
విజయవాడ, ఏప్రిల్ 23,
తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ భూతం ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేసింది. ఎంతోమంది యువత ఆయుష్షును అర్ధాంతరంగా ముగిసేలా చేసింది. ఇక ఏపీలోని చాలా బార్‌లలో రోజూ బెట్టింగ్ నడుస్తుంది. ప్రతీదగ్గర స్క్రీన్‌లు వేసి బెట్టింగ్‌లు జోరుగా నడిపిస్తున్నారు. దీంట్లో ప్రజా ప్రతినిధులకు కూడా వాటాలు ఉన్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే వాళ్లవే బార్లు, వాళ్లవే బెట్టింగులు అని తెలుస్తోంది. ఉదాహరణకు ఏలూరులో రైల్వే స్టేషన్ సమీపంలో ఓ బార్ ఉంది. ఓపెన్ ఎయిర్ స్క్రీన్ ఏర్పాటు చేసి.. జోరుగా బెట్టింగ్‌కు పాల్పడుతున్నట్టు తెలుస్తోంది.దీనిపై ఇటీవల తెలంగాణ ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంది. ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసిన వారిపైనా కేసులు నమోదు చేసింది. ఫలితంగా ఆన్ లైన్ బెట్టింగ్ కాస్త తగ్గింది. కానీ.. ఇన్నాళ్లు బెట్టింగ్ దోపిడీకి పాల్పడ్డ ముఠాలు ఇప్పుడు కొత్త దారిని ఎంచుకున్నాయి.ప్రస్తుతం ఐపీఎల్ మ్యాచ్‌లు జరుగుతున్నాయి. ఈ సమయంలో ఆన్ లైన్ బెట్టింగ్‌పై గట్టి నిఘా ఉంది. దీంతో బుకీలు రూచ్ మార్చి.. మళ్లీ పాత పద్ధతిని ఎంచుకున్నారు. ఆఫ్ లైన్ బెట్టింగ్ దందా కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా ఏపీ-తెలంగాణ సరిహద్దు పట్టణాల్లో ఈ దందా జోరుగా సాగుతోంది. ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి, అశ్వరావుపేట, మధిర, కొత్తగూడెం, బూర్గంపాడు, భద్రాచలం, వైరా ప్రాంతాల్లో గుట్టుగా బుకీలు దందా సాగిస్తున్నారు.ఇటు నల్గొండ జిల్లాలోని హుజూర్‌నగర్, నల్గొండ, సూర్యాపేట, కోదాడ ప్రాంతాల్లో ఆఫ్ లైన్ బెట్టింగ్ దందా జోరుగా సాగుతోందని తెలుస్తోంది. ఈ ప్రాంతాలకు అటు ఏపీ నుంచి ఇటు తెలంగాణ నుంచి బెట్టింగ్ రాయుళ్లు వస్తున్నారని తెలుస్తోంది. ముఖ్యంగా బార్లు, చాయ్ కేఫ్‌లు, రెస్టారెంట్లు, లాడ్జీలు ఆఫ్ లైన్ బెట్టింగ్‌కు వేదికలయ్యాయి. చాలా రోజులుగా పోలీసులు ఈ ఆఫ్‌లైన్ బెట్టింగ్‌పై ఫోకస్ పెట్టడం లేదు. దీంతో బుకీలు రెచ్చిపోతున్నారు.ఆఫ్ లైన్ బెట్టింగ్ స్పాట్‌కు తక్కువ మంది వెళ్తున్నారు. అక్కడ ఉన్న బుకీలు, బ్రోకర్లు అమాయకులకు ఫోన్లు చేసి బెట్టింగ్ పెట్టేలా ప్రోత్సహిస్తున్నారు. దీంతో ఈ విష సంస్కృతి మారుమూల పల్లెలకూ పాకింది. నెలకు రూ.10 వేలు సంపాందించే వారు కూడా క్రికెట్ బెట్టింగ్‌కు బానిసలవుతున్నారు. బాల్ టు బాల్, ఓవర్ టు ఓవర్, వికెట్ టు వికెట్.. ఇలా రకరకాలుగా బెట్టింగ్ నడుస్తోంది. ఇప్పటికే ఎంతోమంది డబ్బులు పొగొట్టుకొని చెప్పలేని తిప్పలు పడుతున్నారు.ఆఫ్‌లైన్ బెట్టింగ్‌లో మోసపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అనధికారిక వ్యక్తులు లేదా సంస్థలు బెట్టింగ్ నిర్వహిస్తే, మీ డబ్బును కోల్పోయే ప్రమాదం ఉంది. గెలిచినప్పటికీ, వారు చెల్లించకపోవచ్చు. ఆఫ్‌లైన్‌లో ఎంత మొత్తం బెట్ వేస్తున్నారో ట్రాక్ చేయడం కష్టం. ఇది ఎక్కువ నష్టపోయేలా చేస్తుంది. బెట్టింగ్ వ్యసనంగా మారితే.. అది వ్యక్తిగత, కుటుంబ జీవితంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఆఫ్‌లైన్‌లో ఈ వ్యసనం మరింత వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉంది.