YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

రేవంత్ ను లైట్ తీసుకున్న కేసీఆర్

 రేవంత్ ను లైట్ తీసుకున్న కేసీఆర్

హైదరాబాద్, ఏప్రిల్ 29,
సంబరం అంబరాన్ని అంటింది.. ఉత్సాహం తారస్థాయికి చేరింది.. మొత్తంగా గులాబీ పార్టీ.25 ఏళ్ల వేడుక ఎల్కతుర్తి లో అంగరంగ వైభవంగా సాగింది.. ఒకరకంగా అనధికారిక దర్పంగా ఈ కార్యక్రమం సాగింది. ఇంతటి వేడుకలో పార్టీ నాయకులకు మాట్లాడే అవకాశం రాలేదు. కేవలం ఒకే ఒక్క వ్యక్తికి మాత్రమే ప్రసంగించే అవకాశం లభించింది.సిల్వర్ జూబ్లీ వేడుకలో కల్వకుంట్ల చంద్రశేఖర రావు పార్టీ అధ్యక్షుడి హోదాలో మాట్లాడారు. దాదాపు గంట వరకు కేసీఆర్ ప్రసంగం సాగింది. తెలంగాణ రాష్ట్రంలో గడచిన 10 సంవత్సరాల కాలంలో ఏం చేశామో ఆయన చెప్పుకొచ్చారు… కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం వల్ల తెలంగాణ రాష్ట్రం వెనుకబడిపోయిందని ఆరోపించారు… తాము స్కీములు పెట్టి ప్రజలను బాగు చేస్తే.. కాంగ్రెస్ నాయకులు స్కామ్ లతో రాష్ట్రాన్ని లూటీ చేస్తున్నారని మండిపడ్డారు. గంటసేపు సాగిన మాజీ ముఖ్యమంత్రి ప్రసంగంలో కొత్తదనం కనిపించలేదు. పైగా ఆయన విమర్శలకు.. ఆరోపణలకు.. 10 సంవత్సరాల తన పరిపాలన వరకే పరిమితమయ్యారు. అంతేకాదు తెలంగాణకు మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ శత్రువు అని వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు కాకుండా నాడు, నేడు కాంగ్రెస్ పార్టీ అడ్డుకున్నదని వివరించారు. మొత్తంగా కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఇన్ని రోజుల పాటు మౌనంగా ఉండి.. ఇప్పుడు బయటికి రావడం.. సభను భారీగా నిర్వహించడంతో.. కీలక వ్యాఖ్యలు చేస్తారని అందరూ అనుకున్నారు. కానీ దానికి తగ్గట్టుగా ఆయన మాట్లాడకపోవడం ఒకరకంగా భారత రాష్ట్ర సమితి శ్రేణులను నిరాశకు గురి చేసిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. గంటసేపు సాగిన కెసిఆర్ ప్రసంగంలో ఎక్కడా కూడా రేవంత్ పేరు వినిపించలేదు. కనీసం రేవంత్ పేరును ప్రస్తావించడానికి కూడా కేసీఆర్ ఇష్టపడలేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనపై విమర్శలు గుప్పించిన BRS అధినేత కేసీఆర్..ఎక్కడా సీఎం రేవంత్ రెడ్డి పేరును ప్రస్తావించలేదు. కాంగ్రెస్ పార్టీని నమ్మి ప్రజలు బోల్తా పడ్డారని..ప్రభుత్వంలో ఉన్న నాయకులు..నోరు తెరిస్తే అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు.బీఆర్ఎస్, కేసీఆర్ మీద నిందలు వేస్తున్న కాంగ్రెస్ పాలకులు మంచిగా ఉన్న తెలంగాణను ఆగమాగం చేశారని ఫైర్ అయ్యారు. కేసీఆర్ శాసనసభకు ఎందుకు రారని ప్రశ్నించేవారికి చెబుతున్నానంటూ.. అసెంబ్లీలో తమ పార్టీ నాయకులు ప్రశ్నిస్తేనే ఈ ప్రభుత్వానికి సమాధానం చెప్పే దిక్కులేదని…అలాంటప్పుడు వాళ్లకు నేనెందుకంటూ సీఎం రేవంత్ పేరును ప్రస్తావించకుండానే కౌంటర్ ఇచ్చారు.
ఇలా కాంగ్రెస్ ప్రభుత్వంపై పలు అంశాల్లో ఆగ్రహం వ్యక్తం చేసిన కేసీఆర్..ఎక్కడా సీఎం రేవంత్ రెడ్డి పేరును ఎత్తలేదు. కనీసం ముఖ్యమంత్రి అనిగాని, సీఎం అనిగాని ప్రస్థావించలేదు. ఒకటి రెండు సందర్భాల్లో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పేరును ప్రస్తావించకుండానే ఆర్థిక మంత్రి అని మాట్లాడారు. కేసీఆర్ సుధీర్ఘ ప్రసంగంలో ఒక్కసారి కూడా సీఎం రేవంత్ రెడ్డి పేరును పలకకపోవడంపై తెలంగాణ రాజకీయవర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్షంలో భారత రాష్ట్ర సమితి.. అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నాయి. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావాల్సిన బాధ్యత భారత రాష్ట్ర సమితిపై ఉంది. ప్రజలకు మెరుగైన పాలన అందించే బాధ్యత కాంగ్రెస్ పార్టీపై ఉంది. ఈ సమయంలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం పరిపాటి. ఎందుకంటే ప్రజాస్వామ్యం వర్ధిల్లుతున్న మనదేశంలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతుంటాయి. పరస్పరం విమర్శలు కొనసాగుతుంటాయి. అయితే విచిత్రంగా భారత రాష్ట్ర సమితి 25 సంవత్సరాల వేడుకలో కల్వకుంట్ల చంద్రశేఖర రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు పలకకపోవడం వెనక పెద్ద కారణమే ఉందని భారత రాష్ట్ర సమితి నాయకులు అంటున్నారు. ఇక ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా గట్టిగా కౌంటర్ ఇస్తున్నాయి. తన పేరు కూడా పలకడానికి భయపడే పరిస్థితిని కల్వకుంట్ల చంద్రశేఖర రావు కు రేవంత్ రెడ్డి కల్పించారని వ్యాఖ్యానిస్తున్నాయి. ఇంతవరకు అసెంబ్లీకి ఒకటి లేదా రెండుసార్లు మాత్రమే వచ్చారని.. అప్పుడు యుద్ధం చేస్తానని పెద్దపెద్ద ప్రకటనలు చేశారని.. యుద్ధం కాదు కదా కనీసం బయటికి కూడా రాలేని పరిస్థితిని మాజీ ముఖ్యమంత్రి కి రేవంత్ రెడ్డి కల్పించారని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు.. 2023 ఎన్నికల్లో ఓటమి తర్వాత మాజీ ముఖ్యమంత్రి అసెంబ్లీకి రెండు సందర్భాల్లో మాత్రమే వచ్చారు. శాసన సభ్యుల ప్రమాణ స్వీకార సమయంలో మాజీ ముఖ్యమంత్రి కాలు జారిపడి.. ఆస్పత్రి పాలయ్యారు. ఆ సమయంలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ను రేవంత్ రెడ్డి పరామర్శించారు. ఆ తర్వాత కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆరోగ్యం కుదురుకున్న తర్వాత శాసనసభ సభ్యుడిగా ప్రమాణస్వీకారం చేశారు. ఇక ఆ మధ్య బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఒకసారి అసెంబ్లీకి వచ్చారు. ఇప్పుడు తన వ్యవసాయ క్షేత్రానికి మాత్రమే కెసిఆర్ పరిమితమవుతున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం చేసినప్పటికీ.. భారత రాష్ట్ర సమితి ఒక్క సీటు కూడా గెలుచుకోలేదు. బహుశా ఆ పార్టీ చరిత్రలో ఇది అత్యంత దారుణమైన ఓటమి. ఇక దీని కవర్ చేయడానికి భారత రాష్ట్ర సమితి సోషల్ మీడియాను ప్రధాన అస్త్రంగా వాడుకుంటున్నది. అయితే సోషల్ మీడియా ప్రచారం వేరు.. వాస్తవ పరిస్థితి వేరని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. భారత రాష్ట్ర సమితి నాయకులు సోషల్ మీడియాలో బలంగా ఉన్నారని.. తమ ప్రజల్లో బలంగా ఉన్నామని.. ప్రజల్లో బలంగా ఉన్న వారే గెలుస్తారని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు..

Related Posts