
వియవాడ, ఏప్రిల్ 30,
ఏపీ ప్రభుత్వం అమలు చేస్తోన్న సామాజిక పెన్షన్లలో భారీగా అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. వేల సంఖ్యలో అనర్హులను గుర్తిస్తున్నారు. వికలాంగుల పెన్షన్లలో ఇప్పటి వరకు 65వేల మంది అనర్హులను గుర్తించారు. పెన్షన్ల తనిఖీ పూర్తయ్యేనాటికి ఈ సంఖ్య మరింత పెరుగనుంది. ఏపీలో సామాజిక పెన్షన్ల తనిఖీలో తవ్వే కొద్ది అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున అనర్హులకు పెన్షన్లు చెల్లిస్తున్నారని ప్రజా ప్రతినిధులు ఫిర్యాదు చేయడంతో ఏపీ ప్రభుత్వం వికలాంగుల పెన్షన్ల తనిఖీ చేపట్టింది. వికలాంగులకు రూ.6 వేల నుంచి రూ.15వేల వరకు పెన్షన్లు చెల్లిస్తుండటంతో పెద్ద ఎత్తున అనర్హులు వాటిని దక్కించుకుంటున్నారు.ఏపీప్రభుత్వం అందిస్తోన్న సామాజిక పెన్షన్లను తప్పుడు ధృవీకరణ పత్రాలతో పొందుతున్నవారి డొంక కదులుతోంది. గత మూడు నెలలుగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం సామాజిక పెన్షన్లను వైద్య బృందాలతో తనిఖీ చేయిస్తోంది. ఈ క్రమంలో బోగస్ సర్టిఫికెట్లతో పెన్షన్లు పొందుతున్న వారిని పెద్ద సంఖ్యలో గుర్తించారు.ఏపీలో నెలకు రూ.6 వేలు నుంచి రూ.15వేల వరకు సామాజిక పెన్షన్లను చెల్లిస్తున్నారు. ఈ క్రమంలో తొలిదశలో రూ.15వేల పెన్షన్లు పొందుతున్న వారిలో అనర్హులను గుర్తించి వాటిని తొలగించారు.రెండో దశలో మార్చి నుంచి రూ.6 వేల పెన్షన్ పొందుతున్న వారికి క్షేత్ర స్థాయి పరీక్షలు నిర్వహించిన అనర్హులను తొల గిస్తున్నారు. శారరీక వైకల్యంలో భాగంగా అయిదు విభాాగాల్లో ప్రతి నెల 8లక్షల మందికి రూ.6 వేల పెన్షన్ చెల్లిస్తున్నారు.ఈ ఏడాది ఫిబ్ర వరి నుంచి ఆరోగ్య శాఖ, సెర్ప్ అధికారుల బృందాలు వైకల్య నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నాయి. లబ్దిదారులను ఎంపిక చేసిన ఆసుపత్రులలో వైద్య పరీక్షలు చేయించుకోవాలని ప్రభుత్వం సూచించింది.మొత్తం పెన్షనర్లలో 4లక్షల మంది ఆర్థోపెడిక్ సమస్యలు ఉన్న వారున్నారు. మిగిలిన వారిలో ఈఎన్టీ, కంటి చూపు లోపం, మానసిక వైకల్యం ఇతర సమస్యలున్న వారున్నారు.ఇప్పటి వరకు 3 లక్షల మందికి వైద్య పరీక్షలు పూర్తి చేయగా వారిలో సుమారు 65 వేల మంది అనర్హులను గుర్తించారు. పది వేల మందికి వైకల్యం ఉన్నా.. పెన్షన్ పొందే స్థాయిలో శారీరక వైకల్యం లేదు.శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి, కృష్ణా జిల్లాలో అనర్హులుఅధికంగా ఉన్నట్లు గుర్తించారు. నెల్లూరు, అనంత పురం, కర్నూలు, తిరు పతి జిల్లాల్లో అనర్హులు పట్టుబడుతున్నారు.అంగవైకల్యం, మానసిక, ఈఎన్టీ సమస్యలున్న వారికి నవంబర్ వరకు పరీక్షలు నిర్వహిస్తారు. నెలకు రూ.15 వేల పెన్షన్ పొందే 24,091 మందిలో 7,256 మంది అనర్హులలను గతంలోనే గుర్తించారు. మిగిలిన 70% లో 31.29% మంది రూ.6వేల పెన్షన్‌కు మాత్రమే అర్హత ఉంది.తక్కువ వైకల్యం ఉన్న వారికి 40శాతానికి పైగా వైకల్యంగా నమోదు చేయడంతో వారికి రూ.6వేల పెన్షన్ లభిస్తోంది.