
న్యూఢిల్లీ, ఏప్రిల్ 23,
చాలా కాలం తర్వాత అక్కినేని నాగచైతన్య ‘తండేల్' చిత్రం తో భారీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి అక్కినేని అభిమానుల్లో ఫుల్ జోష్ ని నింపిన సంగతి తెలిసిందే. అంతకు ముందు నాగ చైతన్య నటించిన సినిమాలు మాత్రమే కాదు, అక్కినేని కుటుంబ హీరోల సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద డబుల్ డిజాస్టర్స్ గా నిలిచాయి. అభిమానులు అక్కినేని హీరోల బాక్స్ ఆఫీస్ స్టామినా పై ఆశలు వదిలేసుకుంటున్న సమయంలో నాగ చైతన్య ‘తండేల్’ ద్వారా వాళ్లకు సరికొత్త ఆశలు చిగురించేలా చేసాడు. ఈ సినిమా అక్కినేని కుటుంబానికి మొట్టమొదటి వంద కోట్ల సినిమా అని చెప్పొచ్చు. ఈ చిత్రానికి ముందే నాగ చైతన్య ‘దూత’ అనే వెబ్ సిరీస్ ద్వారా కం బ్యాక్ ఇచ్చాడు. విక్రమ్ కే కుమార్ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అయ్యి సెన్సేషనల్ హిట్ గా నిల్చింది.అమెజాన్ ప్రైమ్ సంస్థలో అత్యధిక వ్యూస్ ని సొంతం చేసుకున్న సిరీస్ గా ఇది సరికొత్త రికార్డు ని నెలకొల్పింది. ఈ సిరీస్ కి సీక్వెల్ కూడా త్వరలోనే రాబోతుంది. ఈ సీక్వెల్ ఎప్పుడు వస్తుంది అనే దానిపై క్లారిటీ రాలేదు కానీ, నాగ చైతన్య చేసిన మరో వెబ్ సిరీస్ గురించి క్లారిటీ వచ్చేసింది. ప్రస్థానం, వెన్నెల, రిపబ్లిక్ లాంటి అద్భుతమైన చిత్రాలను టాలీవుడ్ కి అందించిన దేవాకట్టా, నాగ చైతన్య తో మయసభఅనే పొలిటికల్ వెబ్ సిరీస్ ని రూపొందించాడు. సుమారుగా 400 నిమిషాలు, అంటే 6 గంటలకు పైగా ఉండే ఈ వెబ్ సిరీస్ ని సోనీ లివ్ సంస్థ స్ట్రీమింగ్ చేయబోతుంది. ఈ వెబ్ సిరీస్ గురించి దేవాకట్టా మాట్లాడుతూ ఈ ఏడాది చివర్లో ఈ వెబ్ సిరీస్ ని సోనీ లివ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని చెప్పుకొచ్చాడు.దేవాకట్టా పొలిటికల్ థ్రిల్లర్స్ ని తీయడం లో సిద్ధహస్తుడు. ఒక్కమాటలో చెప్పాలంటే ఆయనంత గ్రిప్పింగ్ గా సౌత్ లో పొలిటికల్ మూవీస్ ఎవ్వరూ చెయ్యలేరు అని చెప్పడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. ముఖ్యంగా ఆయన రాసే డైలాగ్స్ చిరకాలం మన మనస్సులో గుర్తుండిపోయేలా ఉంటాయి. అలాంటి డైరెక్టర్ తో ఇలాంటి వెబ్ సిరీస్ చేయడాన్ని చూస్తుంటే మరోసారి నాగచైతన్య కుంభస్థలం బద్దలు కొట్టేలా ఉన్నాడని అంటున్నారు విశ్లేషకులు. త్వరలోనే ఈ వెబ్ సిరీస్ కి సంబంధించి మరికొన్ని వివరాలు తెలియనున్నాయి. ఇకపోతే నాగ చైతన్య ప్రస్తుతం ‘విరూపాక్ష’ డైరెక్టర్ కార్తీక్ తెరకెక్కిస్తున్న మిస్టిక్ థ్రిల్లర్ లో నటిస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ సినిమా ఆడియన్స్ ని షాక్ కి గురి చేసేలా ఉంటుందని అంటున్నారు. ఈ ఏడాదిలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.