
అనంతపురం, ఏప్రిల్ 22,
రాయలసీమ నేతలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కంట్రోల్ చేయాల్సి ఉంది. రాయలసీమలో గత ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించింది. వైసీపీ అధినేత జగన్ కు పట్టున్న ప్రాంతమైన రాయలసీమలోనే ఆయనను దెబ్బకొట్టగలిగామన్న సంతృప్తి కూటమి పార్టీల అగ్రనేతల్లో ఎక్కువ సమయం మిగిలేట్లు కనిపించడం లేదు. రాయలసీమలో వచ్చే ఎన్నికల్లోనూ మంచి మెజారిటీ సాధించాలన్నా, జగన్ ను కట్టడి చేయాలన్నా చంద్రబాబు నాయుడు అక్కడి నేతలను కొందరిని కంట్రోలో చేయాల్సి ఉంటుంది. లేకపోతే పెద్దయెత్తున పార్టీ డ్యామేజీ అయ్యే అవకాశాలున్నాయి. రాయలసీమలో నేతలు తమ అడ్డాగా భావించి గిరిగీసుకుని మరీ తమ ప్రపంచంలోకి ఎవరూ రాకూడదని ఆంక్షలు విధిస్తున్నారు... నిన్నగాక మొన్న బీజేపీకి చెందిన జమ్మలమడుగుకు చెందిన ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి అనుచరులు ఆల్ట్రాటెక్ కంపెనీ నుంచి లారీలను వెళ్లకుండా అడ్డుకున్నారు. ఈ కంపెనీలో ఏ కాంట్రాక్టు పనైనా తమకే అప్పగించాలన్న షరతును ఆది పెట్టారు. లారీలను అడ్డుకోవడంతో కంపెనీ ప్రొడక్షన్ పై ప్రభావం పడింది. దీంతో జిల్లా కలెక్టర్ సీరియస్ అయి ఆదినారాయణరెడ్డి అనుచరులు పదకొండు మంది పై కేసులు నమోదు చేయించారు. గతంలోనూ ఫ్లై యాష్ వివాదంలో ఆదినారాయణరెడ్డి, తాడిపత్రిమున్సిపల్ ఛైర్మన్ జేసీప్రభాకర్ రెడ్డిల మధ్య వివాదం ముదిరింది. ఇద్దరూ తమకే కావాలంటూ పట్టుబట్టడం చంద్రబాబుకు తలనొప్పిగా మారింది. ఈ వివాదం కూడా పార్టీకి చెడ్డపేరు తెచ్చేలా ఉంది.ఆరు లక్షల ఓటు బ్యాంకుకు? తిప్పనివ్వనంటూ... తాజాగా జేసీ ప్రభాకర్ రెడ్డి మరొక అడుగు ముందుకు వేసి ప్రయివేటు బస్సుల యజమానులకు వార్నింగ్ ఇచ్చారు.. హైదరాబాద్ లో జరిగిన ప్రయివేటు బస్సు ఓనర్ల సమావేశానికి తనను పిలవకపోవడంపై జేసీ ప్రభాకర్ రెడ్డి గుర్రుగా ఉన్నారు. తనను ఆహ్వానించకుండా బస్సు ఓనర్లు సమావేశం ఎలా నిర్వహిస్తారంటూ ప్రశ్నించారు. తాను కూడా ప్రయివేటు బస్సు ఓనరేనని గుర్తులేదా? అంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి నిలదీశారు. ప్రభుత్వానికి బస్సులు లీజు కు ఇస్తే అనంతపురంలో ఎలా నడుపుతారో చూస్తానంటూ బహిరంగంగా వార్నింగ్ ఇచ్చారు. తమ ఇలాకాలో లీజుకు ఇచ్చిన ప్రయివేటు బస్సులు తిరగడానికి లేదంటూ ఆంక్షలు విధించారు. తాను ఎప్పటి నుంచో ప్రయివేటు బస్సులను నడుపుతున్నానని, సమావేశానికి తనను పిలవకపోయినా పరవాలేదు కానీ, ఎవరెవరో తమకు ఇష్టం వచ్చినట్లు బస్సులు తిప్పుదామంటే ఊరుకునేది లేదని జేసీ ప్రభాకర్ రెడ్డి హెచ్చరించారు. బస్సులు లీజుకు ఇస్తే తిరగనిస్తామని అనుకోవడం మంచి పద్ధతి కాదనంటూ జేసీ ఒక రకంగా ప్రయివేటు బస్సుల యాజమాన్యానికి హుకుం జారీ చేశారు. ఇలా తమ ఇలాకాలోకి వేరెవరిని రానివ్వకుండా తామే వ్యాపారాలు చేసుకంటామంటూ నేతలు హెచ్చరిస్తుండటంతో పార్టీలకు తలనొప్పిగా మారింది. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు జోక్యం చేసుకుని ఈ ఇద్దరిని కంట్రోల్ చేయాలని కోరుతున్నారు. లేకుంటే సీమలో ఈ ప్రభావం వచ్చే ఎన్నికల ఫలితాలపై పడుతుందని హెచ్చరిస్తున్నారు.