వానలు ఆశాజనకంగా ఉండడంతో విజయనగరం రైతాంగం ఉత్సాహంగా సాగుకు సన్నద్ధమైంది. పొలాలు దున్ని విత్తనాలు చల్లుతోంది. ఇంతవరకూ బాగానే ఉన్నా వరి పండించే రైతుల్లో పలువురు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. 1001, 1010 రకం విత్తనాల సరఫరా నిలిచిపోవడమే వారి అసంతృప్తికి కారణం. ఈ రకం విత్తనాల సరఫరా నిలిపివేయాలంటూ విత్తన కేంద్రాలకు అధికారులు ఆదేశాలు జారీ చేశారని వార్తలొస్తున్నాయి. అందుకే రైతులకు 1001, 1010 సీడ్స్ ఇవ్వడంలేదని అంతా అంటున్నారు. వాస్తవానికి జిల్లాలో వర్షపాతంపై ఆధారపడే సాగు అధికంగా ఉంది. నీటి ప్రాజెక్టులు పెద్దగా లేకపోవడంతో రైతులు వర్షాలపైనే ఆధారపడి సాగు చేస్తున్నారు. దీంతో ప్రతికూల పరిస్థితులను తట్టుకోగల 1001, 1010 రకం వరినే అధికంగా పండిస్తున్నారు. ప్రతికూల వాతావరణాన్ని జయించి నష్టాల నుంచి కొంతలో కొంతైనా బయటపడాలంటే 1001రకమే మేలని రైతులు అంటున్నారు. నీటి ఎద్దడిలోనూ, ముంపు సమస్య తలెత్తినప్పుడూ మిగిలిన రకాలతో పోల్చితే కాస్త తట్టుకోగల సామర్థ్యం 1001రకానికి ఉందని చెప్తున్నారు.
1001 రకం మొక్కలకు మొదలు ధృఢంగా ఉంటుంది. దీంతో బలమైన గాలులు వీచినప్పుడు మొక్కలు వెంటనే వంగిపోకుండా కొంత నిలబడగలవు. మిగిలిన రకాలతో పోల్చుకుంటే తెగుళ్ల దాటినుంచి కూడా ఎక్కువగా తట్టుకుంటుంది. ఇలా అనేక రకాల ప్రయోజనాలున్న విత్తనాల సరఫరాను నిలిపివేస్తూ వ్యవసాయ శాఖ అధికారులకు మౌఖిక ఆదేశాలు అందాయని రైతులు వాపోతున్నారు. మిల్లర్ల ప్రయోజనాల కోసమే ఇలాంటి నిర్ణయం తీసుకుని ఉంటారని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. వాస్తవానికి ఈ రెండు రకాలు దొడ్డు బియ్యాన్ని అందిస్తాయి. వీటికి సాధారణంగానే మార్కెట్‌లో డిమాండ్ తక్కువ. వ్యాపారానికి సంబంధించిన ఈ సమస్యను మిల్లర్లు ఇటీవల ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారని సమాచారం. ఈ నేపథ్యంలోనే 1001, 1010 రకాల సరఫరా నిలిచిపోయిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏదేమైనా ప్రభుత్వం, సంబంధిత అధికార యంత్రాంగం స్పందించి రైతాంగానికి యథావిథిగా విత్తనాలు సరఫరా చేయాలని, అన్నదాతలు నష్టపోకుండా చర్యలు తీసుకోవాలని అంతా కోరుతున్నారు.