
హైదరాబాద్, ఏప్రిల్ 30
కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎన్‌డీఎస్‌ఏ నివేదికను విడుదల చేసింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టలపై అధ్యయనం చేసిన ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ తుది నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందించింది. ఈ మేరకు సీఎస్ శాంతి కుమారికి ఎన్‌డీఎస్‌ఏ ఛైర్మన్ అనిల్ జైన్ ఇటీవల లేఖ రాశారు. బ్యారేజీల నిర్వహణ లోపాలే ఈ సమస్యలకు కారణమన్నారు. మేడిగడ్డలోని బ్లాక్‌లను పూర్తిస్థాయిలో పరీక్షించాలని నివేదికలో పేర్కొంది. .
మేడిగడ్డ బ్యారేజ్ ఘటన
2023 అక్టోబర్ 21 - మేడిగడ్డ బ్యారేజీలోని 7వ బ్లాక్ 20 నంబర్ పిల్లరు కుంగిపోయింది.
2023 అక్టోబర్ 22 - కాళేశ్వరం చీఫ్ ఇంజినీర్, సీడీఓలు బ్యారేజీ కుంగిన ప్రాంతాన్ని పరిశీలించి దీనిపై రాష్ట్ర ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక అందించింది.
2023 అక్టోబర్ 25 - నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణుల బృందం ఇంజినీరింగ్ చీఫ్, ఎల్ అండ్ టీ బ్యారేజీ నిర్మాణ సంస్థ ప్రతినిధులు బ్యారేజీ కుందిన ప్రాంతాన్ని పరిశీలించారు. అక్టోర్ 28వ తేదీన రామగుండం ఈఎన్సీ ఎన్డీఎస్ఏ బృందానికి బ్యారేజీ వివరాలు అందించారు.
2023 నవంబర్ 1న - నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణులు మేడిగడ్డ బ్యారేజీ కుంగడానికి కారణాలతో నివేదికను రూపొందించింది. నవంబర్ 4న తెలంగాణ ప్రభుత్వానికి సమర్పించింది.
2024 ఫిబ్రవరి 13న మేడిగడ్డ బ్యారేజీ కుంగిన నేపథ్యంలో మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం, బ్యారేజీలను పరిశీలించి సమగ్ర నివేదిక అందించాలని రాష్ట్రప్రభుత్వం ఎన్డీఎస్ఏను కోరింది. కాళేశ్వరం మూడు బ్యారేజీలను పరిశీలించేందుకు ఎన్డీఎస్ఏ ఏడుగురు నిపుణులతో కమిటీ ఏర్పాటు చేసింది.
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకలపై న్యాయ విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్ పినాకి చంద్రఘోష్ ను తెలంగాణ ప్రభుత్వం నియమించింది.
ఏప్రిల్ 24, 2025న ఎన్డీఎస్ఏ కాళేశ్వరం ప్రాజెక్టుపై తుది నివేదిక సమర్పించింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లపై అధ్యయనం చేసిన నిపుణుల కమిటీ...ప్రజాధనంతో నాణ్యత లేకుండా బ్యారేజీలను నిర్మించి ఘోరమైన మానవ నిర్మిత విపత్తును సృష్టించారని నివేదిక పేర్కొంది. బ్యారేజీ నిర్మాణంలో వైఫల్యం, క్వాలిటీ కంట్రోల్ లేకపోవడం, బ్యారేజీల ఆపరేషన్, మెయింటెనెన్స్ వైఫల్యాలను ఎన్డీఎస్ఏ కమిటీ ఎత్తి చూపించింది.ఎన్‌డీఎస్‌ఏ నివేదికపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మంగళవారం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వ కక్కుర్తి వల్ల రాష్ట్రానికి చాలా నష్టం జరిగిందని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో తీవ్రమైన లోపాలు ఉన్నట్లు ఎన్‌డీఎస్‌ఏ నివేదిక ఇచ్చిందన్నారు. ఈ నివేదిక ఇచ్చిన తర్వాత కూడా బీఆర్ఎస్ నేతలు సిగ్గుపడటం లేదని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి విమర్శించారు.ఎక్కువ కమీషన్లు కోసం కక్కుర్తి పడి బీఆర్ఎస్ నేతలు కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టారని ఆరోపించారు. కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు డీపీఆర్ అంచనాను భారీగా పెంచుకుంటూ పోయారని మండిపడ్డారు. రూ.80 వేల కోట్లకు అనుమతులు తీసుకుంటే, ఇప్పటికే రూ.లక్ష కోట్లు దాటిపోయిందని తెలిపారు.వివిధ పేర్లతో కార్పొరేషన్లు ఏర్పాటు చేసి రుణాలు తెచ్చారు. అధికశాతం వడ్డీకి స్వల్పకాలిక రుణాలు తీసుకుని బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టింది. ప్రాజెక్టు బీఆర్ఎస్ హయాంలోనే కూలిపోయింది. పార్లమెంట్ చట్టం ద్వారా ఏర్పడిన ఎన్‌డీఎస్‌ఏపై బీఆర్ఎస్ నేతలు చౌకబారు విమర్శలు చేస్తున్నారు" - మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
ఉత్తమ్ మాటలన్నీ అబద్దాలే
కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎన్డీఎస్‌ఏ నివేదిక మీద మంత్రి ఉత్తమ్ మాటలన్నీ అబద్ధాలేనని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. మేడిగడ్డలో అవినీతి జరిగిందని ఎన్డీఎస్‌ఏ నివేదికలో ఎక్కడా చెప్పలేదన్నారు. బీఆర్‌ఎస్ రజతోత్సవ సభపై చర్చ జరుగుంతోందనే అక్కసుతో ప్రజల దృష్టి మళ్లించేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తుందన్నారు. ఎన్డీఎస్‌ఏ ఎన్డీయే ప్రభుత్వ జేబు సంస్థగా మారిందని హరీశ్‌రావు విమర్శించారు.