YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

టార్గెట్ 2019

 టార్గెట్ 2019
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ 2019 ఎలక్షన్ ఎక్సర్ సైజ్ ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. బీజేపీయేతర పక్షాలన్నింటినీ ఏకతాటిపైకి తెచ్చేందుకు ఆయన ప్రయత్నాలు ముమ్మరం చేశారని సమాచారం. ఇదిలాఉంటే రాహుల్ ఢిల్లీలో ఇచ్చిన ఇఫ్తార్ విందుకు 17 పార్టీల నేతలను, మాజీ రాష్ట్రపతులను ఆహ్వానించారు. వివిధ పార్టీల అధినేతలు స్వయంగా హాజరుకాకపోయినా.. తమ ప్రతినిధులను పంపారు. ఈ విందుకు కొద్దిసేపటి ముందుగా.. ముంబైలో మహాకూటమిపై ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజలు బీజేపీయేతర పక్షాన్ని కోరుకుంటున్నారని అన్నారు. దీంతో.. వచ్చే ఎన్నికలకు వివిధ పార్టీలను ఏకతాటిపైకి తెచ్చే కార్యక్రమాన్ని ఆయన ఉధృతం చేసినట్లేనని పరిశీలకులు అంటున్నారు. 2014 వరకూ విపక్షాల్లో అనైక్యత బీజేపీకి కలిసివచ్చింది. అయితే.. ఇది గతం అంటున్నాయి పలు పార్టీలు. ప్రస్తుతం ప్రతిపక్షాలన్నీ ఏకమయ్యేందుకు కొంత సముఖంగానే ఉన్నాయి. పరిస్థితులు, కాలిక్యులేషన్స్ అనుకూలంగా ఉంటే.. ఈజీగానే ఏకతాటిపైకి వస్తాయి. ఇప్పటికే విపక్షాలు కలిసికట్టుగా కాషాయదళానికి ఓటమి ఎలా ఉంటుందో రుచి చూపించాయి. దీంతో మరికొన్ని నెలల్లో జరిగే నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ పోరుపైనే కాక వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికలపైనా సర్వత్రా ఆసక్తి నెలకొంది. 
మహాకూటమిలో కాంగ్రెస్ కీలకంగా వ్యవహరిస్తే.. ఆ పార్టీకీ కొంత ఇబ్బందికర పరిస్థితి తలెత్తవచ్చని పరిశీలకులు అంటున్నారు. ఎందుకంటే వివిధ రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకోవాల్సి రావడంతో కాంగ్రెస్‌ చాలా స్థానాలను మిత్రులకు కేటాయించాల్సి వస్తుంది. ఆయా పార్టీలకు మద్దతుపలికే వర్గాల ఓట్లు మిత్రపక్షాల అభ్యర్థులకు పూర్తిగా బదిలీ అవుతాయని చెప్పలేం. పైగా, ఆయా పార్టీల్లోని భంగపడ్డ ఆశావహులను బీజేపీ ఆకర్షించవచ్చు. ఏదేమైనా విపక్షాల ఐక్యతను ఎదుర్కోవడం కాషాయ వర్గం ముందున్న అతిపెద్ద సవాలే. మరోవైపు 2019 సార్వత్రిక ఎన్నికలు మోడీ వర్సెస్ ప్రాంతీయ పార్టీలుగా ఉండొచ్చని విశ్లేషకులు అంటున్నారు. ఇక వచ్చే ఎన్నికల్లో 11 రాష్ట్రాల్లోని 13ప్రాంతీయ పార్టీలు మోడీ వ్యతిరేకంగా ఒక్కతాటిపైకి రావచ్చని చెప్తున్నారు. అదే జరిగితే 13 రాష్ట్రాల్లోని 349 లోక్ సభ సీట్లపై ప్రభావం ఉంటుంది. బీజేపీ విజయపరంపరకు చెక్ పెట్టాలని విపక్షాలన్నీ పట్టుమీద ఉన్నాయి. అందుకే విబేధాలు వీడి ఏకతాటిపైకి వస్తున్నాయి. అయితే వాటి మధ్య పొత్తు ఎంతకాలం ఉంటుందన్నది అనుమానమే అని బీజేపీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నారు. ఎన్ని పార్టీలు కలిసినా వచ్చే ఎన్నికల్లో తమదే విజయమని ధీమా వ్యక్తంచేస్తున్నాయి.

Related Posts