
విజయవాడ, ఏప్రిల్ 23,
నూజివీడు.. మామిడి పండ్లకు కేరాఫ్ అడ్రస్. నూజివీడు ప్రాంతంలో దాదాపు 40 వేల ఎకరాల్లో మామిడి పంటను సాగు చేస్తున్నారు. ఇక్కడ కాయలు కోయకముందే వ్యాపారులు రైతులతో ఒప్పందం చేసుకొని తోటలను కొనుగోలు చేస్తారు. ఆ పంట వరకు డబ్బులు చెల్లించి.. కోత మొదలు పెడతారు. దీంతో రైతులకు పండ్లతో సంబంధం ఉండదు. కేవలం పండించడమే వారి బాధ్యత.ఇదంతా ఎలా ఉన్నా.. అసలు సమస్య అక్కడే మొదలవుతోంది. వ్యాపారులకు విక్రయించని రైతులు.. పండ్ల పండాక కోసి.. మార్కెట్లకు తరలిస్తారు. కానీ.. వ్యాపారులు కొనుగోలు చేసిన తోటల్లో.. పండ్లు పూర్తిగా పండకముందే.. కోస్తున్నారు. వాటికి రసాయనాలు పూసి.. తొందరగా పక్వానికి వచ్చేలా చేస్తున్నారు. ఇలా చేయడంతో ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతోంది. వాటిని ఇతర పట్టణాలు, నగరాలకు తరలించి విక్రయిస్తున్నారు.రసాయనాలతో పక్వానికి తెచ్చిన పండ్లను తింటే ఆరోగ్య సమస్యలు బారినపడే ప్రమాదముందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి పండ్లను తీసుకోవడం ద్వారా.. క్యాన్సర్, అల్సర్, లివర్, కిడ్నీ, జీర్ణ సంబంధిత వ్యాధులు, కాళ్లు, చేతులు తిమ్మిర్లు, నరాల బలహీనతలకు గురయ్యే ప్రమాదం ఉంది. కాల్షియం కార్బైడ్ ద్వారా వెలువడే ఎసిటిలిన్ వాయువు.. నాడీ వ్యవస్థ మీద ప్రభావం చూపి తలనొప్పి, దీర్ఘకాలిక మత్తు, శక్తిని కోల్పోయే ప్రమాదముంది. చిన్నారుల్లో వ్యాధి నిరోధక శక్తి తగ్గి శ్వాస సంబంధిత ఇబ్బందులు తలెత్తుతాయి.2011 ఆహార భద్రత, ప్రమాణాల నిబంధనలు ప్రకారం.. ప్రభుత్వం కార్బైడ్, ఎసిటిలిన్ రసాయనాలను నిషేధించింది. సహజంగా పండించే ఇథిలిన్‌ను మాత్రమే కొంత వరకు వినియోగించేందుకు అనుమతిచ్చింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. సుమారు 20 కిలోల పండ్లకు 5 గ్రాముల ఇథిలిన్‌ను వినియోగించాల్సి ఉంటుంది. మేలిమి పండులా కనిపించేందుకు వ్యాపారులు కార్బైడ్‌ను వినియోగిస్తున్నారు. ఆమోదించిన ఇథిలిన్‌తో పోలిస్తే కార్బైడ్, ఇతర రసాయనాలు మార్కెట్‌లో చౌకగా లభిస్తుండటంతో వీటిని వ్యాపారులు ఇష్టానుసారంగా వాడుతున్నారు.'కృత్రిమంగా పండించిన పండ్లను తిన్న వారికి వాంతులు, విరేచనాలు, దాహం ఎక్కువగా కావటం, కడుపులో తిప్పటం వంటి సమస్యలు వస్తాయి. మామిడి పండ్లను తినే ముందు ఉప్పు నీటిలో కడగాలి. కృత్రిమంగా పండించిన పండ్లను సాధ్యమైనంత వరకు తినకపోవడం మంచిది' అని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు.