
విజయవాడ, ఏప్రిల్ 22,
ఆంధ్రప్రదేశ్ లో విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన ఏపీ రాజ్యసభ సీటు ఎన్నిక ప్రక్రియ ప్రారంభమయింది. ఎన్నికల సంఘం ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేసింది. నామినేషన్ల దాఖలుకు నెలాఖరు వరకు గడువు ఉంది. ఈ సీటు కూటమి గెల్చుకోవడం ఖాయం. ఎందుకంటే వైసీపీకి పోటీ చేసే బలం కూడా లేదు. అయితే ఈ సీటును కూటమిలో ఓ పార్టీ తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది. విజయసాయిరెడ్డి బీజేపీ ప్రోద్భలంతోనే రాజీనామా చేశారన్న ప్రచారం ఉంది. అందుకే ఆ సీటును వారికే కేటాయిస్తారని అంటున్నారు. టీడీపీ, జనసేనల్లో ఈ సీటుపై చర్చ లేదు. బీజేపీలోనే అభ్యర్థి ఎవరు అన్న చర్చ జరుగుతోంది. ఇంతకు ముందు కిరణ్ కుమార్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపించినా ఇప్పుడు అన్నామలై పేరు ముందుకు వచ్చింది. తమిళనాడులో రాజ్యసభ సీటు గెలుచుకునేంత బలం బీజేపీకి లేదు. అన్నాడీఎంకేతో పొత్తు కోసం అన్నామలైను ఉన్న పళంగా తమిళనాడు బీజేపీ చీఫ్ పదవి నుంచి తప్పించారు. పార్టీ కోసం కష్టపడిన వారికి అన్యాయం జరగదన్న సంకేతం పంపాలంటే.. ఇప్పుడు ఆయనకు పదవి ఇవ్వాలి. అందుకే అన్నామలై పేరును ప్రచారంలోకి తెచ్చారని భావిస్తున్నారు. ఏపీ నుంచి రాజ్యసభకు వెళ్తున్న వారిలో ఇతర రాష్ట్రాల వారే ఎక్కువగా ఉంటున్నారు. తెలంగాణ ఉద్యమ నేత ఆర్.కృష్ణయ్య ఏపీ నుంచి రాజ్యసభకు ఎంపికయ్యారు. గతంలో తమ పార్టీలో ఎవరూ లేనట్లుగా ఆర్ కృష్ణయ్యకు వైసీపీ రాజ్యసభ సీటు ఇచ్చింది. ఆయన తర్వాత వైసీపీకి రాజీనామా చేసి..బీజేపీలో చేరి మళ్లీ బీజేపీ నుంచి ఎన్నికయ్యారు. గుజరాత్ కు చెందిన పరిమళ్ నత్వానీ కూడా ఏపీ నుంచి రాజ్యసభకు ఎంపికయ్యారు. తెలంగాణకు చెందిన ప్రముఖ లాయర్ నిరంజన్ రెడ్డికి కూడా వైసీపీ రాజ్యసభ సభ్యత్వం ఇచ్చింది. ఇప్పుడు ఇతర రాష్ట్రం నుంచి కూటమి ప్రభుత్వం మరో నేతను రాజ్యసభకు పంపితే .. ఏపీకి సంబంధం లేని నాలుగో ఎంపీ.. ఏపీ నుంచి రాజ్యసభకు వెళ్లినట్లవుతుంది. ఏపీకి రాజ్యసభలో మొత్తం పదకొండు మంది సభ్యులు ఉన్నారు. వీరిలో నలుగురు ఇతర రాష్ట్రాలకు చెందిన వారు అవుతారు. ఇలాంటి పరిస్థితి ఇతర రాష్ట్రాల్లో అయితే సెంటిమెంట్ గా భావిస్తారు. తమ రాష్ట్ర ప్రజలు ఓట్లు వేసి..ఎమ్మెల్యేలుగా గెలిపిస్తే ఇతర రాష్ట్రాల వారిని ఇక్కడి నుంచి రాజ్యసభకు పంపించడం ఏమిటన్న ప్రశ్న ఇతర రాష్ట్రాల వాళ్లు వేస్తారు. దాన్నో సెంటిమెంట్ గా భావిస్తారు. ఇలాంటి విమర్శలే ఇప్పుడు ఏపీ ప్రజల నుంచి ఇతర రాష్ట్రాల వారిని రాజ్యసభకు పంపితే వచ్చే అవకాశం ఉంది.