
గుంటూరు, ఏప్రిల్ 29,
టీడీపీలో సీనియర్ నేతలకు చోటు దక్కే అవకాశం లేదు. ఇకపై అందరూ యువకులే ముందుండి పాలిటిక్స్ ను నడపాలని సైకిల్ పార్టీ అధినాయకత్వం భావిస్తుంది. అందుకే చాలా మంది సీనియర్లు టీడీపీలో పదవులు రాక కేవలం పార్టీ పదవులకే పరిమితమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాంటిది పార్టీలు మారి వచ్చిన వాళ్లని అసలు ఎందుకు నమ్ముతారు? ఎందుకు చేరదీస్తారు? వాళ్లేమీ స్వతహాగా ఓటు బ్యాంకు ఉన్న నేతలు కాదు. అలాగే స్వయంప్రకాశిత నేతలు కూడా కాడు. అలాంటి వారిని ఎందుకు కేర్ చేస్తారు. అలాంటిది వయసుడిగిపోయి, పార్టీలు మారి.. మారి వచ్చిన వాళ్లను టీడీపీ నాయకత్వం ఎందుకు దగ్గరకు తీసుకుంటుంది.సీనియర్ నేతకు కష్టాలే... ఆంధ్రప్రదేశ్ లో సీనియర్ నేత డొక్కా మాణిక్యవరప్రసాద్ రాజకీయ పరిస్థితి కూడా ఇలాగే తయారైంది. ఉన్న సీనియర్ నేతలకే చోటు చిక్కడం లేదు. పట్టు లేదు. ఇప్పుడు పార్టీలు మారి వచ్చిన డొక్కా మాణిక్యవరప్రసాద్ ను అసలు టీడీపీ అధినాయకత్వం ఎందుకు కేర్ చేస్తుంది? అవును.. అసలు ఆయన ఏ నియోజకవర్గంలోనూ ప్రభావం చేయగల నేత కాదు అని అందరికీ తెలుసు. ఏదో గాలి వాటున, సామాజికవర్గం కోణంలో పదవులు పొందారే తప్ప ఆయనకు పట్టున్న ప్రాంతం కూడా ఏదీ లేదు. ఆ విషయం తెలిసిన టీడీపీ నాయకత్వం ఇప్పుడు మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ ను దూరం పెట్టినట్లు తెలిసింది. ఆయన ఎంత గింజుకున్నా పదవి దక్కే అవకాశం లేదంటుననారు. గుంటూరు జిల్లాలో ఒకప్పుడు రాయపాటి సాంబశివరావు హవా నడిచేది. రాయపాటి సాంబశివరావు శిష్యుడిగా డొక్కా మాణిక్యవరప్రసాద్ రాజకీయంగా ఎదిగారు. కాంగ్రెస్ హయాంలో మంత్రి పదవిని కూడా దక్కించుకున్నారు. 20024, 2009 లో వరసగా తాడికొండ నియోజకవర్గం నుంచి వరసగా గెలిచారు. అది కూడా నాటి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హవాలోనే డొక్కా మాణిక్యవరప్రసాద్ గెలిచారన్నది అక్షర సత్యం. అదే సమయంలో 2009లో మంత్రి పదవి కూడా దక్కించుకున్నారు. రాష్ట్ర విభజన ఆయన కొంపముంచిందనే చెప్పాలి. పోటీ చేయడానికి నియోజకవర్గమే దొరకలేదు. కాంగ్రెస్ లో కొంత కాలం ఉండి తర్వాత టీడీపీలో చేరారు. 2019లో టీడీపీ పత్తిపాడు టిక్కెట్ దక్కించుకున్నా నాటి జగన్ హవాలో ఓటమిని మూటగట్టుకున్నారు. వైసీపీ అధికారంలోకి రావడంతో టీడీపీని వీడి వైసీపీలో చేరారు. ఆయనకు ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టారు. ఎప్పుడైనా జరగొచ్చట ఎటు అధికారం ఉంటే అటు... అంతటితో ఊరుకున్నారా? అంటే లేదు. 2024లో మళ్లీ అధికారం టీడీపీకి రావడంతో వైసీపీలో ఎమ్మెల్సీగా ఉన్న డొక్కా మాణిక్యవరప్రసాద్ ఆ పార్టీకి రాజీనామా చేసి టీడీపీలో చేరిపోయారు. దీంతో ఆయన పొలిటికల్ గ్రాఫ్ చిన్న పిల్లాడికి కూడా అర్థమయింది. ఎటు అధికారం ఉంటే అటు అడుగులు వేసే డొక్కా మాణిక్యవరప్రసాద్ ను ఇప్పుడు ఎటు కాకుండా పోయారు. టీడీపీలో చేరినా ఆయనకు ప్రయారిటీ లేదు. పైగా ఉన్న సీనియర్ నేతలను పక్కన పెడుతున్న టీడీపీ నాయకత్వం ఇంతోటి నేతకు ఎందుకు ప్రయారిటీ ఇస్తుంది? అందుకే డొక్కా మాణిక్య వరప్రసాద్ రెండు ఎన్నికల్లో విజయంతోనే సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక ఆయన రాజకీయంగా రాయపాటి తో పిచ్చాపాటి మాట్లాడుకోవడం మినహా ప్రస్తుతమున్న పరిస్థితుల్లో చేయగలిగిందేమీ లేదు. భవిష్యత్ కూడా కనుచూపు మేరల్లో కనిపించడం లేదు.