
విజయవాడ, ఏప్రిల్ 29,
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం కానీ అసలు విషయం బోధపడలేదు. అంతకు ముందు పాలనతో పాటు సంక్షేమ పథకాలపైనే మాత్రం కాకుండా శాంతి భద్రతలు వంటి అంశాలపై కూడా ఊగిపోతూ ప్రసంగాలు చేసిన జనసేనానికి అధికారంలో ఉంటే తప్ప అర్థం కావడం లేదు. పరిమితులు, చట్టప్రకారం తీసుకోవాల్సిన చర్యలతో పాటు తాను సులువుగా చేయాలని భావించిన సమస్యలను పరిష్కరించడం అంత తేలిక కాదని గుర్తించారు. అందుకే ఆయన ఈ మధ్య కాలంలో అంటే దాదాపు పదినెలల నుంచి మౌనంగానే ఎక్కువగా ఉంటున్నారు. ఈ పరిస్థితి పవన్ కల్యాణ్ పై పెట్టుకున్న ఆశలు, ఎన్నికలకు ముందు ఉన్న ఇమేజ్ చాలా వరకూ తగ్గినట్లయింది సంక్షేమ పథకాలను అమలు చేయాలంటే ఖజానాలో డబ్బులు కావు. డబ్బులు ఊరికే రావని అర్థమయింది. అలాగే అప్పులు కూడా అంత తేలిగ్గా పుట్టవని కూడా తెలిసింది. అధికారంలోకి వస్తే అది చేస్తాం, ఇది చేస్తామని చెప్పినా తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయడం అంత సులువు కాదని అర్థం కావడం వల్లనే పవన్ కల్యాణ్ ఎక్కువగా మౌనాన్ని ఆశ్రయించారంటున్నారు. పవన్ కల్యాణ్ జనసేన పార్టీని పెట్టి పదేళ్లు దాటి పోయినా ఆయనకు మొన్నటి వరకూ ఒక క్లీన్ ఇమేజ్ ఉండేది. పవన్ కల్యాణ్ అధికారంలోకి వస్తే ఏదో చేస్తారన్న నమ్మకం ఇటు కాపు సామాజికవర్గంలోనూ, అటు పార్టీ క్యాడర్ లోనూ బలంగా ఉండేది. ఇచ్చిన మాట ఖచ్చితంగా అమలు చేస్తారని, పవన్ మాట తప్పరని భావించేవారు కానీ ఆంధ్రప్రదేశ్ లో ఉప ముఖ్యమంత్రిగా పవన్ కల్యాణ్ బాధ్యతలను చేపట్టిన తర్వాత కూడా ఇచ్చిన హామీలను అమలు చేయలేకపోతున్నారన్న బాధ ఎక్కువగా ఉంది. అదే సమయంలో టీడీపీ నుంచి పదవులను రాబట్టుకోవడంలోనూ కొంత వెనకబడి ఉన్నారని జనసేన నేతలు అంటున్నారు. కూటమి ప్రభుత్వంలో టీడీపీదే పై చేయి అయినప్పటికీ పట్టుబట్టి సాధించుకునే తత్వాన్ని పవన్ కల్యాణ్ కోల్పోయినట్లు కనిపిస్తుందని సొంత పార్టీ నేతలే అంటున్నారు. అందుకే పది నెలలు దాటుతున్నా ఇప్పటి వరకూ ముఖ్య నేతలకు నామినేటెడ్ పదవులు కానీ, మరో కీలకమైన పదవులు కానీ లభించడం లేదని వాపోతున్నారు. ఇలాగే కొనసాగితే తాము నమ్ముకుని పార్టీలో ఉన్నందుకు పవన్ కల్యాణ్ ఇలా రాజీపడి తమను ఇబ్బంది పెడితే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. ఎప్పుడైనా జరగొచ్చట అధికారంలోకి వచ్చిన తర్వాతే... అయితే పవన్ కల్యాణ్ కు అధికారంలోకి వచ్చిన తర్వాత సీన్ మొత్తం అర్థమయిందని, ఆయన అంతా తెలుసుకున్న తర్వాత మాత్రమే అనుభం కలిగిన నేత చంద్రబాబు డైరెక్షన్ లోనే వెళ్లడం మంచిదని ఆయన భావిస్తున్నారని జనసేన ముఖ్యనేతలు కొందరు చెబుతున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రాష్ట్రాన్ని ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కించగలిగేది చంద్రబాబు మాత్రమేనని గట్టిగా నమ్మిన పవన్ కల్యాణ్ అందుకు అనుగుణంగా ట్యూన్ అయిపోయారని, మనం ఇబ్బంది పెట్టినా ప్రయోజనం లేదని గ్రహించిన తర్వాతనే మౌనంగా ఉంటున్నారని చెబుతున్నారు. అయితే బయట ఉన్న వారికి మాత్రం పవన్ కల్యాణ్ పూర్తిగా ప్రశ్నించే తత్వాన్ని కోల్పోయారని అంటున్నారు. మొత్తం మీద పవన్ కల్యాణ్ కు అధికారంలోకి వచ్చిన తర్వాత కానీ అసలు విషయం అర్థం కాలేదన్నది మాత్రం వాస్తవం.