
విజయవాడ, ఏప్రిల్ 24,
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలోపేతంపై అధినేత జగన్మోహన్ రెడ్డి దృష్టి పెట్టారు. పార్టీ ఓటమిపాలై ఏడాది కావస్తున్న తరుణంలో పార్టీ ప్రక్షాళనకు దిగారు. ముందుగా పార్టీలో సమూల మార్పులు తీసుకురావాలని భావించారు. అందుకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకున్నారు. గత ఎన్నికల్లో అంతులేని ధీమాతో బరిలో దిగిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఏపీ ప్రజలు చావు దెబ్బ కొట్టారు. కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు. వై నాట్ 175 అన్న నినాదంతో బరిలోకి దిగిన ఆ పార్టీకి ప్రజల నుంచి వ్యతిరేకత ఎదురయింది. అయితే ఇప్పుడిప్పుడే తప్పిదాలను గమనించిన జగన్మోహన్ రెడ్డి దిద్దుబాటు చర్యలకు దిగుతున్నారు. పోయిన చోట వెతుక్కునే పనిలో పడ్డారు.రాష్ట్రవ్యాప్తంగా 30 మంది సీనియర్ నేతలతో కూడిన పొలిటికల్ అడ్వైజరీ కమిటీనిప్రకటించారు. సభ్యత్వ నమోదు చేపట్టనున్నారు. ఇంకోవైపు కార్యకర్తలకు బీమా సౌకర్యం కల్పించే ఆలోచన చేస్తున్నారు. కార్యకర్తల పేరుతో సొంత నిధులతో ఈ బీమా సౌకర్యం కల్పించే అవకాశం ఉంది. ఇటీవల జరిగిన పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో దీనిపైనే ప్రధానంగా చర్చ నడిచింది. వీలైనంతవరకు నియోజకవర్గ ఇన్చార్జిలను మార్చుతూ జిల్లాల పర్యటనకు దిగాలని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు. అయితే గత ఐదేళ్లలో వైఫల్యాలను గుర్తుచేసుకొని మరి ప్రజల్లోకి వెళ్లాలని ఒక అంచనాకు వచ్చారు.అయితే 2024 ఎన్నికల్లో సోషల్ ఇంజనీరింగ్ కు నమ్ముకున్న జగన్మోహన్ రెడ్డికి ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయి. ముఖ్యంగా ఐపాక్ టీం ఇచ్చిన నివేదికలను ఆధారంగా చేసుకుని పార్టీలో చేర్పులు మార్పులు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 80 నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చి చేతులు కాల్చుకున్నారు. అందుకే వారిని తిరిగి యధా స్థానాల్లో నియమించాలని చూస్తున్నారు. ఇప్పటికే చాలామందిని మార్చారు కూడా. అయితే ఉమ్మడి 13 జిల్లాల్లో.. ఎక్కడెక్కడ మార్పులు చేయాలి? ఎవరిని నియమించాలి? ఏ సామాజిక వర్గాన్ని పరిగణలోకి తీసుకోవాలి అన్నదానిపై వ్యూహకర్తలతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.2019 ఎన్నికలకు ముందు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్తగా సేవలు అందించారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన జగన్మోహన్ రెడ్డికి దూరమయ్యారు. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా పనిచేశారు. సలహాలతో పాటు సూచనలు అందించారు. అయితే ప్రశాంత్ కిషోర్ మరోసారి జగన్మోహన్ రెడ్డికి పనిచేసే పరిస్థితి లేదు. అలాగని జగన్మోహన్ రెడ్డి సైతం ప్రశాంత్ కిషోర్ ను పిలిచే పరిస్థితి కూడా కనిపించడం లేదు. ఈ తరుణంలో రుషిరాజ్ సింగ్ మరోసారి జగన్మోహన్ రెడ్డి కోసం రంగంలోకి దిగారు. గత కొద్ది రోజులుగా బెంగళూరులోని యలహంక ప్యాలెస్ లో రుషిరాజ్ సింగ్ తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న చాలామంది వ్యూహకర్తలతో జగన్మోహన్ రెడ్డి సమావేశం అయ్యారని.. వారి సలహాలు సైతం తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది. త్వరలో జగన్మోహన్ రెడ్డి జిల్లాల పర్యటనకు వెళుతున్న తరుణంలో ఈ సమావేశాలకు ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది.