
విజయవాడ, ఏప్రిల్ 30,
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏ పనిచేసినా చాలా పకడ్బందీగా చేస్తారు. ఆయన డ్రీమ్ ప్రాజెక్టును లాంచ్ చేయడానికి ఎప్పుడైనా గ్రాండ్ గానే ప్లాన్ చేస్తారు. దానివల్ల ప్రచారంతో పాటు హైప్ క్రియేట్ అవుతుందని, దాని వల్ల రాష్ట్రానికి ఎంతో ఉపయోగముంటుందని చంద్రబాబు భావిస్తారు. ఇప్పటి వరకూ పదిహేనేళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలోనూ ప్రతి పనికీ రాజకీయాన్ని జోడించి తనకు కీర్తి ప్రతిష్టల స్థాయిని మరింత పెంచేలా చంద్రబాబు డిజైన్ చేస్తారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనూ ఇప్పటికీ హైదరాబాద్ ఐటీ రంగంలో అభివృద్ధి చెందిందని అన్నా, నేటికీ హైదరాబాద్ అత్యధికంగా ఆదాయాన్ని ఆర్జించి పెట్టే ప్రాంతంగా తీర్చిదిద్దింది ఎవరన్నా ప్రత్యర్థులు సయితం చంద్రబాబు వైపు వేళ్లు చూపించాల్సిందే.సంపద పెరుగుతుందని... అదే చంద్రబాబు నాయుడు కోరుకునేది. కావాల్సింది. అందుకే తాజాగా అమరావతి రాజధాని పునర్మిరాణ పనుల ప్రారంభం పేరిట చంద్రబాబు చేస్తున్న హడావిడి వెనక కూడా అంతే బలీయమైన ఆకాంక్ష ఉందంటున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ రాజధాని పనులకు శంకు స్థాపనలు చేసి వెళ్లిన తర్వాత ఈ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ ధరలు మరింత పెరుగుతాయని ఆయనకు తెలుసు. నిర్మాణ పనులు ప్రారంభమయిన తర్వాత ఇక్కడ ఒక్కసారిగా భూముల ధరలకు రెక్కలు వచ్చి రియల్ వ్యాపారం ఊపందుకుని పరోక్షంగా ప్రభుత్వానికి కూడా సంపద చేకూరుతుందని చంద్రబాబు అంచనా వేస్తున్నారు. అదే సమయంలో అనేక సంస్థలు కూడా అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తాయని చంద్రబాబు ఆశిస్తున్నారు. . అమరావతి పునర్నిర్మాణం పేరుతో ఖర్చు పెట్టే ప్రతి పైసా రాష్ట్రానికి అంతే వేగంగా తిరిగి వస్తాయని చంద్రబాబు భావిస్తున్నారు. అందుకోసమే కొంత ఆర్భాటమైనా తాను అనుకున్నది చేసి తీరాలన్న పట్టుదలతో చంద్రబాబు ఉన్నారు. ఒకటి కాదు..రెండు కాదు.. లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి అదనంగా సంపదను సమకూర్చుకోవాలంటే ఆ మాత్రం రిస్క్ తీసుకోక తప్పదు. వాస్తవానికి అయితే మరో ఏ ముఖ్యమంత్రి అయినా రాజధాని పునర్నిర్మాణ పనులు పేరిట ఇంత పెద్ద స్థాయిలో సభను ఏర్పాటుచేయరు. కానీ చంద్రబాబు ఆలోచన మాత్రం వేరుగా ఉంటుంది. అమరావతి కల సాకారమయితే తన పేరు చిరస్థాయిగా మిగిలిపోతుందన్న భావనతో ఆయన ఒక్కొక్క అడుగూ ముందుకు వేస్తున్నారు.. ప్రధాని నరేంద్ర మోదీ రావడంతో కొంత హైప్ రావడమే కాకుండా ఈ కార్యక్రమంతో చంద్రబాబుకు తన ఇమేజ్ కూడా మరింత పెరుగుతుందని తెలుసు. ఒకవైపు అభివృద్ధి మరొకవైపు సంక్షేమాన్ని కలగలుపుతూ తీసుకెళ్లేది చంద్రబాబు మాత్రమేనని ఇప్పటికే ప్రజలు నమ్ముతారు. ఆ నమ్మకం చెక్కు చెదరకుండా ఉండేందుకే చంద్రబాబు నాయుడు అమరావతి రాజధాని నిర్మాణ పనుల కు శంకుస్థాపన కార్యక్రమానికి భారీగా ప్లాన్ చేసినట్లు స్పష్టంగా అర్థమవుతుంది. మరొక వైపు దేశంలోనే అమరావతి బ్రాండ్ ఇమేజ్ పెరగడం ఖాయమని చంద్రబాబు అంచనా వేస్తున్నారు. మొత్తం మీద చంద్రబాబు నాయుడు ఆలోచనలు గ్రౌండ్ అయితే మాత్రం గ్రాండ్ సక్సెస్ అయినట్లేనని అనుకోవాల్సి ఉంటుంది.