
హైదరాబాద్, ఏప్రిల్ 29,
తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి.. ఓ వైపు ఎండలు ఠారెత్తిస్తుండగా.. మరోపు వర్షాలు కురుస్తున్నాయి.. ఈ క్రమంలో వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. వచ్చే నాలుగు రోజులు కూడా భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొంటాయని.. అక్కడకక్కడ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం.. మంగళవారం, బుధవారం తెలంగాణలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశాలున్నాయి.. రాగల రెండు రోజులలో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే స్వల్పంగా తక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ రోజు తెలంగాణలోని ఆదిలాబాద్, కొమరం భీమ్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. ఈ రోజు గరిష్టంగా ఆదిలాబాద్ లో 42.3, కనిష్టంగా హైదరాబాద్ లో 37.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. సోమవారం మెదక్, నల్లగొండ, ఆదిలాబాద్, నిజామాబాద్, భద్రాచలం, ఖమ్మం, లలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.తెలంగాణ లోని కొన్ని జిల్లాలలో అక్కడక్కడ గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.అమరావతి వాతావరణ కేంద్రం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో నాలుగు రోజులపాటు భిన్నమైన వాతావరణ పరిస్థితులు ఉంటాయి.. కొన్నిచోట్ల ఎండలు, మరికొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురిసేందుకు అవకాశం ఉంది.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు చేసింది.
ఏపీలో వర్షాలు..
మంగళవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది.బుధవారం శ్రీకాకుళంలో రెండు మూడు చోట్ల భారీ వర్షాలు, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, ఎన్టీఆర్, పల్నాడు, శ్రీసత్యసాయి, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది.అలాగే నేడు విజయనగరం జిల్లా బాడంగి, బొబ్బిలి, దత్తిరాజేరు, గుర్ల, కొత్తవలస మండలాలు, పార్వతీపురంమన్యం జిల్లా బలిజిపేట, గరుగుబిల్లి,సీతానగరం మండలాల్లో వడగాలులు(08) ప్రభావం చూపే అవకాశం ఉంది.
ఉష్ణోగ్రతలు 40-42°C మధ్య రికార్డు అయ్యే అవకాశం.
సోమవారం వైఎస్సార్ జిల్లా సిద్ధవటంలో 41.1°C, ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో 41°C, నంద్యాల జిల్లా రుద్రవరంలో 40.6°C, తిరుపతి జిల్లా సూళ్లూరుపేట 40.5°C, విజయనగరం కొత్తవలస, పల్నాడు జిల్లా నరసారావుపేటలో 40.3°C చొప్పున అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.