
ఒంగోలు, ఏప్రిల్ 23,
మూడు రాజధానుల నుంచి మద్యం వరకు.. వలంటీర్ వ్యవస్థ నుంచి సచివాలయాల వరకు.. వైసీపీ అధినేత జగన్ చేసిన ప్రయోగాలు వికటించిన విషయం తెలిసిందే. ఇవే.. ఆయనను నిలువునా ముంచాయన్నది మేధావుల నుంచి విశ్లేషకుల వరకు చెబుతున్న మాట. తాను పట్టిన కుందేలుకు మూడు కాళ్లే అన్నట్టుగా ఆయన అప్పట్లో వ్యవహరించారన్న విమర్శలు తెలిసిందే. ఏరాష్ట్రంలోనూ లేని విధంగా మూడురాజధానులు తెచ్చారు. దీనిపై కేంద్రం కూడా విస్మయం వ్యక్తం చేసింది. ఇక, వలంటీర్ వ్యవస్థను తెచ్చామని చెప్పినా.. వారిని పొడిగించని ఫలితంగా ఇప్పుడు వారికి దిక్కు మొక్కు లేకుండా పోయింది. పైగా ఎన్నికల సమయంలో కీలక నాయకుల కంటే కూడా.. వారే ఎక్కువై పోయారన్నట్టుగా జగన్ వ్యవహరించారు. ఫలితంగా కార్యకర్తలు పోయి..వైసీపీని వలంటీర్లు నడిపించే పరిస్థితి వచ్చింది. ఇదో పెద్ద మైనస్‌గా మారి.. ఎక్కడికక్కడ ఓటు బ్యాంకు చీలిపోయింది. ఫలితంగా వైసీపీ నాశనమైంది. ఇక, మరో రెండు కీలక విషయాలు.. మద్య నిషేధం.. చీప్ బ్రాండ్స్‌ను ఎక్కువ ధరలకు విక్రయించడం.. ఈ రెండు కూడా.. వికటించాయి. మద్యనిషేధం పేరుతో మంచి చేశామని జగన్ చెబుతున్నా.. ప్రజలకు అవగాహన కల్పించడంలో విఫలమయ్యారు. ఇక, సచివాలయాలను నిర్మించి.. మంచి చేసినా.. దానివల్ల కూడా ప్రయోజనం రాబట్టుకోలేక పోయారు. సొ.. మొత్తంగా జగన్ అనుసరించిన విధానాలు వివాదానికి దారితీశాయి. చివరకు ఆ పార్టీకి మైనస్ పై మైనస్ అయ్యాయి. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల నాటికి.. జగన్ తన విధానాలను మార్చుకోక తప్పదన్న వాదన బలంగా వినిపిస్తోంది. “ఏం చేస్తారో.. ఏమో.. మా విధానాలు మారాల్సి ఉంది. ఏదీ ఒక్కటీ కూడా వర్కవుట్ కాలేదు. మా నాయకుడు ఆదిశగా అడుగులు వేస్తారని అనుకుంటున్నాం. ఇంకా మూడు రాజధానులని మేం ఎలా చెబుతాం“ అని సీనియర్ నాయకుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వ్యాఖ్యలు పరిగణనలోకి తీసుకుంటే.. మార్పు తప్పదన్న సంకేతాలు వస్తున్నాయి. సో.. జగన్ తన విధానాలను మార్చుకునే టైం త్వరలోనే ఉందని కూడా అంటున్నారు. మరి ఏంచేస్తారు..? కొత్త విధానాలు ఏంటి? అనేది వేచి చూడాలి.