YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విదేశీయం

ట్రంప్ ఎఫెక్ట్... అమెరికాలో ఉద్యోగాలు ఫట్...

ట్రంప్ ఎఫెక్ట్... అమెరికాలో ఉద్యోగాలు ఫట్...

న్యూయార్క్, ఏప్రిల్ 22, 
ఎవరు తవ్వుకున్న గోతిలో వారు పడతారు అనేది ఓ సామెత. కానీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌చేపట్టిన చర్యలు చూస్తుంటే.. ఈ సామెత ఆ దేశానికి సరిగ్గా సరిపోయేలా ఉంది. ప్రపంచంలో అమెరికాను నంబర్‌ వన్‌గా నిలపాలనే ప్రయత్నంలో ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు ఆ దేశంలోని ప్రజలు, ఉద్యోగులు, కంపెనీలకే ముప్పుగా మారుతున్నాయి.అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించిన ప్రతీకార సుంకాలు ప్రపంచ వాణిజ్య వ్యవస్థను కుదిపేస్తున్నాయి. ఆటోమోటివ్, భారీ వాహన తయారీ రంగాలను అనిశ్చితిలోకి నెట్టాయి. ఈ నేపథ్యంలో, స్వీడన్‌కు చెందిన ప్రముఖ వాహన తయారీ సంస్థ వోల్వో గ్రూప్ అమెరికాలోని తన మూడు కర్మాగారాల్లో 550 నుంచి 800 ఉద్యోగాలను తొలగించాలని నిర్ణయించింది. మార్కెట్‌ అనిశ్చితి, ట్రక్కుల డిమాండ్‌ తగ్గుదల, మరియు సుంకాల వల్ల పెరిగిన ఉత్పత్తి ఖర్చులు ఈ నిర్ణయానికి ప్రధాన కారణాలుగా చెబుతున్నారు.వోల్వో గ్రూప్‌ ఈ ఉద్యోగ కోతలు అమెరికాలోని మూడు కీలక కర్మాగారాలను ప్రభావితం చేయనున్నాయి.
పెన్సిల్వేనియా, మకుంగీ: మాక్‌ ట్రక్స్‌ ప్లాంట్‌లో ఉద్యోగులు.
వర్జీనియా, డబ్లిన్‌: వోల్వో సంస్థ యొక్క తయారీ యూనిట్‌.
మేరీల్యాండ్, హేగర్సౌ్టన్‌: వోల్వో యొక్క మరో తయారీ సైట్‌.
ఈ కర్మాగారాలు భారీ–డ్యూటీ ట్రక్కులు మరియు సంబంధిత ఆటోమోటివ్‌ ఉత్పత్తుల తయారీలో కీలక పాత్ర పోషిస్తాయి. అయితే, సుంకాల వల్ల పెరిగిన ముడి పదార్థాల ధరలు మరియు తగ్గిన ఫ్రైట్‌ డిమాండ్‌ ఈ యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని దెబ్బతీస్తున్నాయి.ట్రంప్‌ పరిపాలన విధించిన సుంకాలు ప్రపంచ సరఫరా గొలుసులను అస్తవ్యస్తం చేశాయి. ఉక్కు, అల్యూమినియం వంటి ముడి పదార్థాలపై అధిక సుంకాలు వోల్వో వంటి సంస్థలకు తయారీ ఖర్చులను పెంచాయి. అదనంగా, సరుకు రవాణా రంగంలో డిమాండ్‌ తగ్గడం, ఆర్థిక అనిశ్చితి, సంభావ్య నియంత్రణ మార్పులు కంపెనీలను కఠిన నిర్ణయాలు తీసుకునేలా ఒత్తిడి చేస్తున్నాయి. వోల్వో గ్రూప్‌ ప్రతినిధి ఒకరు, ‘ప్రస్తుత మార్కెట్‌ పరిస్థితులకు అనుగుణంగా ఉత్పత్తిని సర్దుబాటు చేయడం, దీర్ఘకాల పోటీతత్వాన్ని కాపాడుకోవడం కోసం ఈ చర్యలు అవసరం‘ అని వెల్లడించారు.అమెరికా ట్రక్కింగ్‌ పరిశ్రమఇటీవలి సంవత్సరాల్లో గణనీయమైన సవాళ్లను ఎదుర్కొంటోంది. ఫ్రైట్‌ రేట్లలో అస్థిరత, డిమాండ్‌ తగ్గుదల, సుంకాలతో పెరిగిన ఖర్చులు ఈ రంగంలోని సంస్థలను ఒత్తిడిలోకి నెట్టాయి. వోల్వో వంటి కంపెనీలు, ఉత్తర అమెరికాలో సుమారు 20 వేల మంది కార్మికులతో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. కానీ మార్కెట్‌ బలహీనత వల్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని తగ్గించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పరిశ్రమ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, ఈ సుంకాలు దీర్ఘకాలంలో ఆటోమోటివ్‌ రంగంలో ఆవిష్కరణలను, పెట్టుబడులను కూడా ప్రభావితం చేయవచ్చు.వోల్వో గ్రూప్‌ ఉద్యోగ కోతలకు సంబంధించిన పూర్తి వివరాలను ఇంకా వెల్లడించనప్పటికీ, ప్రభావిత కార్మికులకు సెవరెన్స్‌ ప్యాకేజీలు, ఇతర ఆర్థిక సహాయం అందించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. కంపెనీ ఈ కఠిన నిర్ణయాన్ని కార్మికులపై ప్రభావాన్ని తగ్గించే విధంగా అమలు చేయడానికి ప్రయత్నిస్తోందని తెలుస్తోంది. అయినప్పటికీ, ఈ తొలగింపులు స్థానిక ఆర్థిక వ్యవస్థలపై, ముఖ్యంగా పెన్సిల్వేనియా, వర్జీనియా, మరియు మేరీల్యాండ్‌లోని సమాజాలపై ప్రతికూల ప్రభావం చూపవచ్చని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.ట్రంప్‌ సుంకాలు కేవలం వోల్వో గ్రూప్‌ను మాత్రమే కాకుండా, ఇతర అంతర్జాతీయ సంస్థలను కూడా ఒత్తిడిలోకి నెట్టాయి. ఈ సుంకాలు ప్రపంచ వాణిజ్యంలో అస్థిరతను పెంచడంతో పాటు, సరఫరా గొలుసులను దెబ్బతీశాయి. ఈ పరిస్థితి కొనసాగితే, ఇతర తయారీ సంస్థలు కూడా ఉత్పత్తి తగ్గింపు లేదా ఉద్యోగ కోతల వంటి చర్యలకు పాల్పడవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Related Posts