
కాకినాడ, ఏప్రిల్ 22,
దళితులపై దారుణాలు ఉత్తరాదిలో ఇంకా అక్కడక్కడ కనపడుతుంటాయి. కానీ తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి సంఘటనలు అరుదు. అయితే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో ఇలాంటి ఘటన జరగడం సంచలనంగా మారింది. అయితే నిజానిజాలు నిగ్గు తేల్చేందుకు అధికారులు రంగంలోకి దిగారు. దళితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పిఠాపురంలోని మల్లం అనే గ్రామానికి వెళ్లారు.కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకర్గంలోని మల్లం గ్రామంలో దళిత సామాజిక వర్గానికి చెందినవారిపై ఉన్నత వర్గాలు వివక్ష చూపిస్తున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఉన్నతవర్గాలు చెందినవారు దళితులను సాంఘిక బహిష్కరణకు గురి చేశారు. వారికి టిఫిన్, టీ ఏమీ ఇవ్వకుండా వ్యాపారుల్ని కట్టడి చేశారు. ఆ సామాజిక వర్గానికి చెందిన వారికి కనీసం నిత్యావసరాలు కూడా ఇవ్వడంలేదు. ఒకరకంగా వారిని వెలివేసినట్టు చేశారు. దీంతో వారంతా స్థానిక ఆర్డీవోకు ఫిర్యాదు చేశారు. మల్లం గ్రామానికి అధికారులంతా విచారణ కోసం వెళ్లారు. సీఐ సమక్షంలో ఆర్డీవో విచారణ చేపట్టారు. వివక్షకు గురైన వారిని కలిశారు. వారు చెప్పిన అంశాలన్నీ విన్నారు. ఆధారాలు సేకరించారు. ఉన్నతవర్గాలు తమను సామాజిక బహిష్కరణకు గురి చేశాయని, వారిపై చర్యలు తీసుకోవాలని బాధితులు ఫిర్యాదు చేశారుఅసలు ఈ గొడవ ఎందుకు మొదలైందనే విషయాన్ని బాధితులు కొంతమంది సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మల్లం గ్రామంలో ఇటీవల దళిత వర్గానికి చెందిన సురేష్ అనే యువకుడు ఉన్నత వర్గాలకు చెందిన వారి ఇంటికి విద్యుత్ రిపేర్ వర్క్ కోసం వెళ్లాడు. అక్కడ అతను రిపేర్ చేస్తూ కరెంట్ షాక్ తో చనిపోయాడు. చనిపోయిన సురేష్ కుటుంబానికి న్యాయం చేయాలని, నష్టపరిహారం అందించాలని వారి బంధువులు, స్థానికులు డిమాండ్ చేశారు. దీంతో ఉన్నత వర్గాల వారు తమపై కక్షగట్టారని కొంతమంది ఆరోపిస్తున్నారు. దళితులను గ్రామ బహిష్కరణకు గురి చేశారని అంటున్నారు. తమకు వస్తువులు విక్రయించకూడదంటూ ఊరి పెద్ద ఆదేశించారని, వ్యాపారులెవరూ తమకు ఏమీ అమ్మడం లేదని ఆరోపించారు. దీనికి సంబంధించి కొన్ని వీడియోలను బాధితులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.పల్లం గ్రామం పిఠాపురం నియోజకవర్గంలో ఉండటంతో ఈ ఘటన మరింత సంచలనంగా మారింది. సాక్షాత్తూ డిప్యూటీసీఎం పవన్ కల్యాణ్ నియోజకవర్గంలో దళితుల సాంఘిక బహిష్కరణ అంటూ వైసీపీ అనుకూల మీడియాలో వార్తలు వస్తున్నాయి. జరిగిన సంఘటనను హైలైట్ చేయడంతోపాటు, అది పవన్ కల్యాణ్ నియోజకవర్గం అనే విషయాన్ని ప్రస్తావిస్తూ వైసీపీ మీడియా కథనాలిస్తోంది. దీంతో ఈ వ్యవహారం సోషల్ మీడియాలో కూడా సంచలనంగా మారింది. అయితే జనసేన తరపున ఎక్కడా అధికారికంగా ఈ వ్యవహారంపై నాయకులెవరూ స్పందించలేదు.పవన్ కల్యాణ్ నియోజకవర్గం అంటూ వార్తలు రావడంతో వెంటనే అధికారులు కూడా అప్రమత్తం అయ్యారు. పల్లం గ్రామంలో పర్యటించారు. బాధితులకు భరోసా ఇచ్చారు. వెలి వేశారంటున్న వారి నుంచి వివరాలు సేకరించారు. సమగ్ర నివేదికను ఉన్నతాధికారులకు సమర్పించబోతున్నారు. ఈ ఘటనపై డిప్యూటీసీఎం కార్యాలయం కూడా వివరణ కోరినట్టు తెలుస్తోంది.