
అనంతపురం , ఏప్రిల్ 30,
అమ్మ రాజీనామా.. ఇది ఒక సినిమా పేరు.. కానీ రియల్ లైఫ్‌లోనూ ఓ తల్లి అమ్మ పదవికి రాజీనామా చేసింది. కొన్ని అనివార్య కారణాలతోనే అమ్మ పదవికి న్యాయం చేయలేకపోతున్నానని.. పొత్తిళ్లలో ఉండాల్సిన తన పసిపాపను తీసుకెళ్లి రోడ్డు పక్కన వదిలేసింది. శిశువుకు చక్కగా స్నానం చేయించి ఓ బేబీ బెడ్‌లో పడుకోబెట్టి రోడ్డు పక్కన ఉంచింది. తాను అమ్మ పదవికి రాజీనామా చేస్తున్నట్లుగా ఓ లేఖను రాసి.. అందులో తన పాపను రోడ్డుపై ఎందుకు అలా అనాథగా వదిలి వెళ్లాల్సి వచ్చిందో వివరించింది. ఆ లేఖలో చివరిగా రాసిన ఐదు పదాలు ఎమోషనల్‌గా ఉన్నాయి. అనంతపురంలోని విజయనగరం కాలనీ అది.. అప్పుడే పుట్టిన ఆడ శిశువును రోడ్డు పక్కన వదిలేసి వెళ్లారు. పసికందు ఏడుపు విని అక్కడికి వెళ్లిన స్థానికులు చిన్నారిని అక్కున చేర్చుకున్నారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా.. వారు పాపను తీసుకెళ్లి ఆస్పత్రిలో చేర్చారు.. ఆ తర్వాత ఐసీడీఎస్ అధికారులు అక్కడికి వచ్చారు. చిన్నారిని తమ సంరక్షణలో ఉంచేందుకు తీసుకెళ్లారు. అయితే శిశువు దగ్గర తల్లిదండ్రులు రాసిన లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.ఆ లేఖలో.. 'ప్రియమైన మేడం, సార్ గారికి నా నమస్కరాలు.. నా కూతుర్ని నేను పోషించలేను.. మీరే నా కూతురికి ఒక మంచి జీవితం ఇవ్వాలని కోరుకుంటూ.. మీ దగ్గర వదిలి వెళ్లిపోతున్నాను. తన జీవితం బాగుండాలి.. తనని మీరే బాగా చూసుకోవాలని వేడుకుంటున్నాను. నేను చనిపోతున్నాను. నా కూతుర్ని బాగా చూసుకోండి సార్ ప్లీజ్.. ఒక తల్లిగా నా ఆవేదన.. పాపకి ఏమీ కాని ఓ తల్లి' అంటూ ఓ నోట్‌ను ఆ చిన్నారి పాప పక్కనే వదిలేసి వెళ్లారు. పాపను రోడ్డు పక్కన వదిలేసి ఈ లేఖ ఉంచింది ఎవరు అన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.. దగ్గరలోని సీసీ ఫుటేజ్‌ను పరిశీలించే పనిలో ఉన్నారు. అలాగే అనంతపురం పోలీసులు పాప గురించి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న స్థానికుల్ని అడిగి తెలుసుకుంటున్నారు.