YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

భీమవరంలో ఆగని పందాలు, పేకాటలు

భీమవరంలో ఆగని పందాలు, పేకాటలు

ఏలూరు, ఏప్రిల్ 22, 
లాస్‌వెగాస్ తెలుసుకదా.. ఇప్పుడీ లాస్‌వెగాస్‌ మినీ వర్షన్‌ భీమవరానికి వచ్చేసిందట. ఎక్కడి లాస్‌వెగాస్.. ఎక్కడి భీమవరం అనే కదా మీ డౌట్. ఈ విషయాలన్ని భీమవరంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. సంక్రాంతి అయిపోయిన నెలలు గడుస్తున్నా.. అక్కడ పండగ జోష్ ఇంకా ఎందుకు కంటిన్యూ అవుతుందో తెలుసుకోవాలి.సంక్రాంతి వచ్చిందంటే.. పందాలు, పేకాట సీజన్ వచ్చినట్టే. గోదావరి జిల్లాలు.. అందులోనా ముఖ్యంగా భీమవరం ప్రాంతానికైతే కోటిశ్వరులు క్యూ కడుతారు. పండుగ నాలుగు రోజులు భీమవరంలో కోడిపందాలు చూసి కోడిపందాల మాటున ఇక్కడ జరిగే జూదంలో రాత్రి పగలు తేడా లేకుండా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటూ ఉంటారు. పోలీసులు సైతం పండుగ నాలుగు రోజులు అటువైపు కన్నెత్తి చూడకుండా.. కనీసం ఆ ఊసే లేనట్లు వ్యవహరిస్తుంటారు. ఇదంతా పండగ నాటి ముచ్చట.. ఈ పండుగ నాలుగు రోజులు ఏం సరిపోతాయి అనుకున్నారేమో భీమవరంలో కొంతమంది సిండికేట్‌గా మారి 365 రోజులు జూదానికి కేరాఫ్ అడ్రస్‌గా భీమవరాన్ని మార్చేస్తున్నారు. ఇప్పుడిదే విషయంపై భీమవరం వాసులు మండిపడుతున్నారు.అమెరికాలోని నెవాడ స్టేట్‌లో అత్యధిక జన సాంద్రత కలిగిన నగరంతో పాటుగా.. జూదాలకు, పేకాటలకు, విందు, వినోదాలకు, విలాసాలకు లాస్‌వేగస్ కేరాఫ్. ఇంచు మించుగా భీమవరం కూడా లాస్‌వేగస్‌ను తలపించేలా డెవలప్ అవుతోంది. గత 10 నెలలుగా జోరుగా సాగుతోంది ఇక్కడ పేకాట. పట్టపగలు కొన్ని క్లబ్బుల్లో విచ్చలవిడిగా జరుగుతున్న పోలీసులు అటు వైపు చూడటం లేదంటూ మండిపడుతున్నారు భీమవరం ప్రజలు.గత పది నెలలుగా భీమవరంలో కొన్ని ప్రధాన పేకాట క్లబ్‌లు పూర్తిస్థాయిలో హౌస్ ఫుల్ కలెక్షన్లతో నడుస్తున్నాయట. భీమవరంలో చాలా పెద్ద క్లబ్బుగా పేరు తెచ్చుకున్న దాంట్లో అయితే ఏకంగా రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా ఆటకు 5 లక్షల వరకూ జూదం జరుగుతుందని భీమవరంలో ఇప్పుడు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ ఒక క్లబ్ ద్వారా నెలకు కనీసం కోటిన్నర పైగానే ఆదాయం వస్తుందని టాక్. మిగిలిన చిన్న చితకా క్లబ్‌ల ద్వారా నెలకు వందట కోట్లలో ఆదాయం వస్తుందట.రాజా కాయ్ అంటూ గుట్టుగా సాగుతున్న ఈ వ్యవహారం ఇంత వరకు ఎందుకు బయటకు రాలేదు? కోట్ల కొద్ది డబ్బు చేతులు మారుతుందన్న ప్రచారం సాగుతున్నా ఎవరికి ఎందుకు పట్టడం లేదు?భీమవరంలో గుట్టు చప్పుడు కాకుండా జరుగుతున్న ఈ వ్యవహారం గురించి పెద్దగా బయటికి రావడం లేదని టాక్. గత పది నెలలుగా భీమవరంలో ఉన్న క్లబ్‌లలో ఉన్న రికార్డులను పరిశీలిస్తే అసలు వాస్తవాలు వెలుగు చూస్తాయంటున్నారు స్థానికులు. నాణ్యమైన విద్య అందించేందుకు ఎంతో పేరు తెచ్చుకున్న ఇంజనీరింగ్ కాలేజీలు, పెద్ద పెద్ద మెడికల్ కాలేజ్‌లు ఉన్న భీమవరం ఇప్పుడు పేకాటలో రాష్ట్రంలోనే ముందు ఉండేలా చేయడంపై భీమవరం వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.పేకాటతో సాధారణ మధ్య తరగతి ప్రజలు జేబులు గుల్ల చేసుకొని నిర్వాహకుల జేబుల్లోకి కోట్లాది రూపాయలు చేరుతున్నాయి. సంక్రాంతి పండుగ నాలుగు రోజులపాటు తెలుగు రాష్ట్రాల్లో భీమవరం పేరు మారుమోగుతుందంటే అదొక సరదా కార్యక్రమంగా తీసుకున్నా.. ఇప్పుడు పేకాటలో అంతకుమించి పేరు తెచ్చుకోవడానికి కారకులు ఎవరు అంటూ భీమవరం వాసులు ప్రశ్నిస్తున్నారు?మరి ఇంత జరుగుతుంటే.. ఖాకీలు ఏం చేస్తున్నారు? అంటే ఏం చేయడం లేదనే చెప్పాలి. క్లబ్‌లలో జూదాన్ని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు.. కనీసం అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదట. పోలీసులకు భయపడుతూ ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో వెయ్యి, రెండు వేలకు పేకాటడే సామాన్య పందెం రాయులను పోలీసులు వేటాడి వెంటాడి పట్టుకుంటుంటున్నారు. పోలీసులకు కనపడకుండా చెరువు గట్ల మీద.. తుమ్మ చెట్ల కింద, లారీల్లో పేకాట ఆడుతుంటే డ్రోన్‌లు ఎగరేసి మరీ వీడియో సాక్షాలతో సహా పట్టుకునే పోలీసులకు… నగరం నడిబొడ్డునలో కోట్లాది రూపాయలుతో పేకాట ఆడుతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి.అటు నేతలకు.. ఇటు కనిపించని నాలుగో సింహానికి అందాల్సిన వాటాలు క్రమం తప్పకుండా అందుతున్నాయని అందుకే క్లబ్బుల్లో పెద్ద ఎత్తున పేకాట జరుగుతున్నా పట్టించుకోవడంలేదని విమర్శలు వస్తున్నాయి. భీమవరంలో ప్రస్తుతం పేకాట నడుస్తున్న క్లబ్‌ల ద్వారా నిర్వాహకులు నెలకు కోట్లాది రూపాయల ఆదాయం సంపాదిస్తున్నట్టు తెలుస్తోంది.మొత్తానికైతే భీమవరంలో జూదం మూడు ముక్కలు.. ఆరు పేకలు అన్నట్టుగా సాగిపోతుంది. దీంతో తెలుగు రాష్ట్రాల జూదగాళ్లకు భీమవరం కేరాఫ్‌ అవుతుందన్న టాక్ నడుస్తోంది. మరి ఇప్పటికైనా పోలీసులు గుట్టుచప్పుడు కాకుండా సాగిపోతున్న ఈ వ్యవహారంపై దృష్టి సారిస్తారా? లేదా? అనేది చూడాలి.

Related Posts