టాటూలకు ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. యువతలో చాలమంది తమ శరీరంపై నచ్చిన చోట టాటూలు వేయించుకోవడమనేది ఇప్పుడు ట్రెండ్‌గా నడుస్తోంది. ఇలా శరీరంపై టాటూలు వేయించుకున్నందుకు ఓ వ్యక్తి ఏకంగా తన ఉద్యోగానికే పొగట్టుకోవాల్సి పరిస్థితి వచ్చింది. టాటూలు వేయించుకున్న వారికి భారత ఎయిర్‌ఫోర్స్ (ఐఏఎఫ్)లో జాబ్‌కు గ్యారెంటీ ఉండదని చెప్పడానికి ఇదే ఉదాహరణ. ఎందుకంటే ఎయిర్‌ఫోర్స్ నియమనిబంధనల ప్రకారం.. తమ సంస్థలో పనిచేసే ఉద్యోగులకు శరీరంపై టాటూలు ఉండకూడదు. ఆ విషయం తెలియక ఉద్యోగంలో చేరిన మరునాడే అతడి మోచేతిపై టాటూ ఉండటాన్ని నియమనిబంధనలకు విరుద్ధంగా భావించి ఎయిర్ ఫోర్స్ అధికారులు అతన్ని ఉద్యోగం నుంచి తొలగించారు. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సదరు బాధితుడు ఢిల్లీ హైకోర్టులో పిటిషిన్ దాఖలు చేశాడు. బాధితుడి పిటిషిన్‌పై విచారించిన ఢిల్లీ హైకోర్టు బెంచ్ కూడా ఎయిర్‌ఫోర్స్ నిర్ణయంతో ఏకీభవిస్తూ అతడి పిటిషిన్‌ను కొట్టివేసింది.
2016 సెప్టెంబర్ 29న ఎయిర్‌ఫోర్స్‌లో సదరు వ్యక్తి ఉద్యోగం కోసం దరఖాస్తు చేశాడు. అనంతరం శరీర ధారుడ్య పరీక్షలు, రాతపరీక్షలను 2017 ఫిబ్రవరిలో పూర్తి చేసుకున్నాడు. ఆ తరువాత వైద్య పరీక్షల్లో కూడా ఉత్తీర్ణుడయ్యాడు. అన్ని పరీక్షల్లో పాసైనందుకు గత ఏడాది నవంబర్‌లో అతడికి డిసెంబర్ 24, 2017న ఎయిర్‌ఫోర్స్ వచ్చి ఉద్యోగంలో చేరమంటూ అపాయింట్‌మెంట్ లేటర్ వచ్చింది. కోరుకున్న ఉద్యోగం రావడంతో ఉత్సాహంగా వెళ్లిన అతడికి ఊహించని రీతిలో షాక్ తగిలింది. మరుసటి రోజు అతని అపాయింట్‌మెంట్‌ను రద్దు చేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. వాయుసేనకు ఇలా శరీరంపై టాటూలు వేయించుకున్నవారిని తమ నిబంధనలకు విరుద్ధంగా ఎంపిక చేసేందుకు అనుమతించబోమని స్పష్టం చేశారు. కానీ, గిరిజన సంస్కృతీ సాంప్రదాయాల దృష్ట్యా ఆయా వర్గాలవారికి మాత్రం టాటూ నిబంధనల నుంచి మినహాయింపు ఉన్నట్టు ఎయిర్‌ఫోర్స్ వెల్లడించింది.