YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

వానొచ్చే..పనులు నిలిచే..

వానొచ్చే..పనులు నిలిచే..
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పరిధిలోని 29 గ్రామాల్లో రైతులు భూ సమీకరణలో భూములు ఇచ్చిన ప్రాంతాల్లో చేపట్టిన నిర్మాణాలు, అభివృద్ధి పనులకు వర్షాల వల్ల అంతరాయం ఏర్పడుతోంది. ఇప్పటికే లక్ష్యం మేరకు పనులు జరగక మందగమనంగా ఉన్నాయని ఇటీవల సీఎం చంద్రబాబు నాయుడు అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో వర్షాలతో ఈ పనులు మరింత ఆలస్యమవుతున్న దుస్థితి. రాజధాని గ్రామాల్లో పంట పొలాల్లో రూ.24 వేల కోట్లతో చేపట్టిన రహదారులు, భవనాలు, రైతులకు కేటాయించిన ప్లాట్‌ల అభివృద్ధి పనులు ఆశించినంత వేగంగా సాగడంలేదని స్థానికులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుతం సీడ్‌ యాక్సిస్‌ రోడ్డు పనులు తుది దశకు వచ్చినా తాడేపల్లి మండలంలో రైతులు భూములు ఇవ్వకపోవడంతో ఈ రహదారి ఎప్పటికి పూర్తవుతుందనేది తెలీడంలేదు. మరోవైపు భూ సేకరణ ద్వారా భూములు తీసుకుని రహదారి నిర్మాణం చైపట్టడాన్ని పలువురు రైతులు వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలాఉంటే మందడం వద్ద బలహీన వర్గాలకు గృహనిర్మాణం భవంతులు తుది దశకు చేరుకున్నాయి. ఇవి ప్రయోగా త్మకంగా ఎంపిక చేసిన కొందరికి మాత్రమే కేటాయించారని సమాచారం. మందడం గ్రామంలో తొలిదశలో పేదలకు ఐదువేల ఇళ్ల నిర్మాణం కోసం బహుళ అంతస్తుల సముదాయం నిర్మిస్తున్నారు. 
రాయపూడి వద్ద ఐఎఎస్‌ అధికారులకు నిర్మిస్తున్న గృహ సముదా యాలు, నేలపాడు వద్ద ఎన్‌జిఒలకు గృహ నిర్మాణమూ నెమ్మదిగా సాగుతోంది. భూ సమీకరణ కింద భూములు ఇచ్చిన రైతులకు కేటాయించిన ప్లాట్ల వద్ద మౌలిక సదుపాయాల కల్పన పనులు కూడా వేగవంతంకాలేదు. నేలపాడు, శాఖమూరు గ్రామాల వద్ద ఈ పనులు త్వరలో పూర్తి అవుతాయని అధికారులు చెబుతున్నారు. అయితే ఇప్పట్లో ఆ పనులు పూర్తయ్యే పరిస్థితి కనిపించడంలేదు. రాజధాని పరిధిలో తూర్పు-పడమర ప్రాంతాలను కలుపుతూ 16 రోడ్లు, ఉత్తర-దక్షిణ ప్రాంతాలను కలుపుతూ 16 రోడ్లు మొత్తం 32 రోడ్లు వేస్తున్నారు. ప్రధాన రహదారులు 320 కిలో మీటర్ల వరకూ నిర్మాణ పనులు చేపట్టారు. రైతులకు ప్లాట్లు కేటాయించిన ప్రాంతాల్లో 1250 కిలో మీటర్ల రహదారుల నిర్మాణం ప్రారంభం అయింది. నేలపాడులో ఎన్జీవోలకు 2 వేల ఇళ్ల సముదాయం పనులు కొంత మేరకు చురుగ్గా జరుగుతోంది. మరో వైపు రాజధాని గ్రామాల్లో మురుగునీరు, వర్షం నీరు పారుదలకు కాల్వల నిర్మాణం చేపట్టారు. రాజధానిలో పెద్ద ఎత్తున పార్కులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు. దీనిలో భాగంగా శాఖమూరు వద్ద పిల్లల కోసం పార్కును నిర్మిస్తున్నారు. వర్షాకాలం ప్రారంభం కావడంతో పనులు నెమ్మదించే అవకాశాలే ఉన్నాయి. ఏదేమైనా నిర్దేశించుకున్న లక్ష్యం మేరకు పనులు సాగించేలా పనులు కొనసాగించాలని ప్రభుత్వం, అధికారయంత్రాంగం భావిస్తోంది.

Related Posts