుగుతున్నట్లు ఆయన తెలిపారు. అన్ని సమస్యలను పరిష్కరించి రైల్వేలైన్ నిర్మాణ పనులు వేగవంతం చేస్తామన్నారు. కోటిపల్లి - నరసాపురం రైల్వే లైన్‌ నిర్మాణానికి 2001లో కేంద్రం ఆమోదించింది. రూ.1,045.20 కోట్లతో నిర్మాణం చేపట్టేందుకు 2001 డిసెంబర్‌లో ఆమోదం తెలిపింది. 2009 నాటికల్లా ఈ రైల్వే లైన్ నిర్మాణం పూర్తికావాల్సి ఉంది. అయితే వివిధ కారణాలతో ఈ ప్రాజెక్టు ముందుకు కదలడం లేదుమరోవైపు కోటిపల్లి నరసాపురం రైల్వే లైన్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం భూమిని కేటాయించాల్సి ఉందని 2024 ఆగస్టులో రైల్వేశాఖ తెలిపింది. 57.21 కిలోమీటర్ల ఈ లైన్‌ నిర్మాణానికి 416.79 హెక్టార్ల భూమి అవసరమని.. ఈ భూమిని రాష్ట్ర ప్రభుత్వం అప్పగించాల్సి ఉందని పేర్కొంది. కోటిపల్లి-నరసాపురం రైల్వే లైన్.. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలను కలిపే ముఖ్యమైన రైల్వే ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టులో భాగంగా గోదావరి నదిపై మూడు ప్రధాన వంతెనలు నిర్మించాల్సి ఉంటుంది. అయితే అలైన్‌మెంట్ ఖరారు. భూ కేటాయింపుల కారణంగా కోటిపల్లి నరసాపురం రైల్వేలైన్ నిర్మాణంలో జాప్యం జరుగుతోంది. అయితే కేంద్ర మంత్రి తాజా ప్రకటనతో ఈ ప్రాజెక్టు పనుల్లో వేగం పెరుగుతుందేమో చూడాలి.

Related Posts