YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

కేశినేని బ్రదర్స్ మధ్య వార్

కేశినేని బ్రదర్స్ మధ్య వార్

విజయవాడ, ఏప్రిల్ 23,
బెజవాడ రాజకీయాలు మళ్లీ హీటెక్కాయి. కేశినేని నాని, కేశినేని చిన్నిల మధ్య మళ్లీ ట్వీట్ల యుద్ధం మొదలయింది. విశాఖపట్నంలో ఉర్సా క్లస్టర్ కంపెనీకి భూములను కేటాయించడంపై కేశినేని అభ్యంతరం తెలిపారు. ఈ మేరకు చంద్రబాబు నాయుడును ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. ఉర్సా క్లస్టర్ కంపెనీకి ఒక విశ్వసనీయత లేదని, 2025లో స్థాపించిన సంస్థ కావడంతో దానికి అతి తక్కువ ధరకు భూములను కేటాయించడంపై కేశినేని నాని అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనివల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని తెలిపారు. ఈ సంస్థకు ఇచ్చిన భూముల కేటాయింపులను రద్దు చేయాలని కూడా కేశినేని నాని కోరారు. దీనిపై అనేక విమర్శలు కూడా వెల్లువెత్తుతున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు... విశాఖపట్నంలో అతి తక్కువ ధరకు ఉర్సా క్లస్టర్ కంపెనీకి అరవై ఎకరాలు కేటాయించడం ఇప్పటికే విమర్శలకు తావిచ్చింది. ఊరూ పేరులేని సంస్థకు అంత విలువైన భూములను ఎలా అప్పగిస్తారని జాతీయ మీడియాలో సయితం కథనాలు ప్రసారమయ్యాయి. 2025లో కూటమి ప్రభుత్వం ఏర్పాటయిన తర్వాత స్థాపించిన పరిశ్రమకు అంత పెద్ద సంఖ్యలో భూముల ఎలా కేటాయిస్తారన్న ప్రశ్నలు బాగా వినపడుతున్నాయి. ఈ నేపథ్యంలో నిన్న చంద్రబాబు పుట్టిన రోజు సందర్భంగా కేశినేని నాని ఆయనకు బర్త్ డే విషెస్ చెప్పారు. 2024లో తనకు సీటు దక్కకపోవడంతో కేశినేని నాని టీడీపీని వీడి వైసీపీలో చేరారు. వైసీపీ నుంచి పోటీ చేసినా విజయవాడ పార్లమెంటు ప్రజలు మూడో సారి ఆదరించలేదు దీంతో మళ్లీ కేశినేని నాని చంద్రబాబుకు దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నారన్న ప్రచారం జరగుతుంది. ఈ నేపథ్యలోనే ఆయన బర్త్ డే కి నిన్న ట్వీట్ చేసి నేడు మరో ట్వీట్ తో ఆయన సోదరుడు ప్రస్తుత ఎంపీ కేశినేని చిన్ని పితూరీలు చెప్పేందుకు సిద్ధమయ్యారన్న ఆరోపణలు వినపడుతున్నాయి. కేశినేని నాని, కేశినేని చిన్నిలు అన్నదమ్ములయినప్పటికీ ఇద్దరి మధ్య ఆస్తుల వివాదాలతో పాటు రాజకీయ వైరుధ్యాలు ఉండటంతోనే ఈ ట్వీట్ వార్ స్టార్ట్ చేశారంటూ టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఆరోపించారు. ఉర్సా క్లస్టర్ సంస్థ కేశినేని చిన్నికి చెందిందని, దానికి అంత పెద్ద సంఖ్యలో భూములు కేటాయించడాన్ని కేశినాని నాని తప్పు పట్టడం ఇప్పుడు బెజవాడ పాలిటిక్స్ లో హీట్ ను రాజేసినట్లయింది. కేశినేని చిన్నికి సంబంధించిన సంస్థ కాబట్టే తక్కువ ధరకు అరవై ఎకరాల విలువైన భూములను కేటాయించారన్న అర్థం వచ్చే రీతిలో కేశినేని నాని ట్వీట్ చేయడం టీడీపీ నేతల ఆగ్రహానికి గురి చేసింది. అయితే దీనిపై బుద్ధా వెంకన్న మినహా ఎవరూ స్పందించకపోయినా కేశినేని నాని మరోసారి తన సోదరుడు చిన్నిని లక్ష్యంగా చేసుకుని ఈ ట్వీట్ చేశారంటూ పెద్దయెత్తున సోషల్ మీడియాలో టీడీపీ నేతలు ద్వజమెత్తుతున్నారు. నారా లోకేశ్ పేరును కూడా కేశినేని చిన్ని మద్యం, ఇసుక వంటి కేసుల్లో బయటకు తెస్తున్నారని కూడా కేశినేని నాని ట్వీట్ చేయడం ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోనే కాదు.. కూటమి పార్టీల్లోనూ చర్చనీయాంశమైంది. మరోసారి బ్రదర్స్ మధ్య వార్ మళ్లీ మొదలయినట్లేనని విశ్లేషకులు చెబుతున్నారు.

Related Posts