YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

అంతు చిక్కని కమల వ్యూహం

అంతు చిక్కని కమల వ్యూహం

ఏలూరు, ఏప్రిల్ 30,
ఇతర రాష్ట్రాలతో పోలిస్తే భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ లో కొత్త పంథాను ఎంచుకుంది. మిగిలిన రాష్ట్రాల్లో ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారు. అంతే కాదు వారికి పదవులను కేటాయించడంలోనూ ముందుంటున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ లోమాత్రం పూర్తి భిన్నంగా నిర్ణయాలు తీసుకుంటుంది. గత కొన్నేళ్ల నుంచి బీజేపీ ఆంధ్రప్రదేశ్ లో తీసుకున్న నిర్ణయాలను పరిశీలిస్తే పట్టు బిగించుకోవడానికి, పార్టీ బలోపేతానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని, అంతే కాకుండా పార్టీని నమ్ముకున్న వారికి అన్యాయం జరగదని బలమైన సంకేతాలను కూడా పార్టీ కేంద్ర నాయకత్వం క్యాడర్ లోకి పంపే ప్రయత్నం చేస్తుంది. సీనియర్ నేతలను కూడా పక్కన పెట్టి పార్టీ కోసం పనిచేసిన వారికి పదవులను కట్టబెడుతుండటం చర్చనీయాంశమైంది. పొరుగు రాష్ట్రమైన తెలంగాణను తీసుకుంటే అక్కడ ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి పదవులు ఇచ్చారు. డీకే అరుణ కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం పనిచేసి వచ్చినప్పటికీ ఆమెకు పార్టీ ఉపాధ్యక్షురాలిగా నియమించడమే కాకుండా తర్వాత పార్లమెంటు టిక్కెట్ కూడా ఇచ్చారు. అలాగే కొండా విశ్వేశ్వర్ రెడ్డికి కూడా ఎంపీ సీటును కేటాయించారు. అదే మాదిరిగా టీఆర్ఎస్ లో సుదీర్ఘకాలం ఉండి వచ్చిన ఈటల రాజేందర్ కు కూడా ప్రాధాన్యత ఇస్తూ పార్లమెంటుకు ఎన్నికయ్యేలా చర్యలు తీసుకుంది. కాకపోతే తెలంగాణలోనూ కేంద్ర మంత్రి పదవులు మాత్రం పార్టీని నమ్ముకున్న వారికే ఇచ్చింది. కిషన్ రెడ్డి, బండి సంజయ్ లు తొలి నుంచి బీజేపీలో కిందిస్థాయి నుంచి పనిచేసి వచ్చిన వారికి అవకాశం కల్పించింది. రాజ్యసభ స్థానం కూడా సుదీర్ఘకాలం పార్టీ కోసం పనిచేసిన లక్ష్మణ్ కు ఇచ్చింది. తమిళనాడులో కూడా అన్నాడీఎంకే నుంచి వచ్చిన నేతకు పార్టీ పగ్గాలు అప్పగించింది. అదే తరహాలో ఆంధ్రప్రదేశ్ లోనూ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన పురంద్రీశ్వరికి, కన్నా లక్ష్మీనారాయణకు పార్టీ అధ్యక్ష బాధ్యతలను అప్పగించారు. ఇక మంత్రి పదవుల విషయానికి వచ్చే సరికి పార్టీలో కొత్తగా చేరిన వారికి కాకుండా బీజేపీ సిద్ధాంతాలను నమ్మిన వారికి అందలం ఎక్కించారు. రాష్ట్ర మంత్రిగా సత్యకుమార్ యాదవ్ ను ఎంపిక చేశారు. అలాగే కేంద్ర మంత్రి పదవి కూడా నరసాపురం నుంచి తొలి సారి ఎన్నికైన భూపతి రాజు శ్రీనివాసవర్మను ఎంపిక చేశారు. ఈ నిర్ణయాలన్నీ పార్టీ క్యాడర్ లో ఉత్సాహం నింపగా కూటమి లోని మిత్ర పక్షాలే ఒకింత ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి. సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న... తాజాగా విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానంలో జరుగుతున్న ఉప ఎన్నికకు సంబంధించి కూడా ఎవరికీ తెలియని పేరున్న నేతను ఎంపిక చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజ్యసభ సభ్యుడిగా నేడు బీజేపీకి చెందిన పాక వెంకట సత్యనారాయణ నామినేషన్ దాఖలు చేశారు. భీమవరానికి చెందిన పాక వెంకట సత్యనారాయణను అనూహ్యంగా బీజేపీ ఎంపిక చేసింది. పాక వెంకట సత్యనారాయణ బీజేపీ క్రమశిక్షణ సంఘం కమిటీ ఛైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. ఆయనను ఎంపిక చేయడంతో బీజేపీలో సుదీర్ఘకాలంగా పనిచేసిన వారికి పదవులు ఇస్తున్నట్లయింది. పాక వెంకట సత్యానారాయణ ఎంపిక తో బీజేపీ స్ట్రాటజీఏందో అర్థమవుతుంది. బీజేపీ చాలా ముందు చూపుతో ఇలా వ్యవహరిస్తుందన్న కామెంట్స్ బలంగా వినిపిస్తున్నాయి.

Related Posts