
కడప, ఏప్రిల్ 23,
వైసీపీ హయాంలో జరిగిన రూ.వేల కోట్ల విలువైన మద్యం కుంభకోణంలో నాటి ప్రభుత్వ పెద్దల తరఫున అన్నీ తానై వ్యవహరించిన కెసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి అలియాస్ రాజ్ కెసిరెడ్డి ఎట్టకేలకు అరెస్టయ్యారు.రాజ్ కెసిరెడ్డి రాజేష్‌రెడ్డి అనే మారు పేరు, నకిలీ గుర్తింపు పత్రాలతో గోవా నుంచి ఇండిగో విమానంలో హైదరాబాద్‌లో దిగారు. విమానాశ్రయంలో అప్పటికే మాటు వేసిన సిట్ అధికారులు పట్టుకున్నారు. అరెస్టు చేసినట్లు కుటుంబసభ్యులకు సమాచారమిచ్చారు. శంషాబాద్ నుంచి రాత్రి 11.10 గంటలకు ఆయన్ను విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఉన్న సిట్ కార్యాలయానికి తీసుకొచ్చారు కాగా రాజ్ కెసిరెడ్డి.సిట్ జారీ చేసిన నోటీసుల చట్టబద్ధతను సవాల్ చేస్తూ, ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టు, సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వాటి విచారణలన్నీ పెండింగ్‌లో ఉన్నాయి. మరోవైపు ఆయనపై లుకౌట్ సర్క్యులర్ జారీ అయింది. మరోవైపు రాజ్ కెసిరెడ్డి విచారణకు ఏ మాత్రం సహకరించకపోవటంతో.. ఆయన కుటుంబసభ్యులు, బంధువులు, బినామీలు, మద్యం కుంభకోణం సొత్తును పెట్టుబడులుగా పెట్టిన సంస్థలు, వాటి డైరెక్టర్ల నివాసాలు, కార్యాలయాల్లో సిట్ అధికారులు ఇటీవల వరుసగా 3 రోజులపాటు సోదాలు నిర్వహించారు. కీలక పత్రాల్ని స్వాధీనం చేసుకున్నారు. ఆయన తండ్రి ఉపేంద్రరెడ్డికి నోటీసులిచ్చారు. ఇలా అన్ని వైపుల నుంచి అష్టదిగ్బంధం చేయడంతో తప్పించుకోవటం సాధ్యం కాదని గుర్తించిన రాజ్ కెసిరెడ్డి.. హైదరాబాద్ నుంచి చెన్నైకు చేరుకుని అక్కడి నుంచి విదేశాలకు వెళ్లిపోవాలని కుట్ర చేశారు. కానీ ఈ లోపు సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.కాగా కసిరెడ్డి విచారణ సందర్భంగా పలువురి పేర్లు బయటకు వచ్చినట్లు తెలుస్తుంది. నిన్న రాత్రి నుంచి కసిరెడ్డిని సిట్చీఫ్ రాజశేఖర్ బాబు విచారిస్తున్నారు. ఈవిచారణలో సిట్ చీఫ్‌తో పాటు ఏడుగురు అధికారుల బృందం ఉంది. అయితే వసూళ్ల నెట్‌వర్క్‌తో తనకు సంబంధం లేదని కసిరెడ్డి చెబుతున్నట్లు సమాచారం. గతంలో విజయసాయి, మిథున్ సిట్ఎదుట ఇచ్చిన స్టేట్‌మెంట్స్ ఆధారంగా విచారణ జరుగుతోంది. పలు ఆధారాలను చూపిస్తూ సిట్ బృందం ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో తెరపైకి బల్లం సుధీర్ అనే పేరు వచ్చింది. ఇతను కసిరెడ్డికి అత్యంత సన్నిహితుడిగా పేరుంది. లావాదేవీలన్నీ సుధీర్ ద్వారానే జరిపినట్టు తెలుస్తుంది. ఇంతకు సుధీర్ ఎవరు అనే కోణంలో అధికారులు కూపీ లాగే పనిలో ఉన్నారు. ఏపీ, తెలంగాణలో ఇసుక మాఫియాలోనూ ఇద్దరూ ఉన్నట్లు ప్రచారం సాగుతుంది. కసిరెడ్డి, సుధీర్ కలిసి వందల కోట్ల రూపాయలు వెనుకేసుకొన్నట్లు సమాచారం. ఈ లిక్కర్ స్కాంలో కేసిరెడ్డి తర్వాత సుధీర్దే కీలకపాత్రఅని అంటున్నారు. సుధీర్ అరెస్ట్ అయితే మరిన్ని సంచలనలు బయటకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.